తెలంగాణ

telangana

KTR at World Economic Forum 2022 : తెలంగాణలో రూ.500 కోట్లతో పైపుల పరిశ్రమ

By

Published : May 24, 2022, 7:54 PM IST

Updated : May 25, 2022, 7:58 AM IST

KTR at World Economic Forum 2022 : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్, డాటా సైన్సెస్ వంటి సాంకేతిక పరిజ్ఞానం రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటివని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. వాటి ఉపయోగాలతో కలిగే లాభనష్టాలపై ప్రభుత్వాలకు పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలని తెలిపారు. స్విట్జర్లాండ్​లోని దావోస్​లో జరుగుతున్న ప్రపంచ ఆర్థికవేదిక చర్చాగోష్టిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ ది స్ట్రీట్- మేనేజింగ్ ట్రస్ట్ ఇన్ ది పబ్లిక్ స్క్వేర్ అనే అంశంపై మంత్రి ప్రసంగించారు. మరోవైపు బెల్జియంకు చెందిన అలియాక్సిస్‌ సంస్థ తెలంగాణలో రూ. 500 కోట్లతో పైపులు, ఇతర ప్లాస్టిక్‌ ఉత్పత్తుల భారీ పరిశ్రమ ఏర్పాటుకు నిర్ణయించింది. దీని ద్వారా 500 మందికి ఉపాధి కల్పించనుంది. ఈ మేరకు దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది.

KTR at World Economic Forum
KTR at World Economic Forum

KTR at World Economic Forum 2022 : ఫేషియల్ రికగ్నిషన్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ విస్తృత ఉపయోగానికి ప్రజల విశ్వాసం, నమ్మకం పొందడమే ప్రభుత్వాలకు అసలైన సవాల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. డేటా భద్రత, వినియోగంలో నిష్పక్షపాతంగా వ్యవహరించడంతో పాటు అనుమతి లేకుండా ఈ టెక్నాలజీని నిఘా కార్యకలాపాలకు ఉపయోగించమన్న భరోసా ప్రజలకు కల్పించాల్సిన అవసరముందని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్, డాటా సైన్సెస్ వంటి సాంకేతిక పరిజ్ఞానం రెండు వైపులా పదును ఉన్న కత్తిలాంటివని అన్నారు. స్విట్జర్లాండ్​లోని దావోస్​లో జరుగుతున్న ప్రపంచ ఆర్థికవేదిక చర్చాగోష్టిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ ది స్ట్రీట్- మేనేజింగ్ ట్రస్ట్ ఇన్ ది పబ్లిక్ స్క్వేర్ అనే అంశంపై కేటీఆర్ ప్రసంగించారు. ఈ చర్చాగోష్టిలో కేటీఆర్​తో పాటు ఎన్ఈసీ జపాన్ సీఈఓ తకాయుకి మోరిటా, ఉషాహిది- దక్షిణాఫ్రికా ఈడీ ఎంజీ నికోల్ ఎడ్జ్ టెక్ సీఈఓ కోయెన్ వాన్ ఓస్ట్రోమ్ పాల్గొన్నారు.

KTR at WEF 2022 : సాంకేతికతల వినియోగంపై ప్రభుత్వ విభాగాలకు ఉండాల్సిన నియంత్రణ, అధికారాలను స్పష్టంగా నిర్దేశించినప్పుడే ఇది సాధ్యమవుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ అధికారాలను పార్లమెంటరీ పద్ధతిలో, పారదర్శకంగా ప్రభుత్వ విభాగాలకు కల్పించాలని సూచించారు. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీతో నేరస్థులు, తప్పిపోయిన వ్యక్తులను గుర్తించడంలో పోలీసులకు వ్యక్తులపై ఆధారపడే అవసరం తగ్గుతోందని మంత్రి తెలిపారు. సరైన విధానంలో ఈ టెక్నాలజీని వినియోగిస్తే పోలీసులతో పాటు ప్రజలకు కూడా విస్తృత ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఫేషియల్ రికగ్నిషన్​తో సేకరించే డాటా, వచ్చే ఫలితాన్ని ముందుగా ప్రజలతో పంచుకున్నప్పుడే ఈ ప్రక్రియ విజయవంత అవుతుందన్న నమ్మకం తనకుందని కేటీఆర్ అన్నారు. ఫేషియల్ రికగ్నిషన్​తోనే నేర నియంత్రణ, సమర్థవంతమైన పోలీసింగ్ సాధ్యమవుతుందన్న విషయాన్ని ప్రభుత్వాలు కూడా అర్థం చేసుకుంటున్నాయని అన్నారు. ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం కలిగించేలా మరిన్ని చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

