తెలంగాణ

telangana

KCR: 'మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ అమలు చేసి తీరుతాం'

By

Published : May 3, 2023, 7:30 AM IST

CM KCR Meeting with Maharashtra Leaders: మహారాష్ట్ర సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్​లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అనేకమంది తనతో చర్చలు జరుపుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. మహారాష్ట్రలో భారత్ రాష్ట్ర సమితికి రోజురోజుకీ పెరుగుతున్న ఆదరణతో పార్టీలు బెంబేలెత్తిపోతున్నాయని అన్నారు. బీఆర్ఎస్​ అడుగుపెట్టగానే అక్కడి ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధిని పెంచిందని వీఆర్ఏ వ్యవస్థపై ఆలోచిస్తోందని చెప్పారు. పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ మోడల్ అమలు చేస్తామనేందుకు ఆ రెండు విజయాలే నిదర్శనమని గులాబీ దళపతి పేర్కొన్నారు. మే 10న ఒకే సమయంలో 288 నియోజకవర్గాల్లో పార్టీ సంస్థాగత నిర్మాణం ప్రారంభించాలని ఆ రాష్ట్ర నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

CM KCR
CM KCR

మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ అమలు చేసి తీరుతాం

CM KCR Meeting with Maharashtra Leaders: మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించనుందని.. ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. మరాఠగడ్డపై బీఆర్ఎస్​కి పెరుగుతున్న ఆదరణకు రాజకీయ పార్టీలు బెంబేలెత్తిపోతున్నాయన్న గులాబీ దళపతి.. అది వ్యక్తి విజయం కాదని అబ్‌ కీ బార్ కిసాన్ సర్కార్ నినాద బలమని పేర్కొన్నారు. బీఆర్ఎస్​లో చేరేందుకు మహారాష్ట్ర సిట్టింగ్ ఎమ్మెల్యేలు అనేక మంది తనతో సంప్రదింపులు చేస్తున్నారని పార్టీ విస్తరణ వ్యూహాలపై ఆ రాష్ట్ర నాయకులతో నిర్వహించిన చర్చలో వివరించారు.

KCR Meeting at Telangana Bhavan: అబ్‌ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదం బీఆర్ఎస్ సిద్ధాంతాలు.. లక్ష్యాన్ని ప్రజలకుచేర్చి వారిప్రేమ పొందాలని నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రజల మనసు గెలిచే క్రమంలో వ్యక్తిగత విమర్శలకు తావుఇవ్వద్దని సూచించారు. భారత్ రాష్ట్ర సమితి ఆత్మస్థైర్యం, మనోనిబ్బరం, సంకల్పసిద్ధి, చిత్తశుద్ధి, కార్యాచరణ మహోన్నతమైనదని.. ఆక్రమంలో లక్ష్యం నుంచి ఎవరూ తప్పుకోవద్దని దిశానిర్దేశం చేశారు. వ్యక్తులు ముఖ్యం కాదు.. పార్టీనే ముఖ్యమన్నారు. పదవులు వచ్చేవరకు పాదాలు పట్టుకొని ప్రార్థించి పదవిరాగానే కళ్లునెత్తికిపోయే పరిస్థితి బీఆర్ఎస్​లో ఉండదని కేసీఆర్ స్పష్టం చేశారు.

నియామకం పూర్తి చేస్తాం: దేశాన్ని మలుపు తిప్పే అవకాశం తెలంగాణ తర్వాత మహారాష్ట్రకే వచ్చిందని.. సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జీల నియామకం దాదాపు పూర్తైందన్న కేసీఆర్‌.. రెండు మూడు రోజుల్లో జిల్లా సమన్వయకర్తల నియామకం పూర్తి చేస్తామని తెలిపారు. ఈనెల 10 నుంచి జూన్ 10 వరకు పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు.

ఒకే రోజు ఒకే సమయంలో 288 నియోజకవర్గ కేంద్రాల నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణం ప్రారంభం కావాలని తెలిపారు. శివాజీ, అంబేడ్కర్‌ విగ్రహాల నుంచే బీఆర్ఎస్ కార్యక్రమం మొదలు కావాలని కేసీఆర్‌ సూచించారు. ఈనెల 8, 9న మహారాష్ట్ర నాయకులకు తెలంగాణ భవన్‌లో శిక్షణా శిబిరాలు నిర్వహించనున్నట్లు గులాబీ దళపతి చెప్పారు. బీఆర్ఎస్ సాధారణ సభ్యత్వానికి 10 రూపాయలు క్రియాశీల సభ్యత్వానికి 50 రూపాయలు చెల్లించాలని తెలిపారు.

నియోజకవర్గాల వారీగా పంపిస్తాం: క్రియాశీల సభ్యులకే సర్పంచ్ మొదలు ఎంపీ వరకు అర్హత ఉంటుందని కేసీఆర్‌ వివరించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదుపై జిల్లా సమన్వయ కర్తలు దృష్టి సారించాలని ఆదేశించారు. సంస్థాగత నిర్మాణంలో భాగంగా గ్రామ, పట్టణ కమిటీలు వార్డు కమిటీలతో పాటు రైతు, ఎస్సీ, ఎస్టీ, యువజన, మహిళా, విద్యార్థి సహ 9 కమిటీలుంటాయని అన్నారు. టోపీలు, జెండాలు, కండువాలు, పోస్టర్లు, కరపత్రాలు వంటి ప్రచారసామాగ్రి త్వరలో నియోజకవర్గాల వారీగా పంపిస్తామని కేసీఆర్ చెప్పారు.

అధికారంలోకి వస్తే ఇంకెన్నిచేయవచ్చో?: మహారాష్ట్ర రాజకీయాల మార్పు ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పునకు శ్రీకారమని కేసీఆర్ పునరుద్ఘాటించారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ అడుగుపెట్టగానే కిసాన్ సమ్మాన్‌ నిధిని పెంచుతామని ప్రకటించారని.. ఇప్పుడు వీఆర్ఏ వ్యవస్థపై ఆలోచిస్తున్నట్లు సర్కారు ప్రకటించిందన్నారు. బీఆర్ఎస్ పూర్తిగా రంగంలోకి దిగకముందే రెండు అద్భుత విజయాలు సాధిస్తే.. పార్టీ అధికారంలోకి వస్తే ఇంకెన్నిచేయవచ్చో? ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని కేసీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణ మోడల్ అమలు:పార్టీ అధికారంలోకి వస్తే మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ అమలు చేసి తీరతామనేందుకు ఆ రెండు విజయాలే సంకేతమని కేసీఆర్ చెప్పారు. యావత్‌మామాల్‌ మాజీ ఎమ్మెల్యే రాజుతోడ్‌సమ్.. ఔరంగబాద్ జడ్పీ మాజీ వైస్ ఛైర్మన్లు పవన్‌తిజారే, గజానన్ అందాబడ్కర్ , ఆదివాసీల సంఘం అధ్యక్షుడు సూరజ్ ఆత్రం.. దళిత సంఘాల ఔరంగబాద్ జిల్లా అధ్యక్షుడు అరవింద్ గోటేకర్ తదితరులు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్​లో చేరారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details