తెలంగాణ

telangana

4 ప్రముఖ స్థిరాస్తి సంస్థల కార్యాలయాల్లో ఐటీ సోదాలు

By

Published : Jan 31, 2023, 7:19 PM IST

Updated : Jan 31, 2023, 7:25 PM IST

IT Raids in Hyderabad: హైదరాబాద్ నగరంలో భారీగా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. సుమారు 50కి పైగా బృందాలు వివిధ చోట్ల సోదాలు నిర్వహిస్తున్నాయి. ఎస్ఆర్ నగర్‌లోని వసుధ సంస్థ ప్రధాన కార్యాలయంతోపాటు వివిధ ప్రాంతాలల్లో సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏకకాలంలో జరుగుతున్నఈ సోదాలు రేపు, ఎల్లుండి కూడా కొనసాగే అవకాశాలు ఉన్నట్లు ఐటీ వర్గాలు వెల్లడించాయి.

IT Raids
IT Raids

IT Raids in Hyderabad: హైదరాబాద్‌లో నాలుగు సంస్థలపై భారీ ఎత్తున ఆదాయ పన్నుశాఖ దాడులు నిర్వహిస్తోంది. యాభైకి పైగా ఐటీ బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నాయి. ఎస్ఆర్ నగర్‌లోని వసుధ సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు వివిధ ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మాదాపూర్, ఎస్సార్ నగర్​లోని కంపెనీ కార్యాలయాలు, జీడిమెట్లలోని కంపెనీలపైనా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

వసుధ గ్రూప్ సంస్థల కార్యాలయాలతోపాటు ఆ సంస్థ సీఈవో, డైరెక్టర్లు, మేనేజింగ్ డైరెక్టర్ల ఇళ్లపైనా దాడులు కొనసాగుతున్నాయి. వసుధ ఫార్మా సంస్థతోపాటు రాజపుష్ప, వర్టెక్స్‌, ముప్పా హోమ్స్‌ స్థిరాస్థి సంస్థలపై కూడా దాడులు నిర్వహిస్తున్నట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. ఆయా సంస్థలు నిర్వహిస్తున్న వ్యాపారలావాదేవీలకు, చెల్లిస్తున్నఆదాయపన్నుకు వ్యత్యాసం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు.. ఆ సంస్థలపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు.

IT Raids in Hyderabad

బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ ఇంట్లో ఐటీ తనిఖీలు : మాజీ ఐఏఎస్‌, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి కుటుంబానికి చెందిన రాజపుష్ప సంస్థలో సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు... తెల్లాపూర్‌లోని ఆయన నివాసంలో కూడా తనిఖీలు చేపట్టినట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. రాజ్‌పుష్ప లైఫ్ స్టైల్ సిటీలోను ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఈ నాలుగు సంస్థలకు చెందిన వ్యాపార కార్యకలాపాలకు వేసిన ఐటీ రిటర్న్‌లతోపాటు ఆయా సంస్థల ఆర్థిక లావాదేవీలను పరిశీలించిన తరువాత ఆదాయపన్ను చెల్లింపుల్లో వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించామని ఐటీ అధికారులు తెలిపారు.

మరో రెండు రోజులు జరగనున్న ఐటీ సోదాలు :ఉదయం నుంచి ఏకకాలంలో జరుగుతున్నఈ సోదాలు బుధవారం, గురువారం కూడా కొనసాగే అవకాశాలు ఉన్నట్లు ఆదాయపన్నుశాఖ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకు నగదు కానీ, బంగారం కానీ స్వాధీనం చేసుకోలేదని స్పష్టం చేసిన ఐటీ వర్గాలు... ఆయా సంస్థలకు చెందిన వ్యాపారలావాదేవీలకు చెందిన పత్రాలను, ఎలక్ట్రానిక్‌ పరికరాలను సీజ్‌ చేస్తున్నట్లు ఆదాయ పన్ను శాఖ అధికారులు వివరించారు.

పదిరోజుల క్రితం నగరంలోని మూడు రియల్ ఎస్టేట్ సంస్థలపై ఏకకాలంలో సోదాలు జరిగాయి. ఈ సోదాల్లోను దాదాపు 50 బృందాలు పాల్గొన్నట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. శ్రీ ఆదిత్య హోమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోటారెడ్డి, అతని కుమారుడు ఆదిత్య రెడ్డి ఇళ్లతో పాటు ఈ సంస్థల ప్రధాన కార్యాలయాలతో పాటు వాటి అనుబంధ సంస్థలు, బంధువులు, స్నేహితుల ఇళ్లపైనా తనిఖీలు నిర్వహించాయి.

ఈ సంస్థలు నిర్వహిస్తున్న స్తిరాస్థి వ్యాపారానికి, అవి చెల్లిస్తున్న ఆదాయ పన్నుకు పొంతన లేకపోవడంతో దాడులు నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రాథమిక సమాచారాన్ని సేకరించిన అధికారులు.. ఆయా సంస్థలపై కేసులు నమోదు చేశారు. బంజారాహిల్స్‌, కూకట్‌పల్లిలతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి.

ఇవీ చదవండి:

Last Updated :Jan 31, 2023, 7:25 PM IST

ABOUT THE AUTHOR

...view details