తెలంగాణ

telangana

GOVERNOR TAMILISAI: వాన నీటి సంరక్షణను ఉద్యమంగా చేపట్టాలి

By

Published : Jul 9, 2021, 7:57 PM IST

వాన నీటి సంరక్షణను ఉద్యమంగా చేపట్టాలని గవర్నర్ తమిళిసై సూచించారు. జాతీయ వాటర్ మిషన్ చేపట్టిన క్యాచ్ ద రెయిన్ కార్యక్రమంలో భాగంగా ఈ అంశంపై వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వర్షపు నీటిని సంరక్షించుకోవడం వల్ల తాగు, సాగునీటి కొరతను అధిగమించవచ్చునని అన్నారు.

GOVERNOR TAMILISAI, catch the rain
గవర్నర్ తమిళి సై, క్యాచ్ ద రెయిన్

రానున్న రోజుల్లో నీటి సంక్షోభాలను నివారించేందుకు.. వాన నీటి సంరక్షణను ఉద్యమంగా చేపట్టాలని గవర్నర్ తమిళిసై కోరారు. విశ్వవిద్యాలయాలు హరిత క్యాంపస్‌ల్లాగా, వాననీటి సంరక్షణ కేంద్రాలుగా మారాలన్నారు. జాతీయ వాటర్ మిషన్ చేపట్టిన క్యాచ్ ద రెయిన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ, పుదుచ్చేరిలోని విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, రెడ్ క్రాస్ ప్రతినిధులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో గవర్నర్ పాల్గొన్నారు.

భూగర్భ జలాల పెంపు అవశ్యం

వర్షపు నీటిని సంరక్షించుకోవడం వల్ల తాగు, సాగునీటి కొరతను అధిగమించవచ్చునని గవర్నర్ సూచించారు. ప్రపంచ జనాభాలో 18 శాతం.. సంపదలో సుమారు 20 శాతం భారత్‌లోనే ఉన్నప్పటికీ... నీటి వనరులు మాత్రం నాలుగు శాతమే ఉన్నాయన్నారు. భూగర్భ జలాలను విచ్చలవిడిగా వాడుతున్నందున.. 256 జిల్లాల్లో క్లిష్ట దశకు తగ్గిపోతున్నాయన్నారు. వర్షపు నీటి సంరక్షణ ద్వారా భూగర్భ జలాలను పెంపొందించుకోవడం అత్యంత అవశ్యమని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు.

చేపట్టాల్సిన పద్ధతులు

చెక్ డ్యాంలు, ఇంకుడు గుంతలు, రూఫ్ టాప్ వాన నీటి సంరక్షణ పద్ధతులు, చెరువులు, కుంటల ఆక్రమణలను నిరోధిచండం, పూడిక తీయడం, స్టోరేజ్ కెపాసిటీ పెంచడం, ఫీడర్ ఛానెల్ కాలువల్లో అడ్డంకులు తొలగించడం వాన నీటి సంరక్షణలో అత్యంత కీలకమని గవర్నర్ వివరించారు. రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో వాన నీటి సంరక్షణ పద్ధతులను ప్రోత్సహించడానికి ఉద్యమ స్థాయిలో కృషి చేయాలని గవర్నర్ కోరారు. ఈ కాన్ఫరెన్స్‌లో నేషనల్ వాటర్ మిషన్ డైరెక్టర్ జి. అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:రేపు వాసాలమర్రికి వెళ్లనున్న సీఎం కేసీఆర్‌

ABOUT THE AUTHOR

...view details