తెలంగాణ

telangana

దిల్లీలో సీఎం కేసీఆర్.. రేపు బీఆర్​ఎస్​ ప్రధాన కార్యాలయం ప్రారంభం

By

Published : Dec 13, 2022, 6:44 AM IST

CM KCR Delhi Tour Updates: దిల్లీలో భారత్‌ రాష్ట్ర సమితి ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవానికి... సర్వం సిద్ధమవుతోంది. రేపు మధ్యాహ్నం కార్యాలయాన్ని కేసీఆర్‌ ప్రారంభించనుండగా... ఆ కార్యక్రమానికి అఖిలేష్‌, తేజస్వీ యాదవ్‌, రైతునేత రాకేశ్‌ హాజరుకానున్నారు. రెండ్రోజులపాటు జరిగే పూజా కార్యక్రమాల్లో కేసీఆర్‌ కుటుంబ సమేతంగా పాల్గొననున్నారు.

CM KCR
CM KCR

దిల్లీలో సీఎం కేసీఆర్.. రేపు బీఆర్​ఎస్​ ప్రధాన కార్యాలయం ప్రారంభం

CM KCR Delhi Tour Updates: తెలంగాణ పాలనను దేశవ్యాప్తంగా అందించేడమే లక్ష్యంగా... భారత్‌ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన కేసీఆర్‌... దిల్లీలో జాతీయ కార్యాలయం ఏర్పాటుకు సిద్ధమయ్యారు. బీఆర్​ఎస్ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌... సోమవారం రాత్రి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ బయలుదేరి వెళ్లారు. సర్దార్‌పటేల్‌ మార్గ్‌లోని అద్దె భవనంలో బీఆర్​ఎస్ పార్టీ తాత్కాలిక జాతీయ కార్యాలయాన్ని... బుధవారం మధ్యాహ్నం 12.36 గంటలకు సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు.

ఆ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్, ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్, రైతు నాయకుడు రాకేష్‌ టికాయిత్‌ సహా పలు రైతు సంఘాల నేతలు హాజరుకానున్నారు. బీఆర్​ఎస్ విజయవంతం సహా... దేశం సుభిక్షంగా ఉండటానికి దైవకృప కోసం రాజశ్యామల యాగాన్ని కేసీఆర్‌ నిర్వహిస్తున్నారు. కొత్త కార్యాలయ ఆవరణలో కేసీఆర్‌... రెండురోజులపాటు సతీసమేతంగా రాజశ్యామల యాగం, పూజా కార్యక్రమాలు చేయనున్నారు. శృంగేరి పీఠం గోపికృష్ణశర్మ, ఫణిశశాంక శర్మ ఆధ్వర్యంలో 12 మంది రిత్వికుల సమక్షంలో పూజలు, యాగాలు నిర్వహిస్తున్నారు. రాజశ్యామల యాగం కోసం ప్రత్యేక యాగశాలను నిర్మించిన పార్టీ నేతలు... మూడు హోమగుండాలు ఏర్పాటుచేశారు.

ఉదయం 9 గంటలకు గణపతి పూజతో యాగం మొదలు పెట్టనున్న ఋత్వికులు... పుణ్యావాచనం, యాగశాల సంస్కారం, యాగశాల ప్రవేశం, చండి పారాయణాలు, మూలమంత్ర జపాలు చేయనున్నారు. ఎల్లుండి నవచండిహోం, రాజశ్యామల హోం, ఇతర పూజాకార్యక్రమాలు... పూర్ణాహుతి కార్యక్రమం చేపట్టనున్నారు. ఆ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇప్పటికే పలువురు ఎంపీలు, తెరాస నేతలు, ప్రజాప్రతినిధులు దిల్లీ వెళ్లారు. సుద్దాల సుధాకర్‌తేజ సూచనల మేరకు కార్యాలయ భవనంలో మార్పులు, చేర్పులు, మరమ్మతు పనులు నిర్వహిస్తున్నారు.

కేసీఆర్ ఫర్‌ ఇండియా, దేశ్‌కీ నేత.. కిసాన్‌కీ భరోసా, అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ అనే నినాదాలతో దిల్లీ వీధుల్లో హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కేసీఆర్‌ పర్యటన ఐదురోజుల పాటు సాగనుంది. ఆయన ఈనెల 18న హైదరాబాద్‌కు తిరిగి వస్తారని సమాచారం. ఇతర రాష్ట్రాల్లోనూ బీఆర్​ఎస్ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్టు పార్టీ నాయకుల ద్వారా తెలిసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details