తెలంగాణ

telangana

కేంద్రం దిగిరాకపోతే నిరవధిక సమ్మెకు సిద్ధం: బ్యాంకు ఉద్యోగ సంఘాలు

By

Published : Mar 15, 2021, 4:22 PM IST

బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు హైదరాబాద్​లో రెండు రోజుల సమ్మెను ప్రారంభించాయి. ఆందోళనలో ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. కేవలం లాభాపేక్షే ధ్యేయంగా ప్రైవేటు బ్యాంకులు పనిచేస్తాయని.. పబ్లిక్​ సెక్టార్​ బ్యాంకులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఉద్యోగులు పేర్కొన్నారు.

nationwide banks strike
బ్యాంకు ఉద్యోగ సంఘాల సమ్మె

ప్రైవేటు బ్యాంకులకు సామాజిక బాధ్యత ఉండదని... కేవలం లాభాపేక్షే ధ్యేయంగా పని చేస్తాయని ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగ సంఘాలు విమర్శించాయి. బ్యాంకుల ప్రైవేటీకరణకు కేంద్రం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా... రెండు రోజుల సమ్మెను బ్యాంకు ఉద్యోగుల సంఘాలు హైదరాబాద్​లో ప్రారంభించాయి. దేశవ్యాప్త సమ్మెను యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్​ యూనియన్స్.. కోఠిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవరణలో నిర్వహించాయి. ధర్నాలో వివిధ బ్యాంకుల్లో పనిచేస్తున్న పది లక్షల మంది ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

నిర్ణయం సరికాదు

దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందిందంటే... దానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు కారణమని ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా మారుమూల గ్రామాల్లోకి తీసుకెళ్లామని వెల్లడించారు. పైవేటు బ్యాంకులు మెరుగ్గా పనిచేస్తాయనే నెపంతో పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడం సరికాదని హితవు పలికారు. ప్రైవేటు బ్యాంకుల అనాలోచిత నిర్ణయాలతో కార్పొరేట్ సంస్థలకు కోట్లలో లోన్లు ఇచ్చి... వాటిని వసూళ్లు చేయలేక మూతబడిన ఘటనలు చూస్తున్నామని చెప్పారు. ప్రైవేటీకరణ చేస్తే బ్యాంకింగ్ వ్యవస్థ 50 ఏళ్లు వెనక్కి వెళ్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

కాపాడుకోవాలి

ప్రభుత్వ బ్యాంకులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని... తాము చేస్తున్న సమ్మెకు ప్రజలు మద్దతు పలకాలని నాయకులు కోరారు. సమ్మె అనంతరం కేంద్రం దిగిరాకపోతే నిరవధిక సమ్మెకు వెళతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:అన్ని వర్గాల గొంతుకను వినిపిస్తా: ఎమ్మెల్యే రఘునందనరావు

ABOUT THE AUTHOR

...view details