తెలంగాణ

telangana

హస్తినలో సీఎం కేసీఆర్.. కొత్త రాష్ట్రపతిని కలిసే అవకాశం!

By

Published : Jul 25, 2022, 7:38 PM IST

Updated : Jul 26, 2022, 3:15 AM IST

KCR Delhi Tour: మూడురోజుల పర్యటన నిమిత్తం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం రాత్రి దిల్లీ వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి రాత్రి 9.45 గంటలకు దిల్లీకి చేరుకున్నారు. నూతన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

KCR Delhi Tour
KCR Delhi Tour

KCR Delhi Tour: మూడురోజుల పర్యటన నిమిత్తం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం రాత్రి దిల్లీ వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి రాత్రి 9.45 గంటలకు దిల్లీకి చేరుకున్నారు. సీఎం వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌, ఎంపీలు జోగినపల్లి సంతోష్‌కుమార్‌, జి.రంజిత్‌రెడ్డి ఉన్నారు.

ఇంకా ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, తెరాస ప్రధానకార్యదర్శి రావుల శ్రవణ్‌కుమార్‌రెడ్డి, కరీంనగర్‌ మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రికి దిల్లీ విమానాశ్రయంలో తెరాస లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు స్వాగతం పలికారు. రాష్ట్రపతి ఎన్నికలు ముగిసి, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తరుణంలో సీఎం హస్తిన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. తన పర్యటనలో కొత్త రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును సీఎం మర్యాదపూర్వకంగా కలవనున్నట్లు తెలిసింది. కేంద్రం వద్ద పెండింగులో ఉన్న పోడుభూముల చట్టసవరణ, తెలంగాణలో గిరిజన, మైనారిటీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు ఆమోదం, భద్రాచలం వద్ద తెలంగాణ నుంచి ఏపీలో విలీనం చేసిన అయిదు గ్రామాలను రాష్ట్రానికి తిరిగి ఇప్పించడం తదితర అంశాలను ఆమెకు విన్నవించనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి వరదసాయం, విభజన హామీల అమలుపై విజ్ఞాపనలిచ్చేందుకు యోచిస్తున్నారు. అయితే సోమవారం రాత్రి వరకు ఎవరి అపాయింట్‌మెంటూఖరారు కాలేదు. కేంద్రం అప్పుల రూపేణా విధిస్తున్న ఆంక్షలు, పార్లమెంటులో చేసిన ప్రకటనకు సంబంధించి ఆర్థిక నిపుణులతో చర్చించి, కేంద్రాన్ని విమర్శిస్తూ ఆయన మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. మరోవైపు పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై ఆయన తెరాస ఎంపీలతో భేటీ అవుతారు. దీంతో పాటు కొత్త జాతీయ పార్టీ, జాతీయ రాజకీయ పరిణామాలపై పలు పార్టీ నేతలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్‌ అళ్వాకు మద్దతు కోసం విపక్షాలు దిల్లీలో నిర్వహించే సమావేశానికి సీఎం కేసీఆర్‌ను ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్‌ ఆహ్వానించినట్లు తెలిసింది.

Last Updated : Jul 26, 2022, 3:15 AM IST

ABOUT THE AUTHOR

...view details