తెలంగాణ

telangana

'త్వరలో కొత్త జీహెచ్​ఎంసీ చట్టం.. వరదలకు శాశ్వత పరిష్కారం'

By

Published : Nov 16, 2020, 8:24 PM IST

త్వరలో కొత్త జీహెచ్ఎంసీ చట్టం తీసుకరాబోతున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ తెలిపారు. జల వనరుల ఆక్రమణలపై కొత్త చట్టంలో కఠినమైన నిబంధనలు పొందుపర్చుతామన్నారు. టీఎస్‌బీపాస్ దేశంలోనే అత్యుత్తమ భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియ విధానంగా నిలవబోతుందని పునరుద్ఘాటించారు. ప్రజలపై ఎంతో విశ్వాసంతో తీసుకొచ్చిన టీఎస్‌బీపాస్ ను విస్తృతంగా వినియోగించుకోవాలని... దుర్వినియోగపరిస్తే చర్యలకూ వెనకాడబోమని తేల్చిచెప్పారు.

ktr
ktr

'త్వరలో కొత్త జీహెచ్​ఎంసీ చట్టం.. వరదలకు శాశ్వత పరిష్కారం'

భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి యజమానులకు ఇబ్బందులు తప్పనున్నాయి. దరఖాస్తుదారు స్వీయధ్రువీకరణతో నిర్దేశించిన గడువులోగా భవన నిర్మాణానికి అనుమతులు జారీ కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సంస్కరణ టీఎస్​-బీపాస్‌ను మంత్రి కేటీఆర్​ ప్రారంభించారు. కొత్త విధానం వల్ల 75 గజాల స్థలంలో నిర్మించే భవనాలకు ఎలాంటి అనుమతి అవసరం లేదు. రూపాయి చెల్లించి టీఎస్​-బీపాస్‌ కింద నమోదు చేసుకోవచ్చు.

స్వీయ ధ్రువీకరణ ద్వారానే

600 గజాల లోపు గృహాలకు స్వీయధ్రువీకరణ ద్వారా దరఖాస్తు చేసుకుంటే అనుమతి ఇస్తారు. 10 మీటర్ల కంటే తక్కువ ఎత్తుండే గృహాలకు స్వీయ ధ్రువీకరణ ద్వారానే భవన నిర్మాణానికి అనుమతి లభిస్తుంది. 600 గజాలపైన, 10 మీటర్ల కంటే ఎత్తయిన భవనాలకు 21 రోజుల్లో అనుమతులు ఇస్తారు. ఉల్లంఘనలకు పాల్పడితే అనుమతులు ఇచ్చినంత సులువుగానే కఠిన చర్యలు ఉంటాని మంత్రి కేటీఆర్​ వెల్లడించారు.

అద్భుతమైన సంస్కరణ

ప్రపంచవ్యాప్తంగా నగరీకరణ వేగంగా పెరుగుతోంది. రాబోయే రోజుల్లో తెలంగాణలో 58 శాతం జనాభా పట్టణాల్లోనే ఉంటుంది. పట్టణాల్లో మౌలిక వసతులపై దృష్టి పెట్టాం. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా మెరుగైన సౌకర్యాలు కల్పించ వచ్చు. ధరణి పోర్టల్ ఓ సాహసోపేతమైన నిర్ణయం. అదే తరహాలో టీఎస్​-బీపాస్ ద్వారా అద్భుతమైన సంస్కరణ తీసుకొచ్చాం. ఇప్పటికే నూతన మున్సిపల్, పంచాయతీరాజ్, రెవెన్యూ చట్టాలు తీసుకొచ్చాం.

-కేటీఆర్‌, పురపాలక శాఖ మంత్రి

త్వరలో జీహెచ్​ఎంసీ చట్టం

రాబోయే రెండు, మూడు నెలల్లో కొత్త జీహెచ్ఎంసీ చట్టం తీసుకురాబోతున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇటీవల వరదలకు ప్రజలు ఇబ్బంది పడ్డారని.. తాత్కాలికంగా ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. శాశ్వత పరిష్కారం చూపే బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. నాలాలు, చెరువులు, జలవనరులను ఆక్రమించడమే ప్రధాన సమస్య అనడంలో సందేహం లేదన్నారు. కొత్త జీహెచ్ఎంసీ చట్టంలో కఠిన నిబంధనలు పొందుపరచనున్నట్లు ఆయన వెల్లడించారు. నాలాలు, చెరువులపై నిర్మాణాలను నోటీసు కూడా ఇవ్వకుండా కూల్చేలా చట్టం రూపొందిస్తామని కేటీఆర్ తెలిపారు.

అందుబాటు ధరలో...

ప్రజలకు అందుబాటు ధరలో గృహాలు అందించేందుకు నిర్మాణ సంస్థలు, ప్రభుత్వం కలిసి పనిచేయాలని కేటీఆర్ ఆకాంక్షించారు. డిమాండ్ ఉందన్న కారణంగా రేట్లు పెంచుకుంటూ పోతే నష్టపోతామని నిర్మాణ సంస్థలను కేటీఆర్ హెచ్చరించారు. హైదరాబాద్​లో అందుబాటు ధరలో గృహాలు ఉంటాయన్న పేరును నిలబెట్టుకోవాలన్నారు.

ఇదీ చదవండి :వక్ఫ్​బోర్డు సీఈఓకు చట్టాలపై అవగాహనలేదు.. ఆయన అవసరమా?

ABOUT THE AUTHOR

...view details