తెలంగాణ

telangana

Millet Restaurant at RGI Airport : మిల్లెట్​ రెస్టారెంట్​ @శంషాబాద్ ఎయిర్​పోర్ట్​.. దేశంలోనే తొలిసారిగా మన హైదరాబాద్​లో

By

Published : Jul 31, 2023, 10:02 AM IST

Millet Marvels Restaurant at RGI Airport : మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్ల నేపథ్యంలో చిరుధాన్యాల వినియోగం పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సాధారణ హోటళ్ల తరహాలో ప్రత్యేకించి మిల్లెట్ రెస్టారెంట్లు అందుబాటులోకి వస్తున్నాయి. దేశంలో తొలిసారిగా శంషాబాద్‌ విమానాశ్రయంలో మిల్లెట్ మార్వెల్‌ పేరుతో ఓ రెస్టారెంట్ కొలువైంది. దేశ, విదేశీ ప్రయాణికుల సౌకర్యార్థం.. త్వరలో దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లోనూ ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు.

Millet marvel
Millet marvel

మిల్లెట్ మార్వెల్.. శంషాబాద్​లో ఎయిర్​పోర్టులో ప్రారంభం

Millet Marvel Restaurant at Shamshabad Airport : జాతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ న్యూట్రీ హబ్ సహకారంతో "మిల్లెట్ మార్వెల్స్‌ అంకుర సంస్థ" ఆధ్వర్యంలో హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎక్స్‌క్లూజివ్ మిల్లెట్ రెస్టారెంట్‌ ప్రారంభమైంది. దీనికి ఎయిర్​పోర్టు, అపోలో హాస్పిటల్స్ యాజమాన్యాలు కూడా తన వంతు సహకారం అందిస్తున్నాయి. విమానయానం సాగించే పాన్ ఇండియా సహా.. విదేశీ ప్రయాణికులను విశేషంగా ఆకర్షించేందుకు ఈ మిల్లెట్ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. త్వరలో దిల్లీ, చెన్నై విమానాశ్రయాల్లో.. ఆ తర్వాత దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లోనూ ఇలాంటి రెస్టారెంట్లను ప్రారంభించనున్నామని మిల్లెట్ మార్వెల్స్ అధిపతి, ప్రముఖ నటుడు డాక్టర్ భరత్‌రెడ్డి అన్నారు.

'బెస్ట్‌ స్టార్టప్‌' అవార్డు.. ఎయిర్‌పోర్ట్‌ ప్రాంగణంలో ఏర్పాటైన ఈ మిల్లెట్ రెస్టారెంట్‌ 150 చదరపు అడుగుల సర్వీస్‌ ఏరియాతో, ఒకేసారి 300 మందికి భోజన సదుపాయం కల్పించే సామర్థ్యం కలిగి ఉంది. ఈ కామర్స్‌, సూపర్‌ మార్కెట్లు, ఫుడ్‌ డెలివరీ సంస్థల ద్వారానూ.. వినియోగదారులకు సేవలను అందిస్తుంది. మిల్లెట్ మార్వెల్స్‌ సంస్థకు కేంద్రం 'బెస్ట్‌ స్టార్టప్‌' అవార్డును సైతం అందజేసింది.

ఇక్కడ మిల్లెట్స్‌తో తయారు చేసే ఇడ్లీ, వడ, దోశ, షెజ్వాన్‌ పిజ్జా, ఊతప్పం, పొంగల్‌, ఉప్మా, పూరీ, ఆలూ పరాటా సహా... పలు ఆహార పదార్థాలు అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఐదేళ్లల్లో 400 చిరుధాన్యాల అంకుర కేంద్రాలు, వ్యాపార సంస్థలకు శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని ఐఐఎమ్​ఆర్ న్యూట్రీహబ్ సీఈవో డాక్టర్ దయాకర్‌రావు తెలిపారు.

దేశంలో పెరుగుతున్న జనాభా నేపథ్యంలో ఆహార భద్రత పెద్ద సవాల్‌గా మారింది. మారుతున్న జీవనశైలి, ఉరుకుల పరుగుల జీవితాల్లో వ్యాధుల బారినపకుండా ప్రాచీన చిరుధాన్యాలు ఆహారంలో భాగం చేసుకోవాలని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా మనుషులు తినే ఆహారంలో మార్పు తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మిల్లెట్‌ మార్వెల్‌ నిర్వాహకులు చెబుతున్నారు.

"మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ఆహార పద్ధతులు మార్చాలని డాక్టర్లు సూచిస్తున్నారు. మిల్లెట్ భోజనంపై​ వివిధ పరిశోధనల అనంతరం.. ఎయిర్​పోర్టులో రెస్టారెంట్ ఏర్పాటుకు మాకు ఈ అవకాశం ఇచ్చారు. త్వరలో దిల్లీ, చెన్నై విమానాశ్రయాల్లో.. ఆ తర్వాత దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లోనూ ఇలాంటి రెస్టారెంట్లను ప్రారంభిస్తాం". - డా. భరత్‌రెడ్డి, మిల్లెట్ మార్వెల్స్ అధిపతి

"ప్రజలు చిరు ధాన్యాలతో చేసిన ఆహారంపై దృష్టి సారించాలి. చిరుధాన్యాలతో చేసిన ఉత్పత్తుల అమ్మకానికి.. దేశవ్యాప్తంగా ఐదేళ్లలో 400 చిరుధాన్యాల అంకుర కేంద్రాలు, వ్యాపార సంస్థలకు శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం.- డా. బి దయాకర్‌రావు, న్యూట్రీ హబ్ సీఈవో

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details