తెలంగాణ

telangana

రెడ్ అలర్ట్​.. ఆ జిల్లాల్లో ఇవాళ, రేపు అత్యంత భారీ వర్షాలు

By

Published : Jul 12, 2022, 10:47 AM IST

Red Alert in Telangana

Red Alert in Telangana : నాలుగైదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని పలు జిల్లాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణను భారీ వానలు అతలాకుతలం చేస్తుండగా.. హైదరాబాద్ సహా దక్షిణ జిల్లాల్లో ముసురు కొనసాగుతోంది. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆయా జిల్లాల యంత్రాంగాలు అలర్ట్​గా ఉండాలని అప్రమత్తం చేసింది.

Red Alert in Telangana : బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దవుతోంది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో.. జన జీవనం స్తంభించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెరడిగొండ మండలం రాజులతాండాకు వెళ్లే మార్గంలో ఉప్పొంగుతున్న వాగును ప్రజలు ప్రమాదకర పరిస్థితుల్లో దాటుతున్నారు. దర్బాతండా మార్గంలో వాగు దాటే క్రమంలో మోటార్​ సైకిల్​పై వెళ్తున్న ఇద్దరు కొంతదూరం కొట్టుకుపోయి చెట్లకొమ్మల సాయంతో బతికి బయటపడ్డారు. బోథ్ మండలం మర్లపల్లికి వెళ్లే దారిలోనూ ప్రజలు వాగు దాటేందుకు కష్టాలు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో తుంతుంగా వాగు ప్రవాహంతో 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Red Alert in Northern Telangana : ఉమ్మడి వరంగల్​ జిల్లావ్యాప్తంగా పొంగిపొర్లుతున్న వాగులతో ఏజెన్సీలో రాకపోకలు నిలిచిపోయాయి. భూపాలపల్లి జిల్లా మహదేవ్​పూర్-పలిమెల మండలాలను కలిపే పెద్దంపేట వాగు వంతెన వద్ద రహదారి తెగి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. వాగులో విద్యుత్తు స్తంభాలు కొట్టుకుపోయి మండల వ్యాప్తంగా కరెంట్​ సరఫరా నిలిచిపోయింది. మహాముత్తారం మండలం యత్నారం గ్రామస్థులు.. వరద భయంతో అటవీ ప్రాంతానికి వెళ్లి అక్కడే డేరాలు వేసుకున్నారు.

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని బల్లకట్టువాగు, కుక్కతోగు, జిన్నెలవాగుల ఉద్ధృతితో.. భద్రాచలం-వెంకటాపురం ప్రధాన రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో ఇద్దరు గర్భిణులను పడవల్లో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళ్లే వీలులేక మరో మహిళ ఇంటి వద్దే ప్రసవించటంతో.. అతికష్టం మీద వైద్య సిబ్బంది గ్రామానికి చేరుకొని చికిత్స అందించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం వెలబెల్లికి చెందిన గర్భిణినీ.. వరద నీటిలోనే ట్రాక్టర్​లో ఆస్పత్రికి తరలించారు.

దెబ్బతిన్న కాలువలు.. : వర్షాల కారణంగా రాష్ట్రంలో రెండుచోట్ల సాగునీటి కాల్వలకు గండ్లు పడ్డాయి. ములుగు జిల్లాలో రెండుచోట్ల కాల్వలు దెబ్బతిన్నాయి. 21 చోట్ల చెరువులు, సంబంధిత నిర్మాణాలకు గండ్లు పడ్డాయి. 9 చోట్ల చెరువు కట్టలు, 6 చోట్ల చెరువులకు సంబంధించిన కాల్వలు దెబ్బతిన్నాయి. మూడుచోట్ల తూములు, మరో మూడు చెరువులకు సంబంధించిన కట్ట, తూములకు గండ్లుపడ్డాయని సర్కారు తెలిపింది.

నిజామాబాద్ జిల్లాలో 10, మంచిర్యాల జిల్లాలో 8 చోట్ల చెరువులు, సంబంధిత నిర్మాణాలు దెబ్బతిన్నాయి. ములుగు జిల్లాలో మూడు చెరువులకు బుంగ పడింది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసినప్పటికీ చెరువులు పెద్దగా దెబ్బతినలేదని ప్రభుత్వం తెలిపింది. మిషన్ కాకతీయలో చేపట్టిన పునరుద్ధరణ పనులతో చెరువుల కట్టలు, తూములు, ఇతరత్రా నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని పేర్కొంది.

ఆ జిల్లాలకు అలెర్ట్​.. : హైదరాబాద్​ సహా ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ముసురు కొనసాగుతోంది. భాగ్యనగరంలో ఏకధాటిగా చిరుజల్లులతో వర్షం కురుస్తుండటంతో రహదారులు జలమయమయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. మరికొన్ని గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ ప్రభావంతో సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో.. రేపు ఉదయం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మహబూబ్​నగర్​, నాగర్​కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. భారీ వర్షాలతో ఆయా జిల్లాల యంత్రాగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది.

ABOUT THE AUTHOR

...view details