తెలంగాణ

telangana

కల్వకుర్తి ఎత్తిపోతలకు బైపాస్‌ కాల్వ

By

Published : Apr 6, 2021, 7:48 AM IST

Bypass canal, Kalwakurthy lift irrigation scheme
కల్వకుర్తి ఎత్తిపోతలకు బైపాస్‌ కాల్వ

మహాత్మాగాంధీ కల్వకుర్తి సాగునీటి ఎత్తిపోతల పథకం మొదటి పంపుహౌస్‌ అప్రోచ్‌ కాల్వపై రెగ్యులేటర్‌ను నిర్మించేందుకు ముందుగా ఒక బైపాస్‌ కాల్వలను తవ్వాలని నిర్ణయించారు. ఈ పథకానికి రెగ్యులేటర్‌ లేకపోవడంతో ఇప్పటికే రెండు సార్లు జలాలు పంపుహౌస్‌లోకి వచ్చి పంపులు మునిగిపోయి భారీ నష్టం సంభవించింది.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొల్లాపూర్‌ మండలంలో శ్రీశైలం వెనుక జలాల ఆధారంగా కల్వకుర్తి ఎత్తిపోతలను నిర్మించారు. శ్రీశైలం వెనుక జలాలు రేగుమానుగడ్డ వద్ద ఉన్న ఈ ఎత్తిపోతల మొదటి దశ పంపుహౌస్‌లోకి నేరుగా వస్తాయి. వానాకాలంలో జలాశయం నీటి ఒత్తిడితో పంపుల షట్టర్లకు లీకేజీ ఏర్పడటం, ఇతరత్రా కారణాలతో పంపు హౌస్‌లోకి జలాలు ప్రవేశించి మునిగిపోతోంది. 2014 సెప్టెంబరులో, గతేడాది అక్టోబరులోనూ ఐదు పంపులున్న హౌస్‌ మొత్తం మునిగి పోయింది. రెండు నెలలకుపైగా నీటి ఎత్తిపోతల నిలిచిపోయింది.

శాశ్వత పరిష్కారానికి..

అప్రోచ్‌ కాల్వపై రెగ్యులేటర్‌ (షట్టర్‌) ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన మొదటి నుంచీ ఉంది. జలాశయం నుంచి వచ్చే నీటి ఒత్తిడిని ఇది కొంత వరకు అడ్డుకుంటుంది. 2017లో అప్పటి ధరల ప్రకారం రూ.18 కోట్ల అంచనాలతో టెండర్లు పిలవగా నీటి ఉద్ధృతి ఉందనే కారణంతో పనులు చేపట్టలేదు. ప్రస్తుతం ఈ పనులకు సాంకేతిక అంచనాలు పూర్తిచేశారు. తాజాగా పనులకు దాదాపు రూ.23 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నెలాఖరుతో ఆయకట్టు సాగుకు నీటి ఎత్తిపోత పూర్తికానుంది. తాగునీటి అవసరాలకు మొదట బైపాస్‌ కాల్వను ఏర్పాటు చేసి ఒక పంపుతో మిషన్‌ భగీరథకు నీటిని తరలించాలనే నిర్ణయానికి వచ్చారు. అప్రోచ్‌ కాల్వకు అడ్డుకట్ట వేసి రెగ్యులేటర్‌ బిగించాలని భావిస్తున్నారు. వానాకాలంలోపే ఈ పనులు పూర్తి చేయాలని ఇటీవల సీఎం ఆదేశించిన నేపథ్యంలో అధికారులు వేగంగా చర్యలు చేపడుతున్నారు.

ఇదీ చూడండి: కొండపోచమ్మ జలాశయం నుంచి నీటిని విడుదల చేయనున్న సీఎం

ABOUT THE AUTHOR

...view details