తెలంగాణ

telangana

'రాష్ట్రంలో గందరగోళం, రాజకీయ అస్థిరత సృష్టించేందుకు బీజేపీ కుట్ర'

By

Published : Apr 7, 2023, 6:36 PM IST

BRS Leaders on Singareni Privatization : ప్రధాని నరేంద్ర మోదీ రేపటి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కావడం లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఆచరించే వారే నీతులు చెప్పాలని.. మోదీ కాదని ధ్వజమెత్తారు. మరోవైపు మోదీ దోస్తులకు సింగరేణిని కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతోందని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ ఆరోపించారు.

BRS
BRS

BRS Leaders on Singareni Privatization : ప్రధాని పర్యటన వేళ రాష్ట్రంలో సింగరేణి గనులపై రాజకీయ వేడి రగులుకుంది. రేపు మోదీ రాక సందర్భంగా సింగరేణి ప్రైవేటీకరణ పట్ల కేంద్రం తీరును నిరసిస్తూ ఇప్పటికే బీఆర్​ఎస్ ఆందోళనలకు పిలుపునిచ్చింది. అధికార పార్టీ ఆందోళనలపై ఎదురుదాడికి దిగిన కమలదళం.. రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం ఉన్న సింగరేణిని కేంద్రం ఎలా ప్రైవేటీకరిస్తుందని ప్రశ్నిస్తోంది. ప్రైవేటుపరం చేసే ఉద్దేశం లేకుంటే సింగరేణికి బొగ్గు గనులు ఎందుకు కేటాయించటం లేదని గులాబీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

లాభాల్లో ఉన్న సింగరేణిని అదానీకి అప్పగించి నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. బొగ్గు గనులను సింగరేణికి ఇవ్వకుండా.. ప్రైవేట్ వ్యక్తులకు ఎందుకు అప్పగిస్తోందన్నారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేయమన్న నరేంద్రమోదీ మాట తప్పారన్నారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేయమన్న కేంద్రం.. బొగ్గు బ్లాకులను ఎందుకు వేలానికి పెట్టిందని బాల్క సుమన్ ప్రశ్నించారు. బొగ్గు గనులను సింగరేణికే అప్పగించాలని మోదీని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కోరాలని.. లేకపోతే సింగరేణి ప్రాంతాల్లో ఆ పార్టీ నేతలను తిరగనివ్వమని బాల్క సుమన్ హెచ్చరించారు. అబద్ధాలు చెప్పడంలో బండి సంజయ్ అగ్రగణ్యుడని విమర్శించారు. సింగరేణిని ప్రైవేటీకరించవద్దని కేంద్రాన్ని పలుమార్లు కోరామని.. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా లేఖ రాశారన్నారు.

'సింగరేణికి గనులు కేటాయించాలని కేంద్రాన్ని కోరాం. సింగరేణికి ఒక్క గని కూడా కేటాయించలేదు. సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తే ఉద్యమిస్తాం. సింగరేణి పరిసరాల్లోని గనులను వేలానికి పెడుతున్నారు. సింగరేణిని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ మిత్రుడు అదానీకి అప్పగించేందుకు కుట్ర. ఏమీ తెలియకుండా బండి సంజయ్‌ ఏదేదో మాట్లాడుతున్నారు. సింగరేణిలోని బొగ్గు గనులను సింగరేణి సంస్థకే కేటాయించాలి. లాభాల్లో ఉన్న సింగరేణిని నష్టాల పాలు చేయవద్దు.'-బాల్క సుమన్, ప్రభుత్వ విప్

రేపటి సభకు కేసీఆర్ హాజరుకారు : మరోవైపు ప్రధాని నరేంద్రమోదీ రేపటి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కావడం లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ప్రొటోకాల్​ను పాటించకుండా అవమానించింది ప్రధానేనని ఆయన అన్నారు. గతంలో కొవిడ్ సందర్భంగా ప్రధాని హైదరాబాద్ వచ్చినప్పడు.. సీఎం వెళ్తానంటే వద్దన్నారన్నారు. రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న ముఖ్యమంత్రిని ఆ రోజు ఎందుకు వద్దన్నారో ఇప్పటి వరకు చెప్పలేదని వినోద్ కుమార్ అన్నారు.

కుట్రలు, కుతంత్రాల బీజేపీ రాజ్యమేలుతోంది : సూత్రప్రాయంగా అంగీకరించిన 14 జాతీయ రహదారులను ఎందుకు మంజూరు చేయడం లేదని.. పెండింగ్​లో ఎందుకు పెట్టారో రాష్ట్ర పర్యటన సందర్భంగా నరేంద్రమోదీ స్పష్టత ఇవ్వాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలు ఎందుకు ఇవ్వడం లేదో తెలపాలన్నారు. విభజన చట్టం ప్రకారం రైల్వే లైన్లు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో గందరగోళం, రాజకీయ అస్థిరత సృష్టించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు.

రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసేందుకు, మతతత్వ బీజాలు నాటుతోందని వినోద్​ కుమార్ మండిపడ్డారు. వాజ్​పేయి, అద్వానీ బీజేపీ కాదని.. ఇప్పుడు కుట్రలు, కుతంత్రాల బీజేపీ రాజ్య మేలుతోందని విమర్శించారు. ఆచరించే వారే నీతులు చెప్పాలని.. మోదీ కాదని ఆరోపించారు. పార్లమెంటులో నిరసన తెలిపి ఎయిమ్స్‌ తెచ్చుకున్నామని.. బీబీనగర్‌లో నాలుగేళ్లుగా ఎయిమ్స్‌ భవనాలు కడుతున్నారని... ఇప్పుడు శంకుస్థాపన చేయడం ఏమిటని.. ఎవరిని మోసం చేస్తారని ఆయన ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details