తెలంగాణ

telangana

KCR National Party: దసరాకు కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన!

By

Published : Sep 29, 2022, 6:52 AM IST

Updated : Sep 29, 2022, 7:08 AM IST

KCR National Party:దసరారోజు జాతీయ పార్టీ ప్రకటనకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఆ రోజు తెరాసవిస్తృతస్థాయి సమావేశంలో తీర్మానం చేయబోతున్నారు. వారం రోజులుగా లోతైన కసరత్తు చేస్తున్న గులాబీ దళపతి...విజయదశమి రోజునే స్పష్టతనివ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. భాజపా, కాంగ్రెస్‌కు సమదూరం పాటించేలా దళితులు, రైతులు, కార్మికులు, యువత అంశాలనే ప్రధాన అజెండాగా తొలి అడుగువేసేందుకుప్రణాళికలు సిద్ధమయ్యాయి. దేశమంతా తెలంగాణ మోడల్ అభివృద్ధి, సంక్షేమం నినాదంతో ముందుకు కదలనున్నట్లు తెలుస్తోంది.

KCR National Party
KCR National Party

దసరాకు కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన!

KCR National Party: జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టేందుకు గులాబీ దళపతి కేసీఆర్ చేస్తున్న సుదీర్ఘ కసరత్తు కొలిక్కి వచ్చింది. విజయదశమి రోజు జాతీయ రాజకీయ పార్టీ ప్రకటించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబరు 5న దసరారోజున తెరాస విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి జాతీయపార్టీ విధివిధానాలపై చర్చించనున్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని కేసీఆర్‌ను కోరుతూ తీర్మానం చేయనున్నారు. జాతీయపార్టీ ఏర్పాటుపై కొద్దికాలంగా వివిధఅంశాలపై కేసీఆర్ విస్తృతసమాలోచన చేస్తున్నారు.

జెండా, అజెండాపై క్లారిటీ: ఈ మేరకు వారంరోజులుగా ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు, దళితులు, కార్మిక సంఘాలు, విశ్రాంత అధికారులతో చర్చలు జరిపారు. జాతీయ పార్టీ జెండా, అజెండాపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. భాజపా, కాంగ్రెస్ రెండింటికీ సమదూరం పాటిస్తూ స్పష్టమైన అజెండాతో ప్రజల ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ప్రజల్లో భాజపాపై తీవ్ర అసంతృప్తి ఉందని కాంగ్రెస్ నాయకత్వంపై విశ్వాసం లేనందున జాతీయ పార్టీ ఏర్పాటుకు ఇదేసరైన సమయమని తెరాస అధినేత గట్టిగా నమ్ముతున్నారు.

ఆ రెండు పార్టీలకు దూరం: ఇతరపార్టీలు ఇప్పటికిప్పుడు కలిసి రాకపోయినా భవిష్యత్తులో కచ్చితంగా జతకలుస్తాయని తెరాస నేతలు భావిస్తున్నారు. ముందుగా జాతీయ రాజకీయాలపై ప్రకటన చేసి ప్రజల్లోకి వెళ్లడమే మంచిదని కేసీఆర్ భావిస్తున్నారు. భాజపా, కాంగ్రెస్‌కి సమదూరమనే సంకేతం స్పష్టంగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నారు. కొన్ని పార్టీలు భాజపాను వ్యతిరేకిస్తున్నా కాంగ్రెస్‌కు అనుకూల వైఖరితో ఉన్నందున.. ప్రస్తుతానికి వాటికి దూరంగా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారు. జేడీఎస్ వంటి కొన్ని పార్టీలు తమ వెంట కలిసి వస్తాయని గులాబీ బృందం విశ్వసిస్తోంది. కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ట్విటర్ వేదికగా ఇటీవలే ప్రకటించారు.

ఆ ఒక్క నినాదంతో... దేశమంతటా తెలంగాణ మోడల్ అభివృద్ధి అనే నినాదంతో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. తెలంగాణలో ఎనిమిదేళ్లలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం వివరించడంతో రాష్ట్రంలో కాకుండా జాతీయస్థాయిలో రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని గులాబీ నేతల అంచనా. ఇటీవల ప్రగతిభవన్‌లో వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నేతలతో రెండురోజుల పాటు చర్చలు జరిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, రైతు రుణమాఫీ, నిరంతర విద్యుత్‌...ఎందుకివ్వలేరని దేశవ్యాప్తంగా చర్చ జరపాలని రైతు నేతలను కేసీఆర్ కోరారు. దేశంలో సాగునీరు, విద్యుత్ తగినంత ఉన్నా సద్వినియోగం చేసుకోవడంలో కేంద్రంలో పాలించిన భాజపా, కాంగ్రెస్ విఫలమైనందునే రైతులకు కష్టాలు తప్పడం లేదని ప్రచారం చేయనున్నారు.

దేశవ్యాప్తంగా దళితబంధు: దేశవ్యాప్తంగా దళితబంధు అమలుచేయాలని దళితులు డిమాండ్ చేసేలా ఉద్యమాలు చేపట్టాలని గులాబీ దళపతి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం అమ్మతోందని కార్మికులు, విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనలో విఫలమైందని యువతను కదిలించాలని వ్యూహాలు సిద్ధం చేసినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో విద్యార్థుల్ని భాగస్వామ్యం చేసేందుకు తగిన అంశాలపై కేసీఆర్ బృందం అధ్యయనం చేసింది.

కేసీఆర్ మాస్టర్ ప్లాన్స్: యువత అసంతృప్తిగా ఉన్న అంశాలపై నివేదికలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్నఅంశాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో స్థానిక ప్రజల ప్రత్యేక డిమాండ్లు, బలమైన ఆకాంక్షలేమిటీ వాటిపై భాజపాతో పాటు అక్కడి పార్టీల వైఖరి ఏమిటనే అంశాలపై అధ్యయనం చేసిన గులాబీ పార్టీ.. వాటిపై స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలనే యోచనలో ఉన్నట్లుతెలుస్తోంది. కాంగ్రెస్‌పై ఎక్కువగా స్పందించకుండా భాజపాపై ధ్వజమెత్తి దేశవ్యాప్తంగా ప్రజలను ఆకర్షించాలనేది కేసీఆర్ ప్రస్తుత వ్యూహం.

ఇవీ చూడండి:

Last Updated : Sep 29, 2022, 7:08 AM IST

ABOUT THE AUTHOR

...view details