KTR at Davos WEF 2022 : బెల్జియంకు చెందిన అలియాక్సిస్‌ సంస్థ తెలంగాణలో రూ. 500 కోట్లతో పైపులు, ఇతర ప్లాస్టిక్‌ ఉత్పత్తుల భారీ పరిశ్రమ ఏర్పాటుకు నిర్ణయించింది. దీని ద్వారా 500 మందికి ఉపాధి కల్పించనుంది. ఈ మేరకు దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, అలియాక్సిస్‌ కంపెనీ సీఈవో కోయిన్‌ స్టికర్‌ దీనిపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా స్టికర్‌ మాట్లాడుతూ, భారత్‌లో అతిపెద్ద పైపుల మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని తాము భారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నామని, తెలంగాణలోని అత్యుత్తమ విధానాలు తమను ఆకట్టుకున్నాయని తెలిపారు. దేశీయ మార్కెట్‌తో పాటు ఎగుమతుల కోసం అంతర్జాతీయ స్థాయి ప్లాస్టిక్‌ ఉత్పత్తులను తెలంగాణలో తయారు చేస్తామని చెప్పారు. ‘ఆశీర్వాద్‌’ పేరుతో పైపులను ఉత్పత్తి చేయనున్న ఈ సంస్థకు అన్ని విధాలా సహకరిస్తామని కేటీఆర్‌ తెలిపారు.

మాకు రెండో అతిపెద్ద కార్యాలయం:హైదరాబాద్​లోని కార్యాలయం తమకు రెండో అతిపెద్ద కార్యాలయంగా మారిందని అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం నోవార్టిస్ ప్రకటించింది. దావోస్​లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్​ ఫోరం​లో మంత్రి కేటీఆర్​తో సమావేశమైన నోవార్టిస్ సీఈవో వసంత్ నరసింహన్... రాష్ట్రంలో విస్తరణ ప్రణాళికలపై చర్చించారు. హైదరాబాద్​లో తమ కార్యాలయాన్ని ప్రారంభించిన స్వల్ప కాలంలోనే అద్భుతమైన వృద్ధిని సాధించిందన్న ఆయన... భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మల్టీ నేషనల్ ఫార్మా కంపెనీల్లో తమ క్యాపబిలిటీ సెంటర్ అతి పెద్దదని తెలిపారు. స్విట్జర్లాండ్ బాసెల్​లోని తమ కేంద్ర కార్యాలయం తర్వాత సుమారు 9 వేల మంది ఉద్యోగులతో హైదరాబాద్ కేంద్రం రెండో అతి పెద్ద కార్యాలయంగా మారిందని వివరించారు. హైదరాబాద్​లో ఉన్న ఇన్నోవేషన్, నైపుణ్యం కలిగిన మానవ వనరుల వల్లే ఇది సాధ్యమైందన్న నరసింహన్... ఈ కేంద్రాన్ని తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా, డిజిటల్ కార్యక్రమాలకు ఆసియా పసిఫిక్ కేంద్రంగా ఎంచుకున్నట్లు నోవార్టిస్ సీఈవో వసంత్ నరసింహన్ తెలిపారు.

నోవార్టిస్ సీఈవో వసంత్ నరసింహన్​తో కేటీఆర్

కంపెనీ వృద్ధిపై అభినందనలు తెలిపిన మంత్రి కేటీఆర్.. కేంద్ర కార్యాలయానికి వెలువల హైదరాబాద్ అతిపెద్ద కార్యక్షేత్రంగా మారడం అత్యంత సంతోషదాకరమని అన్నారు. నోవార్టిస్ విస్తరణతో తెలంగాణ లైఫ్ సైన్స్ రంగానికి ఎంతో మేలు చేకూరుతుందని కేటీఆర్ తెలిపారు. నోవార్టిస్ వల్ల ప్రపంచ లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ ఒక అగ్రశ్రేణి, ఆకర్షణీయ పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందని చెప్పారు. హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టం ప్రతిష్ట మరింత ఇనుమడిస్తుందన్న కేటీఆర్... హైదరాబాద్​లో భారీగా విస్తరించిన నోవార్టిస్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు.

