తెలంగాణ

telangana

దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందనడానికి 'వందే భారత్' ఒక నిదర్శనం: ప్రధాని మోదీ

By

Published : Jan 15, 2023, 6:44 PM IST

Modi Comments on Vande Bharat Train : నవ భారత సంకల్పం, సామర్థ్యానికి వందేభారత్ రైలు ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఇతరులపై ఆధారపడే మనస్తత్వం నుంచి బయటపడి.. స్వావలంభన దిశగా సాగుతున్న ఆత్మనిర్భర భారతావనికి నిదర్శనమని తెలిపారు. సికింద్రాబాద్-విశాఖ పట్నం మధ్య వందేభారత్ రైలును ప్రధాని వర్చువల్​గా ప్రారంభించారు.

Vande Bharat Train Launch
Vande Bharat Train Launch

Modi Comments on Vande Bharat Train : తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందేభారత్ రైలు పట్టాలెక్కింది. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య తిరిగే రైలును ప్రధాని నరేంద్రమోదీ దిల్లీ నుంచి వర్చువల్​గా జెండా ఊపి ప్రారంభించారు. సంక్రాంతి పర్వదినం రోజున ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గొప్ప కానుక అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కొత్తగా ప్రారంభించిన వందే భారత్ రైలు సికింద్రాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం ప్రజలకు వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తుందన్నారు. ఈ ప్రాంతాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి వందేభారత్ రైలు దోహదపడుతుందన్నారు. ఈ రైలు సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుందన్నారు.

భారత దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పడానికి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఒక నిదర్శనమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో అత్యాధునిక సౌకర్యాలతో తయారైన వందేభారత్.. ఆత్మనిర్భర్ భారత్​కు ప్రతీక అని తెలిపారు.దేశం సమగ్ర అభివృద్ధికి వివిధ ప్రాంతాల అనుసంధానం వల్ల వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సామాన్యులకు మెరుగైన కనెక్టివిటీని అందిస్తోందన్నారు. ఇప్పటి వరకు 40 లక్షల మంది ప్రయాణికులు ఈ రైళ్లలో ప్రయాణించారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం గత 8 ఏళ్లలో రైల్వేలో పెద్దఎత్తున అభివృద్ధిని సాధించిందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి 2022-23 సంవత్సరానికి బడ్జెట్‌లో రూ.3,048 కోట్లు కేటాయించామని.. గతంతో పోలిస్తే ఇది దాదాపు 12 రెట్లు ఎక్కువ అని ప్రధాని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాలను కేంద్రం పటిష్టం చేసిందన్నారు. మెరుగైన రైళ్ల అనుసంధానం వల్ల వ్యాపారాలకు మార్గం సుగమం చేసిందని, ఈ ప్రాంతాలలో జీవన సౌలభ్యాన్ని మెరుగుపరిచిందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. కొత్త రైల్వే లైన్లతో పాటు విద్యుద్దీకరణను వేగవంతంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్​లో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అశ్వినీ వైష్ణవ్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్రమంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీలు బండి సంజయ్, లక్ష్మణ్​లు, రైల్వే బోర్డ్ ఛైర్మన్ అనిల్ కుమార్ లహోటి, దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌, తదితరులు పాల్గొన్నారు.

సికింద్రాబాద్‌లోని 10వ నంబర్‌ ప్లాట్‌ ఫాం నుంచి ప్రారంభమైన వందేభారత్‌ రైలులో.. 16 బోగీలు ఉన్నాయి. అందులో 14 చైర్ కార్ బోగీలు, మరో రెండు ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్ బోగీలుంటాయన్నారు. మొత్తంగా రైలులో 1,128 మంది ప్రయాణించవచ్చు. ఆదివారం మినహా వారంలో ఆరు రోజులు ఈ రైలు సికింద్రాబాద్-విశాఖల మధ్య పరుగులు పెట్టనుంది. మెట్రో రైల్‌ తరహాలో స్లైండింగ్‌ తలుపులు, ప్రయాణికుల భద్రత, సురక్షిత ప్రయాణానికి ప్రాధాన్యమిచ్చారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details