తెలంగాణ

telangana

Dharani booklet launch: 'దేశ భూ పరిపాలనా రంగంలోనే ధరణి పోర్టల్ అతిపెద్ద సంస్కరణ'

By

Published : Oct 29, 2021, 10:22 PM IST

దేశ భూ పరిపాలనా రంగంలోనే ధరణి పోర్టల్ అతిపెద్ద సంస్కరణ అని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. ధరణి ప్రారంభించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ధరణి విజయాలను తెలిపే ప్రత్యేక బుక్‌లెట్‌ను సోమేశ్ కుమార్ ఆవిష్కరించారు.

dharani booklet
dharani booklet

దేశ భూపరిపాలనా రంగంలోనే ధరణి పోర్టల్ అతిపెద్ద సంస్కరణ అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. ధరణి ప్రారంభించి ఏడాది పూర్తైన సందర్బంగా బీఆర్కే భవన్​లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఏడాది కాలంలో ధరణి విజయాలను తెలిపే ప్రత్యేక బుక్​లెట్​ను ఆయన ఆవిష్కరించారు. దేశంలోనే భూ పరిపాలనా రంగంలో విప్లవాత్మకమైన ధరణి పోర్టల్... ముఖ్యమంత్రి కేసీఆర్​ దృఢ సంకల్పంతోనే సాధ్యమైందని అన్నారు.

ఏడాది కాలంలో ధరణి ఊహించిన దానికన్నా విజయవంతమైందని సీఎస్ అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో అమలవుతున్న పలు విప్లవాత్మక పథకాల వల్ల రాష్ట్రంలో భూముల ధరలు భారీగా పెరిగాయని పేర్కొన్నారు. ధరణి వల్ల భూరికార్డులు పటిష్ఠంగా ఉండడం, రికార్డులను తారు మారు చేసే పరిస్థితులు లేనందునే రాష్ట్రంలో ఏవిధమైన భూవివాదాలు తలెత్తడం లేదని... భూములు సురక్షితంగా ఉన్నాయని సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఎంతో మంది సీనియర్ అధికారులు, వందలాది మంది ఐటీ నిపుణులు ధరణిని విజయవంతం చేసేందుకు శ్రమించారని సీఎస్ గుర్తు చేశారు. ధరణి పోర్టల్ రూపకల్పనలో భాగస్వామ్యులైన అధికారులు తమ అనుభవాలను వెల్లడించారు.

ఏడాది క్రితం ప్రారంభమైన ధరణి

భూరికార్డుల సరళీకరణ, ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా సేవలు, అధికారులకు విచక్షణాధికారం లేకుండా చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చింది. ఏడాది క్రితం మేడ్చల్ - మల్కాజ్ గిరి జిల్లా మూడుచింతలపల్లి వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి వెబ్‌పోర్టల్‌ని ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా వినూత్నంగా తీసుకొచ్చిన ఆ ధరణిపోర్టల్ విజయవంతంగా ఏడాది పూర్తిచేసుకుందనిప్రభుత్వం తెలిపింది. భూలావాదేవీలకు సంబంధించి సురక్షతమైన, అవాంతరాలు లేని, ట్యాంపర్ ప్రూఫ్‌రికార్డుతో అత్యాధునిక ఆన్‌లైన్ పోర్టల్‌ అయిన ధరణి భూ సంబంధిత లావాదేవీలకు వన్-స్టాప్ పరిష్కారంగా ఉందని పేర్కొంది.

ధరణితో రిజిస్ట్రేషన్ సేవలు ప్రజల ఇంటివద్దకే చేరినట్లు వివరించింది. గతంలో కేవలం 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగేవని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలంలో 574 తహశీల్దార్ కార్యాలయాల్లో ఆ ప్రక్రియ జరుగుతోందని పేర్కొంది భూపరిపాలనలో ధరణి కొత్త ప్రమాణాలని నెలకొల్పిందన్న సర్కార్.. తొలి సంవత్సరంలోనే ధరణి సాధించిన ప్రగతి అభినందనీయమని తెలిపింది. ఏడాదిగా జరిగిన లావాదేవీలు, సంఖ్యలే పోర్టల్‌ విజయవంతానికి నిదర్శమని పేర్కొంది.

ఏడాది కాలంలో ఆ వెబ్‌పోర్టల్ 5.17 కోట్ల హిట్లు సాధించగా10.45 లక్షల స్లాట్లుబుక్ చేసుకోగా.. అందులో పది లక్షలకుపైగా లావాదేవీలు పూర్తైనట్లు వివరించింది. 5 లక్షలకు పైగా భూవిక్రయాలు, లక్షా 58వేలకుపైగా గిఫ్ట్ డీడ్‌లు, వారసత్వానికి చెందిన 72వేలు, తనాఖాకు సంబంధించి 58వేలకు పైగా లావాదేవీలు జరిగినట్లు పేర్కొంది. ధరణి పోర్టల్ ద్వారా 5.17 లక్షల ఫిర్యాదులు పరిష్కరించినట్లు సర్కార్ తెలిపింది. అందులో పెండింగ్ మ్యుటేషన్లు 2.07 లక్షలుకాగా.. భూ సంబంధిత విషయాలపై ఫిర్యాదులు 1.73 లక్షలున్నాయి. నిషేధిత భూముల జాబితాకు సంబంధించి 51 వేలకు పైగా కోర్టు కేసులు, ఇతర సమాచారం 24వేలకు పైగా ఉన్నాయని పేర్కొంది. ఇంతకుముందు పట్టాదార్‌ పాసుపుస్తకాలు ఇవ్వని దాదాపు లక్షా 80 వేలకు పైగా ఎకరాలభూమి ఈ ఏడాదిలో ధరణి పరిధిలోకి తెచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. పోర్టల్‌ అమలులో వస్తున్న సమస్యలు, అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేసినట్లు వివరించింది. ఆయావర్గాలు, స్టేక్ హోల్డర్ల నుంచి సలహాలు, సూచనలకనుగుణంగా కొత్త మాడ్యూల్స్‌ను తీసుకొచ్చినట్లు పేర్కొంది. వివిధ రకాల ఫిర్యాదులు పరిష్కరించేందుకు ప్రత్యేక మాడ్యూల్స్ పొందుపరిచినట్లు చెప్పింది. ప్రస్తుతం ధరణిలో 31 లావాదేవీల మాడ్యూల్స్, 10 సమాచార మాడ్యూల్స్ ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.

అధికారులకు సీఎం అభినందనలు

పోర్టల్‌ ప్రారంభించి ఏడాది పూర్తైనందున ధరణి సేవలను విజయవంతంగా అమలు చేస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, అధికారులు సహా జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. ధరణి అందిస్తున్న పారదర్శక, అవాంతరాలులేని సేవలతో ప్రజలు, ముఖ్యంగా రైతులు ఎంతో ప్రయోజనం పొందారని సీఎం సంతోషం వ్యక్తంచేశారు. రానున్న కాలంలో ప్రజల సేవలో ధరణి మరిన్నివిజయాలు సాధిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. పోర్టల్‌ను విజయవంతంగా అమలు చేసినందుకు అధికారులు, జిల్లా కలెక్టర్లు, తహశీల్దార్లకు సీఎస్ సోమేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి:Dharani One Year: ధరణి పోర్టల్​కు ఏడాది.. 10 లక్షలకు పైగా లావాదేవీలు

ABOUT THE AUTHOR

...view details