తెలంగాణ

telangana

స్వర్ణం సాధించటం పట్ల నిఖత్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం..

By

Published : May 20, 2022, 12:22 AM IST

Updated : May 20, 2022, 4:00 AM IST

భారత కీర్తి పతాకాన్ని ఎగరేసిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్​కు అభినందనల వెల్లువ

అద్భుత ప్రదర్శనతో యువమహిళా బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకను ఎగురవేయటంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నిఖత్‌ స్వర్ణం సాధించటంపై రాష్ట్రంలో పలు చోట్ల క్రీడాభిమానులు సంబరాలు జరుపుకొని శుభాకాంక్షలు తెలిపారు. చరిత్ర సృష్టించిన నిఖత్‌కు అభినందనలు తెలిపిన పలువురు ప్రముఖులు భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

స్వర్ణం సాధించటం పట్ల నిఖత్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం..

ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచిన రాష్ట్రానికి చెందిన నిఖత్ జరీన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అద్భుత విజయంతో విశ్వవేదికపై జాతీయ పతాకాన్ని ఎగురవేసిన యువబాక్సర్‌కు యావత్‌ భారతావని జేజేలు పలికింది. నిఖత్‌ ప్రదర్శనను హైదరాబాద్‌ మణికొండలోని తన నివాసంలో వీక్షించిన ఆమె కుటుంబసభ్యులు తమ బిడ్డ ప్రత్యర్థిని మట్టికరిపించటాన్ని చూసి, ఉద్వేగానికి గురయ్యారు. అనంతరం, బంధువులు, కుటుంబసభ్యులు సంబురాలు జరుపుకున్నారు. దేశకీర్తిని ప్రపంచానికి చాటిన తన బిడ్డ చిన్నతనం నుంచి పడిన కష్టానికి ఫలితం దక్కిందని నిఖత్‌ తల్లి పర్విన్‌ సుల్తాన్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో నిఖత్‌ తండ్రి జమీల్‌ అహ్మద్‌తో కలిసి శాట్స్ ఛైర్మన్‌, క్రీడాభిమానులు సంబురాలు జరుపుకున్నారు. ఒకరికొకరు మిఠాయిలు పంచుకుంటూ హర్షం వ్యక్తం చేశారు.

"చాలా గర్వంగా ఫీలవుతున్నా. నిఖత్​ ప్రపంచ ఛాంపియన్​షిప్​ కోసం చాలా కష్టపడింది. దేవుడి దయతో ప్రపంఛ ఛాంపియన్​షిప్​లో గెలిచింది. భవిష్యత్​లో ఒలింపిక్స్​ గోల్డ్​ మెడల్​ గెలవడమే లక్ష్యం. ఆమెకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఆశిస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్​, ఎమ్మెల్సీ కవిత ఎంతగానో సహకరించారు." -పర్విన్‌ సుల్తాన్‌, నిఖత్‌ తల్లి

భారత కీర్తి పతాకాన్ని విశ్వ క్రీడావేదిక మీద ఎగరేసిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్​కు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. టర్కీలో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో స్వర్ణ పతకం సాధించిన క్రీడాకారిణి నిఖత్ జరీన్​కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. ఆమె సాధించిన ఈ విజయం దేశానికి గర్వకారణమన్నారు. భవిష్యత్తులోనూ ఆమె ఇలాంటి మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నామని ఆయన ట్విటర్​లో పేర్కొన్నారు.

అభినందనల వెల్లువ: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్​ నిఖత్​ జరీన్​ను అభినందించారు. గవర్నర్​ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. 52 కిలోల విభాగంలో ప్రపంచ మహిళా బాక్సింగ్​లో స్వర్ణం సాధించడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని తమిళిసై అన్నారు. భారత కీర్తి పతాకాన్ని విశ్వ క్రీడావేదిక మీద ఎగరేసిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ అని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రతిష్టాత్మక ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో విజయం సాధించిన నిఖత్ జరీన్​ను సీఎం కేసీఆర్ అభినంధించారు. బంగారు పతకాన్ని సాధించిన జరీన్​కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని నిఖత్ జరీన్ బాక్సింగ్ క్రీడలో విశ్వ విజేతగా నిలవడం గర్వించదగిన విషయం అని అన్నారు. క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని.. తెలంగాణలోని ప్రతీ గ్రామంలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటుచేసి, యువ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

క్రీడా స్ఫూర్తికి గొప్ప నిదర్శనం: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ సాధించిన నిఖత్ జరీన్​కు మంత్రి హరీష్ రావు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ ప్రోత్సాహం క్రీడా స్ఫూర్తికి గొప్ప నిదర్శనం నిఖత్ జరీన్ పోరాటం అన్నారు. ఈరోజు జరిగిన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్​కు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో నిఖత్ జరీన్​ను తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక సహాయంతో ప్రోత్సాహం అందించారన్నారు.

