తెలంగాణ

telangana

'వచ్చే నెల రోజులు మరింత అప్రమత్తం.. డెంగీ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టండి'

By

Published : Jul 22, 2022, 4:49 AM IST

Harish Rao Video Conference Doctors: వరుసగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు. వచ్చే నెల రోజులూ మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సమయమని తెలిపారు. పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్‌ డోసు పంపిణీ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

harish raoharish rao
harish raoharish rao

Harish Rao Conference: వచ్చే నెల రోజులూ మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సమయమని, వరుసగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వైద్యాధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వరద ప్రభావిత, గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని, డెంగీ కేసులు నమోదవుతున్న జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆరోగ్య ఉపకేంద్రాల వారీగా జీవనశైలి వ్యాధుల నిర్ధారణ పరీక్షలను త్వరగా వంద శాతం పూర్తయ్యేలా చూడాలన్నారు. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జోగులాంబ గద్వాల, నాగర్‌ కర్నూల్‌ జిల్లాలను మంత్రి ప్రశంసించారు. గురువారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం నుంచి అన్ని జిల్లాల వైద్యాధికారులతో మంత్రి దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు.

పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్‌ డోసు పంపిణీ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి గర్భిణికి నాలుగు సార్లు పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ విషయంలో మంచి పని తీరు నమోదు చేసిన జోగులాంబ గద్వాల, ఆదిలాబాద్‌, జనగామ, కుమురంభీం ఆసిఫాబాద్‌, సంగారెడ్డి జిల్లాలను మంత్రి అభినందించారు. సూర్యాపేట, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వికారాబాద్‌ జిల్లాల్లో పనితీరు తక్షణం మెరుగుపడాలని ఆదేశించారు.

అనవసర సిజేరియన్లను తగ్గించడంలో మంచి పనితీరు కనబర్చుతున్న నారాయణపేట, కుమురంభీం ఆసిఫాబాద్‌, జోగులాంబ గద్వాల, వికారాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలను అభినందించారు. కరీంనగర్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో సాధారణ ప్రసవాలు పెరిగేలా చూడాలని మంత్రి సూచించారు. తెలంగాణ డయాగ్నొస్టిక్స్‌ సేవల్లో ఉత్తమ పనితీరును కనబర్చిన మెదక్‌ జిల్లాను ప్రశంసించారు. ఈ సమీక్షలో ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ శ్వేత మహంతి, ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు, వైద్య విద్య సంచాలకుడు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:'ఆవిష్కరణ'ల ఖజానా తెలంగాణ.. ఇన్నోవేషన్‌ సూచీలో దేశంలో రెండో ర్యాంకు.

ABOUT THE AUTHOR

...view details