తెలంగాణ

telangana

Hyderabad Rains News : జోరు వానలతో భాగ్యనగరం అతలాకుతలం.. స్తంభించిన జనజీవనం

By

Published : Jul 27, 2023, 8:02 PM IST

Updated : Jul 27, 2023, 8:16 PM IST

Heavy Rains In Hyderabad : తెరిపినివ్వకుండా కురుస్తున్న వర్షాలతో.. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. కొన్ని కాలనీల్లో రోడ్లపై వరద, డ్రైనేజీ నీరు ప్రవహిస్తున్నాయి. ఇళ్లలోకి నీళ్లు చేరి స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. మూసీ నది ఉద్ధృతితో పరిహహక ప్రాంతాల్లోని కాలనీవాసులు.. భయం గుప్పిట నివసిస్తున్నారు.

Hyderabad Rains
Hyderabad Rains

జోరు వానలతో భాగ్యనగరం అతలాకుతలం.. స్తంభించిన జనజీవనం

Hyderabad Rains : ఎడతెరిపి లేని వర్షాలకు హైదరాబాద్‌ ఆగమాగమైంది. రహదారులపై మోకాళ్ల లోతు నీరి చేరి వాహనదారులు ఇబ్బందిపడ్డారు. నాంపల్లి పటేల్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌పై కొబ్బరి చెట్టు పడిపోయింది. భారీ శబ్ధం రావడంతో చుట్టు పక్కల వాళ్లు భయభ్రాంతులకు గురయ్యారు. పాతబస్తీలోని మాదన్నపేటలో ఇంటి గోడ కారుపై పడి.. పూర్తిగా వాహనం ధ్వంసమైంది. నాగోల్ డివిజన్‌ అయ్యప్ప కాలనీలోని పలు ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. ఎల్లమ్మబండ పీజేఆర్​ నగర్‌, సిక్కు కాలనీలోకి వరద నీరు చేరింది. ఆక్రమణల వల్లే ఈ దుస్థితి వచ్చిందని కాలనీవాసులు ఆరోపించారు. లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి కింద భారీగా వరద నీరు చేరింది.

పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలో పలు కాలనీలోకి వరద నీరు చేరి.. స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రాని పరిస్థితి నెలకొంది. విష్ణుపురి కాలనీలో ఇళ్లు నీట మునిగాయి. ఇళ్లలోకి పాములు, విష పురుగులు వస్తున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మేడ్చల్ పురపాలిక పరిధిలో రహదారులు జలమయం అయ్యాయి. వినాయకనగర్, రాఘవేంద్రకాలనీల్లో మురుగు కాల్వవు పొంగి పొర్లాయి. కీసర మండలంలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల పరిధిలోని పలు ప్రాంతాల్లోని కాలనీల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. సాయి సంజీవనగర్, అరవింద్ నగర్, సత్యనారాయణ కాలనీల్లో స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు.

Rain In Hyderabad : గాజుల రామారం బాలాజీ లే అవుట్, వోక్షిత ఎంక్లేవ్, ఆదర్శ్‌నగర్‌లో రోడ్లపై వరద ప్రవహిస్తోంది. పెద్ద చెరువు అలుగు పారడంతో.. రోడ్లు జలమయమయ్యాయి. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని సాయి పూజిత కాలనీలో డ్రైనేజీ నీరు రోడ్లపై ప్రవహించాయి. రాజేంద్రనగర్ హైదర్‌గూడలో రెండు ఇళ్లు కుప్పకూలాయి. ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.

హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌ సాగర్‌కు వస్తున్న వరదను మూసీ నదిలోకి విడుదల చేస్తున్నారు. ముసారాంబాగ్‌, చాదర్‌ఘాట్‌ వద్ద ప్రవాహం ఉద్ధృతంగా ఉంది. మూసి పరివాహక ప్రాంతాల్లోని కాలనీవాసుల కోసం పునవాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ముసారంబాగ్ బ్రిడ్జిని పరిశీలించిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌.. కొత్త వంతెన ఎప్పుడు నిర్మిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సరూర్‌నగర్‌ చెరువు సమీపంలోని సీసాలబస్తీ, కోదండరాంనగర్ కాలనీలలో స్థానికులు బయటకు రాలేని పరిస్థితి ఉంది.

మ్యాన్​హోళ్లపై మూతలు తెరవద్దు : హైదరాబాద్‌లో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ అన్నారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలోని కంట్రోల్‌ రూమ్‌ నుంచి వర్షాలు, వరద పరిస్థితిపై సమీక్షించారు. 2వేల మంది సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని తలసాని వెల్లడించారు. నీలోఫర్‌ ఆసుపత్రి, బజార్‌ఘాట్ ప్రాంతాలను జలమండలి ఎండీ దాన కిషోర్ పరిశీలించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాన్‌హోళ్లపై ఉన్న మూతల్ని తెరవకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డీజీపీ కార్యాలయం నుంచి 24గంటలపాటు వరద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు అంజనీకుమార్‌ తెలిపారు.

Hyderabad Rains : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వికారాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు, వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. లఖ్నాపూర్ ప్రాజెక్ట్‌కు భారీగా వరద వచ్చి చేరుతోంది. బెల్కటూరు వాగు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వాగుకు రెండు వైపులా వాహనాలు భారీగా ఆగిపోయాయి. రైల్వే అండర్ బ్రిడ్జి కిందకు వరద చేరింది. శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఎవరూ ఉండకుండా చర్యలు తీసుకోవాలని వికారాబాద్​ కలెక్టర్​ అధికారుల్ని ఆదేశించారు.

ఇవీ చదవండి :

Last Updated : Jul 27, 2023, 8:16 PM IST

ABOUT THE AUTHOR

...view details