తెలంగాణ

telangana

Crop Loss Telangana : వరుణదేవా ఇక చాలయ్యా.. పంటలు మునిగిపోతున్నాయ్..!

By

Published : Jul 28, 2023, 8:28 AM IST

Telangana Rains Today : రాష్ట్రంలో ఇంతకాలం అనావృష్టి పరిస్థితితో అల్లాడిన రైతులు.. ప్రస్తుతం అతివృష్టితో కడగండ్ల పాలవుతున్నారు. వరదలతో కొన్నిచోట్ల పొలాల్లో ఇసుక మేటల వేయడంతో దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాతుండగా మరికొన్ని ప్రాంతాల్లో వరద ఉద్ధృతితో పైరుకు అపారనష్టం వాటిల్లింది. రాష్ట్రవ్యాప్తంగా ఐదున్నన్నర లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు వ్యవసాయ శాఖ అధికారుల అంచనా వెస్తున్నారు.

Crop Loss in Telangana
Crop Loss in Telangana

రాష్ట్రంలో వర్షాలు, వరదలకు ఐదున్నర లక్షల ఎకరాల్లో నీటమునిగిన పంటలు

Crop Loss Due To Heavy Rains in Telangana :రోజుల తరబడి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు.. వరదలతో పలు జిల్లాల్లో అన్నదాతలకి కంటిమీద కునుకులేకుండా పోయింది. దాదాపు ఐదున్నర లక్షల ఎకరాల్లో పంటలు ముంపునకు గురికావడంతో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. పొలాలు చెరువులను తలపిస్తుండగా నార్లు మొదలు సాగులోఉన్న పైరు వరకు దెబ్బతింటుండంటంతో ఆందోళన చెందుతున్నారు. ఇదే రీతిలో వర్షం కొనసాగితే మరింత నష్టపోతామని.. ఆవేదన చెందుతున్నారు. వ్యవసాయశాఖ అంచనాల ప్రకారం.. వర్షాలతో గత 10 రోజుల్లో 4 లక్షల ఎకరాల్లో పత్తి పంట ముంపునకు గురైంది. 22 వేల ఎకరాల్లో కంది, 14 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 10 వేల ఎకరాల్లో వేరుశనగ, 4 వేల ఎకరాల్లో పెసర, 12 వేల ఎకరాల్లోని కూరగాయల పంటలు ముంపునకు గురయ్యాయి. నాట్లు వేసిన 72 వేల ఎకరాల్లోకి.. నీరుచేరింది. వరదలకి అధికశాతం పైరు కొట్టుకుపోగా మిగిలిన చోట్ల ఇసుక మేటలు వేసింది.

Crop Loss in Telangana :పంట ప్రాథమిక దశలోనే ఇంత పెద్దఎత్తున వర్షాలువచ్చి మునిగిపోవడం గత పదేళ్లలో ఇదే తొలిసారి. సాధారణంగా విత్తనాలు వేసిన తర్వాత అడపాదడపా వర్షాలతో మేలు జరుగుతుంది. అధికశాతం వర్షపాతం అప్పుడప్పుడు వచ్చినా నష్టంలేదు. కానీ ఈసారి ఆగకుండా.. రోజుల తరబడి భారీ వర్షం పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పత్తి, మొక్కజొన్న, కందులు, వేరుశనగ విత్తి నెలరోజులే అవుతోంది. మొలకల దశలోనే నీరు నిండిపోయి మొక్కల జీవక్రియ నిలిచిపోతోంది. నీటి నిల్వ వల్ల ఇప్పటికే ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, హనుమకొండ, వికారాబాద్, సిద్దిపేట జిల్లాల్లో పత్తిపంట మొలకలు ఎర్రబారినట్లు వ్యవసాయ అధికారులు గుర్తించారు.

Crop Loss in Telangana Due to Heavy Rains :రాష్ట్రంలో వరిసీజన్‌ ప్రారంభ దశలో ఉంది. నిజామామాద్, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, వరంగల్, హనుమకొండ తదితర జిల్లాల్లో ఇప్పటికే నాట్లు పడుతున్నాయి. మిగిలిన జిల్లాల్లో నాట్లకు రైతులు సిద్ధం అవుతున్నారు. ఈ తరుణంలో వరదలతో పొల్లాల్లోకి నీరు చేరి నాట్లు కొట్టుకుపోతున్నాయి. చెరువులు, వాగులకు సమీప ప్రాంతాల్లోనివరద నీరు వచ్చి పొలాల్లో ఇసుక మేటలు వేస్తోంది. వరినార్లకు సిద్ధమైన రైతులు వరద ఉద్ధృతితో నాట్లు కొట్టుకుపోతాయని భయపడుతున్నారు. పొలాల్లోకి చేరిన నీటిని బయటకు పంపేందుకు అన్నదాతలు నానా కష్టాలు పడుతున్నారు.

Heavy Rains in Telangana : రాష్ట్రవ్యాప్తంగా పంటలపై వర్షాల ప్రభావంపై క్షేత్రస్థాయిలో వ్యవసాయశాఖ అధికారులు పంటలను పరిశీలించారు. పొలాల్లోకి నీరు చేరడం వల్ల ప్రమాదకర పరిస్థితులున్నాయని తెలిపారు. మొలకల దశలోని పొలాల్లో నీటిని వెంటనే ఖాళీ చేస్తేనే.. పంటలు దక్కుతాయని చెబుతున్నారు. నీరు వెళ్లే మార్గం లేనిచోట వర్షాలు తగ్గితేనే మొలకలకు రక్షణ ఉంటుందంటుని తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details