తెలంగాణ

telangana

ఒడిశా బీఆర్​ఎస్ అధ్యక్షునిగా గిరిధర గమాంగ్‌! 18న ఖమ్మంలో ప్రకటించే అవకాశం

By

Published : Jan 13, 2023, 2:40 PM IST

Updated : Jan 14, 2023, 6:46 AM IST

CM KCR
CM KCR

14:38 January 13

కేసీఆర్‌ను కలిసిన ఒడిశా మాజీ సీఎం

Odisha Ex CM Meets KCR: ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఎంపీ గిరిధర్‌ గమాంగ్‌ను ఆ రాష్ట్ర బీఆర్​ఎస్ అధ్యక్షునిగా నియమించాలని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ నిర్ణయించారు. త్వరలోనే అక్కడ పార్టీ రైతువిభాగంతో పాటు రాష్ట్రశాఖను ప్రారంభించనున్నారు. ఒడిశా నుంచి తన కుమారుడు శిశిర్‌ గమాంగ్‌తో కలిసి శుక్రవారం హైదరాబాద్‌ వచ్చిన గిరిధర్‌ గమాంగ్‌ ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. తండ్రీకొడుకులిద్దరూ భారాసలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు.

గిరిధర్‌ గమాంగ్‌ను ఒడిశా రాష్ట్ర బీఆర్​ఎస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కేసీఆర్‌ కోరగా.. ఆయన సూత్రప్రాయంగా అంగీకరించారు. తన కుమారుడికి కూడా ప్రాధాన్య పదవి కావాలని కోరినట్లు తెలిసింది. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పలు పదవీబాధ్యతలు నిర్వర్తించిన కేసీఆర్‌ జాతీయ పార్టీని ఏర్పాటు చేయడం అభినందనీయమని గమాంగ్‌ అన్నట్లు తెలిసింది. భాజపాకు ప్రత్యామ్నాయంగా బీఆర్​ఎస్ వంటి జాతీయ పార్టీ అవసరం ఉందని ఆయన తెలిపారు. ఈ నెల 18న ఖమ్మంలో జరిగే భారాస ఆవిర్భావ సభ సందర్భంగా ఒడిశా సహా పలు రాష్ట్రాల అధ్యక్షులతో పాటు రైతు విభాగాల అధ్యక్షుల పేర్లను సైతం కేసీఆర్‌ ప్రకటించే వీలున్నట్లు తెలిసింది.

79 ఏళ్ల గమాంగ్‌ 1972లో కోరాపుట్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా లోక్‌సభకు తొలిసారి ఎన్నికయ్యారు. తర్వాత వరుసగా ఎనిమిది సార్లు ఎంపీగా గెలిచారు. ఎంపీగా ఉంటూనే 1999 ఫిబ్రవరి 17 నుంచి డిసెంబరు 6 వరకు ఒడిశా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ ఏడాది ఏప్రిల్‌ 17న కేంద్రంలోని వాజ్‌పేయీ ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా... గమాంగ్‌ ఎంపీగా వచ్చి వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఆ సర్కారు కూలిపోయింది. 2009 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత గమాంగ్‌ కాంగ్రెస్‌కు దూరమయ్యారు. 2015లో బీజేపీలో చేరి.. కొన్నాళ్లకు ఆ పార్టీకి రాజీనామా చేశారు.

బీఆర్‌ఎస్‌ పార్టీని ప్రకటించిన తర్వాత దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుస్తున్నారు. దేశంలో నెలకొన్న సమస్యలు, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌.. బీఆర్‌ఎస్‌ పార్టీ ఏపీ అధ్యక్షుడిని ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈనెల 18వ తేదీన ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు దేశ నలుమూలల నుంచి పలువురు రాజకీయ నేతలు, రైతు సంఘం నాయకులు హాజరుకాబోతున్న విషయం తెలిసిందే.

Last Updated : Jan 14, 2023, 6:46 AM IST

ABOUT THE AUTHOR

...view details