తెలంగాణ

telangana

డేటా సెంటర్లకు హైదరాబాదే బెస్ట్.. కేంద్రానికి కేటీఆర్ లేఖ

By

Published : Feb 16, 2023, 7:18 PM IST

KTR Letter to Nirmala Sitharaman: డేటా కేంద్రాలను గుజరాత్​లో ఏర్పాటు చేసేలా కేంద్ర బడ్జెట్​లో ప్రతిపాదనలు రూపొందించడంపై ఐటీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఒకే ప్రాంతంలో అంతర్జాతీయ డేటా కేంద్రాలు ఏర్పాటు చేయడం సరైన విధానం కాదన్నారు. భూకంపాలు ఎక్కువ వచ్చే అవకాశం, అంతర్జాతీయ సరిహద్దు రాష్ట్రంలో నిర్మిస్తే భద్రతాపరంగానూ ముప్పు అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేటీఆర్... నిర్మలా సీతారామన్​కు లేఖ రాశారు.

KTR
KTR

KTR Letter to Nirmala Sitharaman: అంతర్జాతీయ డేటా కేంద్రాలను ఎక్కువ సంఖ్యలో గుజరాత్​లో ఏర్పాటు చేయడం సరైన నిర్ణయం కాదని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​కు లేఖ రాశారు. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీలో డేటా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు బడ్జెట్​లో పొందుపర్చారని... ఒకేచోట ఎక్కువ కేంద్రాలు ఏర్పాటు చేయడం మంచిది కాదని కేటీఆర్ విమర్శించారు. భూకంపాల తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతానికి గుజరాత్ సమీపంలోనే ఉందనే విషయాన్ని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. అంతే కాకుండా అంతర్జాతీయ సరిహద్దు రాష్ట్రంలో నిర్మిస్తే భద్రతాపరంగానూ ముప్పు వాటిల్లే ప్రమాదముందని కేటీఆర్ అన్నారు.

డేటా కేంద్రాలకు హైదరాబాద్ అనుకూలం : అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి పేరొందిన అంతర్జాతీయ సంస్థలు తమ డేటా కేంద్రాల కోసం ఇప్పటికే హైదరాబాద్​ను ఎంచుకున్నాయని... అన్ని రకాలుగా హైదరాబాద్ ఎంతో అనువైన స్థలమని కేటీఆర్ తెలిపారు. దేశంలో ఏ ఇతర రాష్ట్రంతో పోల్చినా భాగ్యనగరంలో భూకంపాలు వచ్చే అవకాశం అతి తక్కువ అని లేఖలో పేర్కొన్నారు. డేటా కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకుంటున్న అంతర్జాతీయ సంస్థలకు ప్రాంతాలను ఎంచుకునే స్వేచ్ఛను ఇవ్వాలని కేటీఆర్ సూచించారు. రిస్క్ ఉన్న ప్రాంతాల్లో డేటా కేంద్రాలు ఏర్పాటు చేయిస్తే అంతర్జాతీయ సంబంధాలపై ప్రభావం పడొచ్చన్నారు.

వాటి నిర్వహణలో తెలంగాణ ఇప్పటికే నిరూపించుకుంది:తెలంగాణ ప్రభుత్వం 2016లో డేటా కేంద్రాల ఏర్పాటుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. అత్యధిక వేగంతో కూడిన ఫైబర్ నెట్ వర్క్, తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేయడంతో పాటు.. ప్రత్యేక గ్రిడ్లు ఏర్పాటు చేసి నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. హైదరాబాద్​లో డేటా కేంద్రాలు ఏర్పాటు చేసిన సంస్థలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయన్న ఆయన.. అంతర్జాతీయ డేటా కేంద్రాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ తెలిపారు.

డేటా కేంద్రాల భద్రతకు తగిన విధంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే విధంగా బడ్జెట్​లో మార్పులు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ను మంత్రి కేటీఆర్ కోరారు. దీనివల్ల అన్ని రాష్టాల్లో డేటా కేంద్రాలు ఏర్పాటు చేయడానికి వీలవుతుందని కేటీఆర్ సూచించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details