మంత్రి ప్రశాంత్​ రెడ్డి అభినందనలు: నిఖత్ జరీన్ విజయం తెలంగాణకే గర్వకారణమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కొనియాడారు. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో నిజామాబాద్ ముద్దు బిడ్డ నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించడం హర్షణీయమన్నారు. జరీన్ ఘన విజయంతో తెలంగాణ, నిజమాబాద్ జిల్లా కీర్తి ప్రతిష్టలు, ప్రపంచం నలుదిశలా మరింతగా వ్యాపించనున్నాయన్నారు. నిజామాబాద్ జిల్లాకే గర్వకారణమైన జరీన్​కు వ్యక్తిగతంగా లక్ష రూపాయల నగదు ప్రోత్సాహకం అందించనున్నట్లు ప్రశాంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా నిఖత్ జరీనాకు అన్ని రకాల సహాయ సహకారాలు,ప్రోత్సాహం అందేలా చొరవ తీసుకుంటానన్నారు.

గంగుల, కొప్పుల శుభాకాంక్షలు: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్​షిప్​లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్​ను మంత్రి గంగుల కమలాకర్ అభినందించారు. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో మన తెలంగాణ ముద్దు బిడ్డ నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించడం హర్షణీయమని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జరీన్ ఘన విజయంతో తెలంగాణ కీర్తి ప్రతిష్టలు ప్రపంచం నలుదిశలా మరింతగా వ్యాపిస్తాయని అభిప్రాయపడ్డారు.

ఎర్రబెల్లి, సింగిరెడ్డి అభినందనలు: ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో నిజామాబాద్​కు చెందిన నిఖత్ జరీన్ విశ్వ విజేతగా నిలవడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. గోల్డ్ మెడల్ సాధించి భారత దేశ కీర్తి ని విశ్వవ్యాప్తం చేసిన తెలంగాణ బిడ్డ అని నిఖత్ జరీన్​కు మంత్రి ఎర్రబెల్లి అభినందనలు తెలిపారు. 52 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన నిఖత్ జరీన్​కు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఎంతోమంది తెలంగాణ ఆడబిడ్డలకు నిఖత్ జరీన్ స్ఫూర్తి నింపిందని, తెలంగాణ బిడ్డ ఈ ఘనత సాధించడం ఆనందంగా ఉందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

బండి సంజయ్ అభినందనలు:ప్రపంచ ఛాంపియన్​గా నిలిచిన ఇందూరు బిడ్డ నిఖత్ జరీన్​కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అభినందనలు తెలియజేశారు. 52 కిలోల విభాగంలో థాయ్​లాండ్​కు చెందిన జిట్ పాంగ్ పై 5-0తో సంచలనం విజయం సాధించిన నిఖత్ జరీన్ భారత బాక్సింగ్​లో సరికొత్త శిఖరాన్ని అధిరోహించిందన్నారు. నిఖత్ బాక్సింగ్​లో ప్రపంచ ఛాంపియన్​గా నిలిచిన తొలి తెలుగు బిడ్డ కావడం మనందరికీ గర్వకారణమన్నారు.ఆమె కృషి, పట్టుదలే ఈ విజయానికి కారణమని బండి సంజయ్ కొనియాడారు. ఆమె విజయం మరెంతో మందికి ప్రేరణగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. మోదీ ప్రభుత్వం వచ్చాక భారత్ అన్ని రంగాలతో పాటు క్రీడల్లోనూ అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతోందన్నారు. ఇటీవల బ్యాడ్మింటన్​లో థామస్ కప్ గెలవడం, ఇప్పుడు నిఖత్ బాక్సింగ్​లో ఛాంపియన్ గా నిలవడం భారత క్రీడలకు మంచి రోజులుగా చెప్పుకోవచ్చు అని అన్నారు.

ఎమ్మెల్సీ కవిత, షర్మిల శుభాకాంక్షలు: నిజామాబాద్ జిల్లా ముద్దుబిడ్డ నిఖత్ జరీన్​కు ఎమ్మెల్సీ కవిత ట్విటర్​ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. విశ్వ వేదికపై అద్భుత ప్రతిభ కనబర్చి, దేశానికి పసిడి పతకం తీసుకురావడం అభినందనీయమన్నారు. మహిళల ప్రపంచ ఛాంపియన్ షిప్ సాధించడం పట్ల గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి పతకాలు మరెన్నో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని ఎమ్మెల్సీ కవిత ట్విటర్​లో వెల్లడించారు. నిఖత్ జరీన్​కు వైఎస్సార్​ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్ షర్మిల శుభాకాంక్షలు తెలియజేశారు. నిఖత్ జరీన్ విజయం తెలంగాణకు గర్వకారణమని అన్నారు. విశ్వ వేదికపై అద్భుత ప్రతిభ కనబర్చి, దేశానికి పసిడి పతకం తీసుకురావడం అభినందనీయమన్నారు.

ఇవీ చదవండి:

Last Updated :May 20, 2022, 4:00 AM IST

ABOUT THE AUTHOR

...view details