తెలంగాణ

telangana

High Temperature in Telangana : రాష్ట్రంలో మండుతున్న ఎండలు.. ఈనెల 29 వరకు ఇదే పరిస్థితి

By

Published : May 18, 2023, 10:34 AM IST

High Temperature

High Temperature in Telangana : రాష్ట్రంలో సాధారణ ఉష్టోగ్రతల కంటే ఎక్కువ డిగ్రీలు నమోదవుతున్నాయి. ప్రజలు బయట తిరగవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. మే 29 వరకు పరిస్థితులు ఇలాగే ఉంటాయని ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది. గత రెండు రోజుల్లోనే వడదెబ్బతో ఏడుగురు మృతి చెందారు.

High Temperature in Telangana : రాష్ట్రంలో మండుటెండలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు మే 29 వరకు ఈ ఎండలు దంచి కొడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం సుమారు అన్ని ప్రాంతాల్లోను ఉదయం సమయంలో ఉష్ణోగ్రత 40 నుంచి 46 డిగ్రీల మధ్య నమోదయింది. అన్ని ప్రాంతాలకంటే అధికంగా భద్రాద్రి జిల్లా జూలూరుపాడులో ఏకంగా 46.4 ఉష్ణోగ్రత నమోదైంది. బయ్యారంలో 45.3 డిగ్రీలు, సూర్యాపేట జిల్లా మామిళ్ల గుడెంలో 45.2 డిగ్రీలు, నల్గొండ జిల్లాలోని నిడమనూరులో 45.2 డిగ్రీలు, జయశంకర్ జిల్లాలోని మహాదేవ్​పూర్​లో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

వేడి గాలులు వీస్తున్నాయి : రాష్ట్రంలో మంగళవారం పగటిపూట అత్యధికంగా ఉష్ణోగ్రత 45.2 డిగ్రీలుండగా.. తరువాత రోజు 1.2 డిగ్రీలు పెరగటం గమనార్హం. అధిక ఉష్ణోగ్రత కారణంగా రాష్ట్రంలో వేర్వేరు చోట ఏడుగురు మృతి చెందారు. గురువారం పలు ప్రాంతాల్లో 43 డిగ్రీల నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో వేడి గాలులు వీస్తున్న కారణంగా ప్రజలు బయట తిరగాలంటే జంకుతున్నారు.

సాధారణం కంటే ఎక్కవగా నమోదు: ఉదయం ఎండల ప్రభావం వల్ల రాత్రిపూట కూడా వేడిగా ఉండడంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం హనుమకొండలో 31 డిగ్రీలు, ఖమ్మంలో 30 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ప్రాంతాల్లో సాధారణంగా కంటే 3.6 డిగ్రీలు అధికంగా నమోదైంది. రాష్ట్రంలో అత్యల్పంగా మంగళవారం రాత్రి మహానగర శివారులోని పటాన్​చెరులో 20.0 డిగ్రీలు నమోదైంది. ఇది సాధారణ ఉష్ణోగ్రత కంటే 4.8 డిగ్రీలు తక్కువ. పగలు ఆకాశంలో మేఘాలు లేకపోవడం , నిర్మలంగా ఉండటంచే సూర్యకిరణాలు నేరుగా భూమిపై పడటం వల్ల వాతావరణం బాగా వేడెక్కుతోంది. మేఘాలు లేని ప్రాంతాల్లో రాత్రిపూట కూడా అక్కడి వాతావరణం ఉక్కపోతగా ఉంటుంది.

వడదెబ్బకు ఏడుగురు మృతి: ఎండలు అధికంగా ఉండటం వల్ల మంగళవారం, బుధవారం మెదక్​ జిల్లాలోని శేరిపల్లిలో ఉపాధి హామీ కూలీ మ్యాదరీ బాలమణి(46), కుమురంభీం జిల్లా కాగజ్​నగర్​కు చెందిన రోజుకూలీ ఇగురపు ఈశ్వర్ (38), వరంగల్​ జిల్లా గవిచర్లలో పాపాని ప్రియాంక (28), మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో రిక్షా కార్మికుడు బానోతు రామ్​జీ(52), ఇదే జిల్లాలోని గౌరారం పంచాయతీ కోడిపుంజులతాండాకు చెందిన వ్యవసాయ కూలీ ఇస్లావత్​ సీతారాం(56), గుర్తూరులో మత్స్యకారుడు పెసర రాజు(30), నల్గొండ జిల్లా అనాజీపురంలో రైతు శవ్వ సుధాకర్​రెడ్డి (42) వడదెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

ఈ నెల 29 వరకు ఇదే పరిస్థితి:సముద్రాల మీద వేడి అధికంగా ఉంటున్న కారణగా భూమధ్య రేఖ ప్రాంతాల్లో నైరుతి రుతు పవనాలకు అనువైన వాతావరణ పరిస్థితులు కనిపించడం లేదని వాతావరణ శాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న అన్నారు. మే 29వ తేదీ వరకు ఇలానే ఎండలు కొనసాగే అవకాశాలున్నాయన్నారు. రుతుపవనాలకు అనుకూలంగా వాతావరణాలు ఏర్పడితే జూన్​ మొదటి వారంలో కేరళ రాష్ట్రంలో వర్షాలు ప్రారంభమవుతాయి. ప్రజలు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయట తిరగవద్దని నాగరత్న సూచించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details