తెలంగాణ

telangana

MODI-CBN: ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై ప్రత్యేక చర్చ!

By

Published : Aug 6, 2022, 10:16 PM IST

CBN With National media: దిల్లీలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సమావేశంలో పాల్గొన్న తెదేపా అధినేత చంద్రబాబు.. సమావేశం తర్వాత ప్రధాని మోదీతో ప్రత్యేకంగా పలు అంశాలపై చర్చించారు. చానాళ్ల తర్వాత మోదీ, చంద్రబాబు పలు అంశాలపై చర్చించుకున్నారు.

MODI-CBN
MODI-CBN

దిల్లీలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సమావేశంలో తెదేపా అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. సమావేశం తర్వాత ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. చాన్నాళ్ల తర్వాత మోదీ, చంద్రబాబు ఒకరినొకరు పలకరించుకొని ప్రత్యేకంగా చర్చించుకున్నారు. 5 నిమిషాలపాటు పలు అంశాలపై మోదీ, చంద్రబాబు మాట్లాడుకున్నారు.

ఆందోళనలో జగన్:కార్యక్రమం అనంతరం జాతీయ మీడియాతో చంద్రబాబు ఇష్టాగోష్టిగా మాట్లాడారు.జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. జనం నాడి తెలిసి జగన్ ఆందోళనలో ఉన్నారని వ్యాఖ్యనించారు. వైకాపా ప్రభుత్వానికి రాష్ట్ర అభివృద్ధిపై ధ్యాసే లేదని ఆక్షేపించారు. ఏపీ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని.. వైకాపా ప్రభుత్వం వచ్చాక మొత్తం వ్యవస్థలు నాశనం చేశారని దుయ్యబట్టారు. తమ హయాంలో పోలవరం, అమరావతికి నడుం బిగిస్తే.. జగన్ అధికారంలోకి వచ్చాక రెండింటినీ నాశనం చేశారని మండిపడ్డారు. అనేక విపత్తులు ఎదురైనా మనదేశం ధైర్యంగా నిలబడిందని అన్నారు. అనేక దేశాల కంటే మనదేశ తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని అన్నారు.

ప్రధాని మోదీతో చంద్రబాబు

డీజీపీకి చంద్రబాబు లేఖ: పాలకొల్లులో టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం నేతల పట్ల వైకాపా గూండాలు దౌర్జన్యంగా వ్యవహరించారంటూ చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు. పెంకులపాడులో టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ వేదికపైకి వెళ్లకుండా అడ్డుకోవడమే కాకుండా వారిపై దాడి చేశారని లేఖలో పేర్కొన్నారు. ఈ దాడిలో ఎమ్మెల్యే రామానాయుడు గాయపడ్డారని తెలిపారు. వైకాపా నాయకుల దౌర్జన్యకాండపై అక్కడే ఉన్న పోలీసులు ఎవరూ స్పందించలేదన్నారు. పోలీసుల సమక్షంలోనే ఇద్దరు ప్రజాప్రతినిధులకు రక్షణ లేదంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి అలసత్వం ప్రదర్శించిన పోలీసులతో పాటు.. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేఖతో పాటు నేతలపై దాడికి సంబంధించి వీడియోలు, ఫోటోలు జత చేశారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details