నోవార్టిస్ సీఈవో వసంత్ నరసింహన్​కు సన్మానం

ఆహారకొరత ఎదుర్కొనే ప్రమాదం: ప్రపంచవ్యాప్తంగా భూమి సారాన్ని కోల్పోతోందని, ఈ సమస్యతో త్వరలోనే ఆహారకొరత ఎదుర్కొనే ప్రమాదం ఉందని సద్గురు శ్రీ జగ్గీ వాసుదేవ్ ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ అనుకూల కార్యక్రమాలను అన్ని ప్రభుత్వాలు అత్యంత వేగంగా శ్రీకారం చుట్టాల్సిన అవసరముందని ఆయన అన్నారు. దావోస్ పర్యటనలో ఉన్న పురపాలక, పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సద్గురుతో సంభాషణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా సేవ్ సాయిల్ పేరిట అవగాహనా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న జగ్గీవాసుదేవ్... ప్రపంచ ఆర్థికవేదిక సదస్సు సందర్భంగా వివిధ కంపెనీలను కలిసి తన కార్యక్రమంలో కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వాధినేతలు, కార్పొరేట్ కంపెనీలతోనూ సమావేశమవుతున్నారు. తెలంగాణ పెవిలియన్​లో సద్గురుతో మంత్రి కేటీఆర్ సంభాషించారు.

సద్గురు శ్రీ జగ్గీ వాసుదేవ్​తో కేటీఆర్

తాను చేపట్టిన సేవ్ సాయిల్ కార్యక్రమం వివరించిన సద్గురు... రానున్న 2, 3 దశాబ్దాల్లో ప్రపంచంలోని వ్యవసాయ యోగ్యమైన నేలలు అంతరించి పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పట్నుంచి భూమిని పంటలకు అనుగుణంగా సారవంతం చేసే కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం లండన్ నుంచి కావేరి వరకు సేవ్ సాయిల్ ర్యాలీ చేపట్టి ప్రాధాన్యత అవసరాన్ని వివరిస్తున్నట్లు సద్గురు తెలిపారు.

సేవ్ సాయిల్ ర్యాలీ అద్భుతం:తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు పర్యావరణ అనుకూల కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద మానవ ప్రయత్నాల్లో ఒకటైన హరితహారం సహా వ్యవసాయ రంగంలో అనేకమైన విప్లవాత్మకమైన మార్పులు, మద్దతు కార్యక్రమాలతో వ్యవసాయ ఉత్పత్తుల పెంపునకు చేస్తున్న కృషిని వివరించారు. భారతదేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెబుతున్న కేంద్రప్రభుత్వం ఆ లక్ష్యాన్ని సాధించడంలో విఫలమైందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చకుంటే సంక్షోభం వచ్చే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. సద్గురు చేపట్టిన సేవ్ సాయిల్ ర్యాలీ అద్భుతమైన కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. సద్గురును ఆయన హైదరాబాద్​కు ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకు వచ్చిన కార్యక్రమాలను ప్రశంసించిన సద్గురు... వ్యవసాయరంగంలో రైతుల ఆదాయం పెంపునకు చేపట్టిన కార్యక్రమాలపై తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తమ సంస్థ సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రభుత్వాలు, కార్పొరేట్లు, ప్రజలు కలిసి రానున్న భవిష్యత్ తరాలకు అవసరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయగలిగేలా వ్యవసాయ నేలలను కాపాడుకోవాల్సిన అవసరముందని అన్నారు. ఈ దిశగా తమతో కలిసి రావాలని సద్గురు పిలుపునిచ్చారు. సద్గురు ఆశీర్వాదాన్ని తీసుకున్న కేటీఆర్... మర్యాదపూర్వకంగా ఆయన వాహనం వద్దకు వెళ్లి సాగనంపారు.

ఇవీ చూడండి:త్వరలోనే హైదరాబాద్​కు వస్తా..: దావోస్​లో కేటీఆర్​తో మహారాష్ట్ర మంత్రి

ఒడిశాలో 'టమాట ఫ్లూ' కలకలం.. 26 మందికి పాజిటివ్​

Last Updated : May 25, 2022, 7:58 AM IST

ABOUT THE AUTHOR

...view details