తెలంగాణ

telangana

'ఆ విషయంలో రాష్ట్ర సర్కారు ఎలాంటి ప్రకటన చేయలేదు'

By

Published : Mar 19, 2021, 8:30 PM IST

రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కేంద్రాలను మూసివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని కేంద్రం స్పష్టం చేసింది. లోక్​సభలో నల్గొండ ఎంపీ ఉత్తమ్​ అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్​ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

'ఆ విషయంలో రాష్ట్ర సర్కారు ఎలాంటి ప్రకటన చేయలేదు'
'ఆ విషయంలో రాష్ట్ర సర్కారు ఎలాంటి ప్రకటన చేయలేదు'

తెలంగాణలోని ఐకేపీ స్వయం సహాయక బృందాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు నిర్వహిస్తున్న.. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కేంద్రాలను మూసివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రంలో పంటల కొనుగోలు కేంద్రాలు తొలగించడం కేంద్ర వ్యవసాయ చట్టాల్లో భాగమా అని లోక్​సభలో తాను అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్‌ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చినట్లు నల్గొండ ఎంపీ, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు.

పంట సేకరణ కేంద్రాలపై..

రాష్ట్రవ్యాప్తంగా పంటల సేకరణ కేంద్రాలు మూత పడతాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన కేంద్రానికి తెలుసా? లేదా? అని ప్రశ్నించినట్లు పేర్కొన్నారు. అలాగే కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను ఆమోదించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియ ప్రారంభించిందా...? అలా అయితే వివరాలు అందించాలని, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై మంత్రిత్వ శాఖ స్పందన ఏమిటని ప్రశ్నించినట్లు వివరించారు.

దీనిపై స్పందించిన కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు మూసివేస్తున్నట్లు ఎలాంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేయడంతో పాటు రైతులు పండించిన పంటలకు ఎంఎస్​పీకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని కూడా స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు. అంతేకాదు తెలంగాణ ఐకేపీ స్వయం సహాయక బృందాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు నిర్వహిస్తున్న సేకరణ కేంద్రాలకు తమ ఉత్పత్తులను విక్రయించే రైతుల సంఖ్యను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించినట్లు కేంద్రం తెలిపిందని పేర్కొన్నారు. 1,953 ఐకేసీ స్వయం సహాయక బృందాల ద్వారా 1.33 కోట్ల క్వింటాళ్లు , 4091 ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 3.41కోట్ల క్వింటాళ్ల లెక్కన... మొత్తం 6044 కేంద్రాల ద్వారా 4.75 కోట్ల క్వింటాళ్ల వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు సమాధానం ఇచ్చిన వివరాల్లో పేర్కొన్నట్లు ఉత్తమ్​ తెలిపారు.

ఇదీ చదవండి: కృష్ణా జలాల వివాదంపై బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్‌లో విచారణ

ABOUT THE AUTHOR

...view details