తెలంగాణ

telangana

కరోనా ఎఫెక్ట్: అమ్మకాలపై ఆందోళన.. ఈసారి దూరమైన ఉపాధి!

By

Published : Aug 21, 2020, 7:35 AM IST

ఏడాదికోసారే ఏకదంతుడి రూపం జనంలోకి వచ్చేది.. ఆ ఏకాదశ రోజుల కోసం ఆరునెలలు ముస్తాబవుతాడు. ఆభరణాల మెరుపులు... ఆకర్షించే రూపాలు, రంగుల సొబగులు.. ఇలా ఎన్నో. ఆ విగ్రహ తేజం వెనుక వందలాది కుటుంబాల పేదరికం ఉంది. ఎన్ని కష్టాలున్నా దేవుని మీదే ధ్యాస ఉంచి ప్రతిమల తయారీలో మునిగిపోయే కళాకారులకు కరోనాతో కొత్త కష్టాలొచ్చాయి. ఇటీవల మండపాల ఏర్పాటుపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో అమ్మకాలు తగ్గి వారికి ఆవేదనే మిగిలింది.

Corona effect on sales of Ganesh statues
కరోనా ఎఫెక్ట్: అమ్మకాలపై ఆందోళన.. ఈసారి దూరమైన ఉపాధి!

ధూల్‌పేట, మంగళ్‌హాట్‌ ప్రాంతాలతో పాటు ఘట్‌కేసర్‌, నాగోల్‌, హయత్‌నగర్‌, ఆటోనగర్‌ ప్రాంతాల్లో దాదాపు 20వేలమంది కళాకారులు విగ్రహాల తయారీ వృత్తిని నమ్ముకుని ఉన్నారు. ధూల్‌పేటలోనే 4వేల కుటుంబాలు ఉన్నాయి. చవితి కోసం జనవరి నుంచే వీరు ముడిసరుకు తెప్పించుకుని పనులు మొదలుపెట్టారు. సుమారు 40శాతం విగ్రహాల తయారీ పూర్తయింది. ఇంతలో కరోనా మహమ్మారి రావడంతో కొందరు విగ్రహాల తయారీ నిలిపివేశారు. చెన్నై, కోల్‌కతా, ముంబయి నుంచి వచ్చే కళాకారులతో పాటు ఇక్కడే ఉన్న వేలాది మందికీ ఇదే ఉపాధి. ప్రస్తుతం అంతా ఖాళీగా ఉంటున్నారు. కేవలం ధూల్‌పేటలోనే రూ.25కోట్ల పెట్టుబడి పెట్టినట్లు తయారీదారులు చెబుతున్నారు.

చిన్న విగ్రహాలు.. ఇంటికే పరిమితం

గ్రేటర్‌ పరిధిలో కరోనా కేసులు ఈసారి అన్ని పండుగలకు ఆటంకంగా మారుతున్నాయి. ప్రభుత్వం వినాయక మండపాల ఏర్పాటు, వేడుకలపై ఆంక్షలు విధించింది. అంతా ఇళ్లలోనే ఉత్సవాలు చేసుకోవాలని సూచించింది. గతేడాది మూడు కమిషనరేట్ల పరిధిలో దాదాపు 55వేల గణేశ్‌ మండపాలు ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా అపార్ట్‌మెంట్లు, గల్లీల్లో పెట్టినవి అదనం. ఈ ఏడాది వీటి సంఖ్య భారీగా తగ్గనుంది.

ఈ వ్యాపారంతోనే సంవత్సరమంతా..

ప్రతి ఏటా ఈ ఆర్నెల్ల పనితోనే వేలాది కుటుంబాలు పొట్ట నింపుకొంటున్నాయి. ఈ ఏడాది కరోనా ఉన్నా పక్క రాష్ట్రాల్లో విగ్రహాల తయారీకి కొన్ని ఆంక్షలతో అనుమతులు లభించాయి. కానీ ఇక్కడ ఎలాంటి నిర్ణయం లేదు. దీంతో విగ్రహాలు చేయాలా వద్దా అనే సంశయంలోనే గడువు దగ్గరికొచ్చింది. చేసిన సగం విగ్రహాలు కూడా అమ్ముడవుతాయో లేదో తెలియదు. ఇప్పుడు వేలాది మంది కళాకారులు రోడ్డున పడే పరిస్థితి.- రాజ్‌కుమార్‌సింగ్‌, విగ్రహ తయారీదారుల సంఘ ప్రతినిధి

250 చేసేవాడిని.. ఇప్పుడు 25 మాత్రమే

గతేడాది 250 మట్టి గణపతులను తయారు చేశాను. ఈ ఏడాది 25కే పరిమితం. అవి కూడా చిన్నవే. ఇతర రాష్ట్రాలకు చెందిన దాదాపు 30మంది కళాకారులకు ఉపాధి దొరికేది. ఈసారి 20 మందినే తీసుకొచ్చాం. ఖైరతాబాద్‌ మహాగణపతి తయారీకి అవకాశం రావడంతో వీరికి ఉపాధి కల్పించగలిగాను. మిగతా కుటుంబాలకు ఆర్థికంగా ఇది పెద్ద దెబ్భే. - గణేశ్‌, మట్టి ప్రతిమల తయారీదారు

ఇదీ చదవండి-రికార్డు స్థాయిలో కరోనా టెస్టులు- రోజుకు 10 లక్షల దిశగా

ABOUT THE AUTHOR

...view details