తెలంగాణ

telangana

WhatsApp Fraud Calls : వాట్సాప్​లో ఫేక్ కాల్స్.. ఇలా గుర్తించి.. అలా తప్పించుకోండి

By

Published : May 15, 2023, 12:00 PM IST

Fake Calls from Frauds
ప్లస్​లలో మైనస్​లెన్నో.. ఇలా గుర్తించి.. అలా తప్పించుకోండి ()

WhatsApp Fraud Calls with Foreign Numbers : గతకొన్ని రోజులుగా +27, +22, +88, +244, +84 స్టార్ట్ అయ్యే నంబర్లతో వాట్సాప్​లో వస్తున్న వీడియో, ఆడియో కాల్స్ భయం పుట్టిస్తున్నాయి. హైదరాబాద్ మహానగరంలో మొబైల్ ఉపయోగించే ప్రతి వంద మందిలో తొంభై మందికి ఇలాంటి కాల్స్ వస్తున్నాయి. ఇలాంటి ఫ్రాడ్ కాల్స్ వచ్చినప్పుడు కొంతమంది తెలియక స్పందించి వీడియో కాల్​లో కనిపించే దృశ్యాలను చూసి సెల్ స్విచ్ఛాఫ్ చేస్తున్నారు. ఇంకొందరు దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేయాలా, వద్దా అనే సందేహంలో ఉంటున్నారు.

WhatsApp Fraud Calls with Foreign Numbers : ఈమధ్య కాలంలో అందరి నోట ఒకే మాట.. ఫ్రాడ్ కాల్స్. విదేశీ నంబర్లతో వీడియో, ఆడియో కాల్స్ చేసి ప్రజలను ఇబ్బందులలోకి తోసేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇలాంటి ఫ్రాడ్ కాల్స్​కు ఏమాత్రం స్పందించినా ఇబ్బందులు తప్పవు, అడ్డంగా బుక్కయిపోతారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. బెంగళూరు, ముంబయి, చెన్నై లాంటి నగరాల్లో చాలా మంది బాధితులు పెద్ద ఎత్తున నష్టపోయారు. ఫిర్యాదు చేస్తే నామూషీగా ఉంటుందని, పరువు పోతుందనే ఉద్దేశంతో చాలా మంది మౌనంగా ఉండిపోయారు.

WhatsApp Fake Calls with Foreign Numbers :ఈ నేపథ్యంలో సైబరాబాద్, హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ ఇలాంటి కాల్స్ పట్ల సోషల్ మీడియాలో అవగాహన కల్పిస్తోంది. ఇలాంటి ఫోన్ నంబర్లను ఉపయోగించి స్పూఫింగ్ కాల్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన యాప్ సాయంతో సైబర్ నేరగాళ్లు తమ అసలు ఫోన్ నంబర్ల నుంచి ఫోన్లు చేయడం, మెసెజ్​లు పంపించడం లాంటివి చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఫోన్ చేసినా వారికి ఫోన్ కలవదని చెబుతున్నారు పోలీసులు.

అభివృద్ధి చెందిన సాంకేతికతను ఉపయోగించి దేశ, విదేశాల్లో నేరగాళ్లు అక్కడి నుంచే ఇలాంటి పనులు చేస్తున్నారు. వాట్సాప్, మొబైల్ నంబర్లకు ఫోన్లు చేసి మాటలు కలుపుతారు. అమ్మాయిల గొంతుతో ఇంగ్లీష్, హిందీ భాషల్లో కన్వర్​జేషన్ ప్రారంభిస్తారు. మంచి స్నేహాన్ని ప్రారంభించి, ఛాటింగ్ అంటూ ఆశ చూపుతారు. వాట్సాప్ ద్వారా నగ్న వీడియో కాల్స్​తో వలపు వల విసురుతారు. ఇవతలి వ్యక్తి ఆ వీడియోలు చూస్తున్నట్లు అటు నుంచి వీడియోలు తీస్తారు. ఆ వీడియోలను ఎరగా చూపించి బెదిరిస్తూ సొమ్ము కాజేస్తుంటారు.

రాజస్థాన్​కు చెందిన ముఠాలు ఎక్కువ :రాజస్థాన్​కు చెందిన ముఠాలు ఎక్కువగా ఇలాంటి సెక్సాటార్షన్​కు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. మరికొందరు మోసగాళ్లు ఉద్యోగాలను ఎరగా చూపించి.. రోజులో గంట లేదా రెండు గంటలు పనిచేస్తే చాలంటూ సందేశాలు పంపుతున్నారు. వాటన్నింటిని నిజమేనని నమ్మి వారు పంపిన లింక్​లను క్లిక్ చేసినా, వారితో చాటింగ్ చేసినా మనతో అన్ని వివరాలు రాబట్టి బ్యాంక్ ఖాతాల్లోని డబ్బును ఖాళీ చేస్తున్నారు. గతంలో స్థానిక సిమ్‌కార్డులు ఉపయోగించి ‘హానీ ట్రాప్‌’నకు పాల్పడేవారు. ప్రస్తుతం వాటిని వదిలేసి కొత్తగా యాప్ ద్వారా విదేశీ నంబర్లు ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

తప్పించుకోండిలా :ప్లస్​తో(+) స్టార్ట్ అయ్యే విదేశీ నంబర్లతో వచ్చే ఫోన్​కాల్స్​ను లిఫ్ట్ చేయవద్దు. అలాంటి వాటికి స్పందించకుండా ఉండాలి. తెలియని వ్యక్తుల పేర్లతో వీడియోకాల్స్​ వస్తే స్పందించకుండా బ్లాక్ చేయండి. ఉద్యోగాల పేరుతో.. రకరకాల విషయాలను ఎరగా చూపి వస్తున్న లింకులు క్లిక్ చేయవద్దు. వాటిని క్లిక్ చేసి వ్యక్తిగత వివరాలను ఇవ్వొద్దు. తెలియకుండా వీడియో కాల్స్​కు స్పందించినప్పుడు.. నేరగాళ్లు నగ్న వీడియోలు చూసినట్లు మార్ఫింగ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేస్తే అధైర్యపడొద్దు. వెంటనే పోలీస్ స్టేషన్​కు వెళ్లి లేదా 1930 నంబరుకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details