తెలంగాణ

telangana

Highcourt on teachers transfers : ఉపాధ్యాయుల బదిలీలపై సోమవారం విచారణ

By

Published : Aug 3, 2023, 7:37 PM IST

High court on group1 prelims : హైకోర్టు ఈరోజు వివిధ అంశాలపై విచారణ జరిపింది. ఉపాధ్యాయుల బదిలీలపై స్టే ఎత్తివేయాలన్న ప్రభుత్వ మధ్యంతర పిటిషన్‌పై.. ఈనెల 7న విచారణ జరుపుతామని హైకోర్టు వెల్లడించింది. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేయాలన్న పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసింది. స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టుల... ఎన్నికల నిర్వహణపై కూడా విచారణ జరిపింది.

Highcourt
Highcourt

High court on teachers transfers : ఉపాధ్యాయుల బదిలీలపై స్టే ఎత్తివేయాలన్న ప్రభుత్వ మధ్యంతర పిటిషన్‌పై.. ఈనెల 7న విచారణ జరుపుతామని హైకోర్టు వెల్లడించింది. టీచర్ల బదిలీల్లో భార్యాభర్తలకు, యూనియన్ల ప్రతినిధులకు ప్రత్యేక పాయింట్లను ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు.. ఇవాళ సీజే జస్టిస్ అలోక్ ఆరాధే ధర్మాసనం వద్ద విచారణకు వచ్చాయి.

ఉపాధ్యాయ బదిలీలపై స్టే విధిస్తూ హైకోర్టు మార్చి 7న బదిలీలపై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్టే ఎత్తివేయాలని కోరుతూ గతంలోనే ప్రభుత్వం మధ్యంతర పిటిషన్ వేసింది. టీచర్ల బదిలీలకు సంబంధించిన పిటిషన్లపై వీలైనంత త్వరగా విచారణ జరపాలని అందులో కోరింది. హైకోర్టులో 2005లో దాఖలైన పిటిషన్లు కూడా పెండింగులో ఉన్నాయని.. ఈ అంశాన్నే అత్యవసరంగా తేల్చాలంటే ఎలా అని ధర్మాసనం ప్రశ్నించింది. పిటిషన్లపై పూర్తిస్థాయి విచారణ తర్వాత చేపడతామన్న హైకోర్టు.. స్టే ఎత్తివేయాలన్న మధ్యంతర అభ్యర్థనపై సోమవారం వాదనలు వింటామని తెలిపింది.

High court on Group1 prelims : గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేయాలన్న పిటిషన్‌పైహైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. జూన్ 11న జరిగిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కోరుతూ పలువురు అభ్యర్థులు వేసిన పిటిషన్‌పై.. జస్టిస్ పి.మాధవీదేవి ఇవాళ మరోసారి విచారణ జరిపారు. అభ్యర్థుల బయోమెట్రిక్ వివరాలు నమోదు చేయలేదని.. హాల్‌టికెట్ నంబరు, ఫోటో లేకుండా ఓఎంఆర్ షీటు ఇచ్చారన్నది అభ్యర్థుల వాదన.

గతేడాది అక్టోబరు 16న నిర్వహించినప్పుడు బయోమెట్రిక్ నమోదు చేసిన టీఎస్​పీఎస్సీ.. మళ్లీ నిర్వహించినప్పుడు అమలు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందని వాదించారు. మొదటిసారి గ్రూప్ వన్ ప్రిలిమ్స్‌లో ప్రయోగాత్మకంగా బయోమెట్రిక్ నమోదు చేసినప్పటికీ.. ఆ తర్వాత ఆ విధానం కొనసాగించవద్దని నిర్ణయం తీసుకున్నట్లు టీఎస్పీఎస్సీ పేర్కొంది. దానికి బదులుగా అభ్యర్థిని నిర్ధారించేందుకు బహుళ విధానాలను అమలు చేశామని పేర్కొంది. ఇరువైపుల వాదనలు ముగియడంతో పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.

High court on local body elections : మరో కేసులో స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే విషయం చెప్పేందుకు.. మరో మూడు వారాలు సమయం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. రాష్ట్రవ్యాప్తంగా 220 సర్పంచ్​లు, 94 ఎంపీటీసీ, 4 జెడ్పీటీసీ, 5 వేల 364 వార్డులకు ఎన్నికలు జరపడం లేదంటూ న్యాయవాది భాస్కర్ వేసిన పిల్‌పై ఇవాళ మరోసారి విచారణ జరిగింది.

ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో ఇవాళ చెప్పాలని గత విచారణ సందర్భంగా ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే భారీ వర్షాలు, వరదల సహాయక చర్యలు కొనసాగుతున్నందున మరో మూడు వారాల సమయం ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోరారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధంగా ఉన్నందున.. ప్రభుత్వం కూడా సిద్ధపడాలన్న పిల్‌పై విచారణను ధర్మాసనం ఆగస్టు 28కు వాయిదా వేసింది.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details