తెలంగాణ

telangana

ఫెమా నిబంధనలు ఉల్లంఘించిన మాజీ ఎంపీ వివేక్ - విశాఖ ఇండస్ట్రీస్ ద్వారా 100 కోట్లు బదిలీ!

By ETV Bharat Telangana Team

Published : Nov 23, 2023, 9:01 AM IST

ED Raids on EX MP Vivek Update : మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్‌కు చెందిన విశాఖ ఇండస్ట్రీస్‌ ద్వారా తాజాగా రూ.100 కోట్ల నగదు బదిలీ జరిగినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్‌ సంస్థకు ఈ నగదు తరలించినట్లు తెలిపింది. ఈ క్రమంలో ఫెమా ఉల్లంఘనలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించింది.

ED Raids on EX MP Vivek Update
ED Raids

ED Raids on EX MP Vivek Update :మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్‌ అభ్యర్థి జీ వివేక్‌కు చెందిన విశాఖ ఇండస్ట్రీస్‌ ద్వారా తాజాగా రూ.100 కోట్ల నగదు బదిలీ జరిగినట్లు ఈడీ(Enforcement Directorate) దర్యాప్తులో తేలింది. విజిలెన్స్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ సంస్థకు ఈ నగదు తరలింపులో ఫెమా ఉల్లంఘనలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించింది. వివేక్‌ బ్యాంకు ఖాతా నుంచి విజిలెన్స్‌ సెక్యూరిటీస్‌కు రూ.8 కోట్లు తరలినట్లు పోలీసుల సమాచారంతో ఈడీ దర్యాప్తును ప్రారంభించిన సంగతి విదితమే.

ED Raids on Congress Candidate Vivek : ఈ క్రమంలోనే మంగళవారం రోజున హైదరాబాద్‌, రామగుండం, మంచిర్యాలలోని వివేక్‌కు చెందిన ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ బృందాలు తనిఖీలు చేశాయి. ఆయా ప్రాంతాల్లో లభించిన ఆధారాలను బట్టి వివేక్‌, అతడి భార్య నిర్వాహకులుగా ఉన్న విశాఖ ఇండస్ట్రీస్‌(Visakha Industries) లావాదేవీలను పరిశీలించాయి. విజిలెన్స్‌ సెక్యూరిటీ సంస్థ తన వ్యాపార కార్యకలాపాల ద్వారా సుమారు రూ.20 లక్షల ఆదాయం పొందినట్లు బ్యాలెన్స్‌ షీట్లలో తెలిపినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. మొత్తంగా సంస్థలో రూ.200 కోట్లు ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. అయితే విశాఖ ఇండస్ట్రీస్‌తో విజిలెన్స్‌ సెక్యూరిటీస్‌కు వాస్తవ వ్యాపార లావాదేవీలు లేవని కానీ.. ప్రస్తుతం విజిలెన్స్‌ సెక్యూరిటీ వివేక్‌ నియంత్రణలోనే ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.

విజిలెన్స్‌ సెక్యూరిటీస్‌కు యశ్వంత్‌ రియల్టర్స్‌ మాతృసంస్థగా ఉన్నట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. ఈ రియల్టర్స్‌లో అధికశాతం వాటాలు ఓ విదేశీయుడి పేరిట ఉన్నట్లు తేలింది. విదేశీ సంస్థలో విజిలెన్స్‌ సెక్యూరిటీస్‌ను విలీనం చేయడంలో ఫెమా ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని ఈడీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. గ్రూపు సంస్థల ఆస్తి ఒప్పందాల్లో లెక్కలో లేని నగదును వినియోగించినట్లు తెలిపారు. విజిలెన్స్‌ సంస్థ పేర్కొన్న చిరునామాల్లో దాని ఉనికి లేదని గుర్తించారు.

రాష్ట్రంలో మరోసారి ఐటీ దాడుల కలకలం - కాంగ్రెస్‌ అభ్యర్థి వివేక్‌ వెంకటస్వామి ఇంట్లో సోదాలు

హెచ్‌సీఏ దర్యాప్తులో విశాఖ లింకులు : హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(HCA) కుంభకోణంపై ఈడీ చేపట్టిన దర్యాప్తులో వివేక్‌ సంస్థకు చెందిన లింకులు అనూహ్యంగా బహిర్గతమయ్యాయి. విశాఖ ఇండస్ట్రీస్‌ గ్రూపు సంస్థల స్థిరాస్తి వ్యాపార లావాదేవీల పత్రాలు ఈడీకి లభించాయి. హైదరాబాద్‌ ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం(Rajiv Gandhi International Cricket Stadium) నిర్మాణ కాంట్రాక్టు పనుల్లో రూ.20 కోట్లు అక్రమాలు జరిగాయంటూ రాష్ట్ర ఏసీబీ గతంలో కేసుల్ని నమోదు చేసింది.

ED Raids on EX Cricketers Houses in Hyderabad : ఆ కేసుల ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ.. హెచ్‌సీఏ పూర్వ అధ్యక్షుడు, బెల్లంపల్లి కాంగ్రెస్‌ అభ్యర్థి వినోద్‌, హెచ్‌సీఏ పూర్వ ఉపాధ్యక్షుడు శివలాల్‌యాదవ్‌, పూర్వ కార్యదర్శి అర్షద్‌ అయూబ్‌ ఇళ్లతో పాటు ఎస్‌ఎస్‌ కన్సల్టెంట్స్‌ కార్యాలయం, ఆ సంస్థ ఎండీ సత్యనారాయణ నివాసం తదితర ప్రాంతాల్లో మంగళవారం సోదాలు జరిపింది. డిజిటల్‌ పరికరాలు, పలు పత్రాలు, రూ.10.39 లక్షల సొమ్మును సీజ్‌ చేసింది. వినోద్‌కు చెందిన ఓ ఇంటిని ఆయన సోదరుడు వివేక్‌ తన విశాఖ ఇండస్ట్రీస్‌ కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు ఈడీ నిర్ధారించింది.

రెండో రోజూ ఐటీ సోదాలు :మరోవైపు కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలోని ఆదిత్య కాటన్‌ జిన్నింగ్‌ మిల్లు, దాని యజమానుల ఇళ్లలో మంగళవారం తనిఖీలు నిర్వహించిన ఐటీ అధికారులు.. రెండో రోజైన బుధవారం కూడా సోదాలు చేశారు. మిల్లు లావాదేవీలు, ఆర్థిక అంశాలను పరిశీలించినట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికల వేళ జరిగిన ఈ సోదాలతో స్థానిక నాయకులు, వ్యాపారులు ఆందోళనకు గురయ్యారు.

హైదరాబాద్​లో ఈడీ సోదాల కలకలం - మాజీ క్రికెటర్ల ఇళ్లలో కొనసాగుతోన్న తనిఖీలు

Ex MP Vivek Joins Congress : బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ గడ్డం వివేక్

ABOUT THE AUTHOR

...view details