తెలంగాణ

telangana

Telangana news: మరో రెండు నెలలు.. రాష్ట్ర ప్రభుత్వానికి చాలా కీలకం

By

Published : Oct 31, 2022, 8:23 AM IST

Telangana financial year: పన్నుఆదాయ అంచనాల్లో ఆర్థికసంవత్సరం మొదటి అర్ధభాగం.. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు సగాన్ని చేరుకొంది. సెప్టెంబర్ నెలాఖరు వరకు 47శాతం మేర దాదాపు 60వేల కోట్లు పన్నుల ద్వారా ఖజానాకు చేరాయి. రెవెన్యూ రాబడులు అంచనాల్లో 38 శాతం ఉండగా.. వ్యయం కూడా అంచనాల్లో 38శాతానికి పైగా ఉంది. అంచనా వేసిన గ్రాంట్లలో మాత్రం కేవలం 13శాతం మేర 5 వేల 507 కోట్లు మాత్రమే వచ్చాయి.

telangana finance
తెలంగాణ ఆర్థిక వ్యవస్థ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో భాగంలో తెలంగాణకు చాలా కీలకం

Telangana financial budget : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి సగభాగం ముగిసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం 2,56,958 కోట్ల రూపాయల వ్యయంతో.. భారీ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఆదాయాన్ని 2,52,661 కోట్లుగా అంచనా వేసింది. పన్ను ఆదాయాన్ని 1,26,606 కోట్లుగా, మొత్తం రెవెన్యూ ఆదాయాన్ని 1,93,029 కోట్లుగా అంచనా వేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడి 55వేల కోట్ల రూపాయలు అప్పుల ద్వారా సమీకరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది.

అయితే రుణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు, ఆంక్షలు సర్కార్ కు ఇబ్బందికరంగా మారాయి. కార్పోరేషన్ల రుణాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన కేంద్రం.. ఎఫ్ఆర్బీఎం రుణం మొత్తంలో కోత విధించింది. దీంతో పన్నుఆదాయంపైనే ప్రధానంగా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్రం నిబంధనలు, ఆంక్షలతో నిధులను సమకూర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై ఆధారపడింది. పన్నుల వసూలు వ్యవస్థను పటిష్టపరచడం, ఓటీఎస్ అమలు, నిరుపయోగంగా ఉన్న భూముల అమ్మకం, రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల విక్రయం, వివిధ రుసుముల పెంపు తదితరాల ద్వారా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను కొనసాగిస్తోంది. అందుకు అనుగుణంగా సర్కార్​కు కొంత మేర ఆదాయం సమకూరింది.

కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ - కాగ్ కు ఇచ్చిన వివరాల ప్రకారం సెప్టెంబర్ నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వానికి 73వేల కోట్ల రెవెన్యూ ఆదాయం సమకూరింది. అందులో పన్ను ఆదాయం 59వేల కోట్లకు పైగా ఉంది. జీఎస్టీ ద్వారా 19,593 కోట్లు, స్టాంపులు - రిజిస్ట్రేషన్ల ద్వారా 7,212 కోట్లు, అమ్మకం పన్ను ద్వారా 14,953కోట్లు.. ఎక్సైజ్ పన్నుల ద్వారా 8,899 కోట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా 5,087 కోట్లు వచ్చాయి. పన్నేతర ఆదాయం ద్వారా 8400 కోట్లు, గ్రాంట్ల రూపంలో 5507 కోట్లు సమకూరాయి.

మొదటి ఆర్నెళ్లలో 21వేల కోట్లకు పైగా రుణాలు తీసుకున్నారు. బడ్జెట్ లో ప్రతిపాదించిన ఆదాయ మొత్తంలో మొదటి ఆర్నెళ్లలో 39శాతం వరకు 95వేల కోట్లు సమకూరాయి. ఏప్రిల్, మే నెలలను మినహాయిస్తూ వరుసగా నాలుగో నెలలోనూ రాష్ట్ర రాబడులు పదివేల కోట్ల మార్కును అధిగమించాయి. సెప్టెంబర్ నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన మొత్తం వ్యయం 85,123 కోట్ల రూపాయలు. ఇది బడ్జెట్ అంచనాల్లో 39శాతం వరకు ఉంది. రంగాల వారీగా చూస్తే సాధారణరంగంపై 25వేల కోట్లు, సామాజిక రంగంపై 28వేల కోట్లు, ఆర్థికరంగంపై 30వేల కోట్లు వ్యయం చేసింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండో అర్ధభాగం రాష్ట్ర ప్రభుత్వానికి మరింత కీలకం కానుంది. పన్ను ఆదాయాన్ని వీలైనంత ఎక్కువగా పెంచుకోవడంతో పాటు... పన్నేతర ఆదాయాన్ని కూడా బాగానే సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. రుణాల చెల్లింపు విధానంలో మార్పులు చేయడం ద్వారా కార్పోరేషన్ల ద్వారా తీసుకునే అప్పులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details