తెలంగాణ

telangana

యాంటీ ఫంగల్‌ ఔషధాలకు నిపుణుల కమిటీ అనుమతి తప్పనిసరి

By

Published : May 20, 2021, 7:25 AM IST

బ్లాక్‌ ఫంగస్‌ బాధితుల్లో చికిత్స కోసం వినియోగిస్తున్న ఔషధాల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మందులను ఎవరికి వినియోగించాలనేది నిర్ణయించేందుకు ఒక నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ సూచించిన వారికే ఇకపై మందులు అందనున్నాయి.

యాంటీ ఫంగల్‌ ఔషధాలకు నిపుణుల కమిటీ అనుమతి తప్పనిసరి
యాంటీ ఫంగల్‌ ఔషధాలకు నిపుణుల కమిటీ అనుమతి తప్పనిసరి

బ్లాక్‌ ఫంగస్‌ బాధితుల్లో చికిత్స కోసం వినియోగిస్తున్న ఔషధాల వినియోగాన్ని క్రమబద్ధీకరించాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయం తీసుకొంది. ‘లిపోసోమల్‌ ఆంఫొటెరిసిన్‌ బి’.. ‘పొసకొనజోల్‌’.. ‘ఐసవుకొనజోల్‌’.. తదితర యాంటీ ఫంగల్‌ ఔషధాలను బ్లాక్‌ ఫంగస్‌ సోకిన రోగులకు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య క్రమేణా పెరుగుతుండడంతో ఆ మందులకు హఠాత్తుగా డిమాండ్‌ పెరిగింది. బహిరంగ విపణిలో లభ్యం కావడం లేదు. ఉత్పత్తి సంస్థల నుంచి నేరుగా కొన్ని ఆసుపత్రులకు లేదా ప్రధాన డీలర్లకు చేరుతున్నాయి. ఈ మందులెన్ని వస్తున్నాయో.. ఎన్ని ఎవరెవరికి ఇస్తున్నారనే కచ్చితమైన సమాచారమేదీ ప్రభుత్వం వద్ద లేదు. కొందరు నల్లబజారులో విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

ఈ మందుల విక్రయంపై పారదర్శక విధానం అవసరమని ప్రభుత్వం భావించింది. వాటిని ఎవరికి వినియోగించాలనేది నిర్ణయించడానికి ఒక నిపుణుల కమిటీని నియమించింది. ఇందులో వైద్యవిద్య సంచాలకులు, కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌, గాంధీ ఆసుపత్రి ఈఎన్‌టీ విభాగాధిపతి సభ్యులుగా ఉంటారు. ఈ యాంటీ ఫంగల్‌ ఔషధాలు అవసరమని వైద్యుడు సూచిస్తే సంబంధిత వైద్యుని చీటీని జతచేస్తూ ప్రత్యేక దరఖాస్తు పత్రాన్ని నిపుణుల కమిటీకి పంపించాల్సి ఉంటుంది. అందులో రోగి సమాచారంతో పాటు ఆసుపత్రి వివరాలు, చికిత్స అందిస్తున్న ఈఎన్‌టీ, నేత్ర వైద్యుడు లేదా న్యూరోసర్జన్‌ల ధ్రువీకరణ పత్రం, వారి పేరు, ఫోన్‌ నంబరు సహా పూర్తి సమాచారాన్ని కూడా పొందుపరచాలి. దీన్ని నిపుణుల కమిటీ పరిశీలించి, రోగి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి, తప్పనిసరిగా యాంటీ ఫంగల్‌ ఔషధ చికిత్స అవసరమని భావిస్తే అప్పుడు కొనుగోలుకు అనుమతిస్తుంది. ఏ స్టాకిస్టు వద్ద నుంచి కొనుగోలు చేయాలనే సమాచారాన్నీ అందజేస్తారు. దరఖాస్తు పంపించాల్సిన ఈమెయిల్‌: ent-mcrm@telangana.gov.inగా సూచించారు. ఈ దరఖాస్తు పత్రాల నమూనాలు అన్ని ఆసుపత్రుల వద్ద అందుబాటులో ఉంటాయి. ప్రత్యుత్తరం కూడా దానికే ఏ మెయిల్‌ ద్వారా పంపిస్తారో దానికే వస్తుందని తెలిపింది.

ఇదీ చూడండి: బ్లాక్‌ ఫంగస్‌ ఔషధాలు కావాలంటే మెయిల్ చేయండి: కేటీఆర్‌

ABOUT THE AUTHOR

...view details