తెలంగాణ

telangana

Niranjan Reddy: 'నకిలీ విత్తన రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం'

By

Published : Jun 12, 2021, 4:56 PM IST

రాష్ట్రంలో నకిలీ విత్తనాలు లేకుండా చేయాలన్న లక్ష్యంతోనే టాస్క్​ఫోర్స్ బృందాలు పనిచేస్తున్నాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి అన్నారు. నకిలీ విత్తనాల నియంత్రణకు చేపట్టిన చర్యలు సత్ఫాలితాలనిస్తున్నాయని ఆయన తెలిపారు. నకిలీ విత్తనాలు అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై రంగారెడ్డి కలెక్టరేట్​ నుంచి మంత్రి సింగిరెడ్డి దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షించారు.

Minister Niranjan Reddy
అధికారులతో వ్యవసాయశాఖమంత్రి నిరంజన్​ రెడ్డి సమీక్ష

రాష్ట్రాన్ని నకిలీ విత్తన రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని వ్యవసాయశాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా పోలీసు, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా చేస్తున్న కృషి ప్రశంసనీయమని మంత్రి అభినందించారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ఏర్పాటైనా టాస్క్​ఫోర్స్​ బృందాలతో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. అయినప్పటికీ అక్కడక్కడా ఇంకా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్టు తనిఖీల్లో బయట పడుతోందని చెప్పారు. విత్తన కంపెనీలకు లైసెన్సుల జారీని మరింత సరళతరం చేసే అవకాశాలు పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు.

రాష్ట్రంలో నకిలీ విత్తనాల విక్రయదారులపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని డీజీపీ మహేందర్​ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది ఇప్పటికే 320 మందిపై 209 కేసులు నమోదు చేసి 6,511 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నామని డీజీపీ వెల్లడించారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ప్రశంసించారు. ఇతర రాష్ట్రాల నుంచి కల్తీ విత్తనాలు అక్రమంగా రవాణా చేసి విక్రయించే వారిపై కూడా పీడీ చట్టం నమోదు చేయాలని డీజీపీ పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం సాగు అవుతున్నందున నకిలీ విత్తనాల చెలామణిపై కఠినంగా వ్యవహారించాలని ఐజీ నాగిరెడ్డి అన్నారు. న్యాయబద్ధంగా విత్తన వ్యాపారం చేసుకునే వర్తకులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని స్పష్టం చేశారు. నిరంతరం కల్తీ విత్తన వ్యాపారానికి పాల్పడే అక్రమార్కులపై సంబంధిత స్టేషన్లకు కూడా సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, విత్తనాభివృద్ధిసంస్థ ఎండీ కేశవులు, ఐజీ నాగిరెడ్డి, అన్ని జిల్లాల పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, డీఎస్పీలు, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:భారీగా నకిలీ విత్తనాల దందా.. రూ. కోటి విలువైన సరుకు పట్టివేత

ABOUT THE AUTHOR

...view details