తెలంగాణ

telangana

మండలి ఎన్నికల్లో ఎంఐఎంకు BRS మద్దతు

By

Published : Feb 21, 2023, 10:50 AM IST

Updated : Feb 21, 2023, 12:32 PM IST

Telangana MLC Elections 2023 : రాష్ట్రంలో త్వరలో జరగనున్న మండలి ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్‌ ఎంఐఎంకు తమ మద్దతు ప్రకటించింది. మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీ చేసిన అభ్యర్థన మేరకు సీఎం కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Telangana MLC Elections 2023
Telangana MLC Elections 2023

Telangana MLC Elections 2023 : రాష్ట్రంలో త్వరలో జరగనున్న మండలి ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంఐఎంకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మిత్రపక్షమైన ఎంఐఎం చేసిన అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి బీఆర్‌ఎస్‌ వైదొలిగి.. ఎంఐఎంకు తోడుగా నిలవనుంది. మరోవైపు బీఆర్‌ఎస్‌ మద్దతు ప్రకటించడంతో త్వరలోనే ఎంఐఎం తమ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

ఎమ్మెల్సీ ఎన్నికలో తమ పార్టీకి మద్దతు ప్రకటించినందుకు బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అందరినీ కలుపుకొనిపోయే దార్శనికత కలిగిన సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని తెలంగాణ, దేశ ప్రజలు ఆశీర్వదిస్తారని అసద్ ఆశాభావం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి ఎన్నికైన కాటేపల్లి జనార్దన్‌రెడ్డి పదవీ కాలం మార్చి 29న, హైదరాబాద్‌ స్థానిక సంస్థల నియోజక వర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సయ్యద్‌ అమీనుల్‌ హస్సన్‌ జాఫ్రీ పదవీ కాలం ఈ ఏడాది మే ఒకటో తేదీన ముగియనుంది. ఈ స్థానాలకు మార్చి 13న ఎన్నికలు జరగనున్నాయి.

MLC Elections 2023 in Telangana: మరోవైపు ఈ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఇప్పటికే తమ అభ్యర్థిని ప్రకటించింది. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా దిల్‌సుఖ్‌నగర్‌ పబ్లిక్‌ స్కూల్‌ ఛైర్మన్‌ వెంకట నారాయణరెడ్డిని బరిలోకి దింపింది. ఈ నెల 16న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ.. ఈ నెల 23 వరకు కొనసాగనుంది.

ఇదిలా ఉండగా.. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ శాసనమండలి ఉపాధ్యాయుల నియోజకవర్గంలో ఓటు నమోదు గడువు ఇప్పటికే ముగిసింది. డిసెంబరులో ప్రకటించిన ఓటర్ల జాబితాలో ఈ నియోజకవర్గంలో 29,501 మంది ఓటర్లు ఉండగా.. కొత్తగా ఓటు నమోదుకు 1,131 దరఖాస్తులు అందినట్లు అధికారులు ఇటీవల వెల్లడించారు.

స్థానిక సంస్థల కోటాలో..: ఇక హైదరాబాద్‌ స్థానిక సంస్థల కోటాలో ఉన్న ఓటర్ల సంఖ్య 127 మంది. హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని ఇద్దరు లోక్‌సభ సభ్యులు, 15 మంది ఎమ్మెల్యేలు, కంటోన్మెంట్‌ సభ్యులు, కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులుగా గ్రేటర్‌ హైదరాబాద్‌ను ఎంచుకున్న రాజ్యసభ, శాసనమండలి సభ్యులతో కలిపి 127 మంది ఓటర్లు ఉన్నారు.

ఇవీ చూడండి..

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు బీజేపీ అభ్యర్థి ప్రకటన

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బహుముఖ పోటీ

Last Updated : Feb 21, 2023, 12:32 PM IST

ABOUT THE AUTHOR

...view details