తెలంగాణ

telangana

కొత్త వేరియంట్​పై ఆందోళన వద్దు.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: హరీశ్​రావు

By

Published : Dec 22, 2022, 9:36 PM IST

Updated : Dec 23, 2022, 7:05 AM IST

కరోనా మహమ్మారి మరోమారు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. చైనాలో ప్రారంభమైన ప్రకంపనలు ఇప్పటికే పలు దేశాలకు వ్యాప్తి చెందగా.. భారత్‌లోనూ ఇప్పటికే ఒమిక్రాన్  బీఎఫ్7 కేసులు నమోదు కావటంతో కేంద్రం... రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కొత్తగా వస్తున్న కరోనా కేసుల శాంపిళ్లను జీనోం సీక్వెన్సింగ్​కి పంపాలన్న కేంద్రం ఆదేశాలతో.. రాష్ట్ర అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. మంత్రి హరీశ్‌రావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి అధికారులకు మార్గనిర్దేశం చేశారు.

Minister Harishrao
మంత్రి హరీశ్​రావు

కరోనా మహమ్మారి 2020 మార్చ్ నుంచి దాదాపు రెండేళ్ల పాటు ప్రజలను వణికించింది. మాస్కులు, లాక్‌డౌన్‌లు, ఐసోలేషన్ లు, సొంతవాళ్ల మరణాలతో.. అతలాకుతలమైనప్పటికీ గత కొన్ని నెలలుగా కాస్త ఉపశమనం లభించినట్లయ్యింది. కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో వ్యాక్సిన్ల వైపు సైతం ప్రజలుపెద్దగా ఆసక్తి కనబరచటం లేదు. అంతటా సాధారణ వాతావరణం నెలకొంటోందని సంతోషిస్తున్న సమయంలో.. ఉన్నట్టుండి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి. ఇప్పటికే కొత్తగా నమోదవుతున్న కోవిడ్ కేసుల నమూనాలను జీనోం సీక్వెన్సింగ్‌కు పంపాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.

కేంద్రం మార్గదర్శకాల నేపథ్యంలో.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా పట్ల ఆందోళన చెందవద్దని, అయితే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ, కొవిడ్ టీకా తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని.. బూస్టర్ డోసు వేసుకోవాలని కోరారు. కొవిడ్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉందని.. ప్రజలు ఎటువంటి భయాందోనళకు గురి కావద్దని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్ధేశంతో రాష్ట్రం ఇప్పటికే కరోనాను విజయవంతంగా ఎదుర్కొని దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా నిలచిందని గుర్తుచేశారు.

కరోనా వ్యాప్తి మన వద్ద లేనప్పటికీ.. ముందు జాగ్రత్తగా అన్నింటినీ పరిశీలించుకోవాలని.. మానవ వనరులు, ఔషధాలు, ఆక్సిజన్, ఐసీయూ పడకలు, తదితరాలను పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు పాజిటివ్ వచ్చిన నమూనాలను జీనోమ్ సీక్వెన్స్ కోసం... గాంధీ ఆసుపత్రికి పంపాలని.. విమానాశ్రయంలో స్క్రీనింగ్ నిర్వహించాలని మంత్రి హరీష్ రావు అధికారులకు స్పష్టం చేశారు. ఒమిక్రాన్‌ బీఎఫ్7 వ్యాప్తి నేపథ్యంలో తిరిగి ప్రజలు కొవిడ్ ఆంక్షలు పాటించాలని.. సమూహంలో ఉన్నప్పుడు తప్పని సరిగా మాస్కులు ధరించటం... ఏ మాత్రం జ్వరం, జలుబు వంటి లక్షణాలు ఉన్నా అప్రమత్తంగా వ్యవహరించటం ద్వారా.... కొవిడ్ మరోమారు విజృంభించకుండా చూసుకోవచ్చని అధికారులు, వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 23, 2022, 7:05 AM IST

ABOUT THE AUTHOR

...view details