తెలంగాణ

telangana

దుబ్బాక మాదిరిగానే సాగర్‌లోనూ ప్రజల తీర్పు : బండి సంజయ్

By

Published : Feb 10, 2021, 9:29 PM IST

Updated : Feb 10, 2021, 9:34 PM IST

నాగార్జునసాగర్‌ ఎన్నికల ప్రచార సభలో తాను చెప్పింది చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లే అడగనంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి పచ్చి అబద్ధాలు మాట్లాడారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. అనేక సార్లు కేసీఆర్‌ ఈ మాటనే చెప్పి మాట తప్పారని విమర్శించారు.

'మరోసారి అబద్ధాలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు'
'మరోసారి అబద్ధాలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు'

నాగార్జునసాగర్ గిరిజనుల భూములు కబ్జా చేసిన తెరాస నేతలపై సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. నాగార్జునసాగర్ ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులను తాను కుర్చీవేసుకుని కూర్చొని పూర్తిచేయిస్తానని ఆరేళ్లకిందటే చెప్పిన కేసీఆర్​కు ఆరేళ్లైనా... కుర్చీ దొరకలేదా అని ప్రశ్నించారు. చేసిన పనికి నిధులు విడుదల చేస్తే కేవలం ఏడాదిలో పూర్తిచేస్తానని ఎస్​ఎల్​బీసీ టన్నెల్ వర్క్ చేస్తున్న కంపెనీయే చెబుతుంటే.. నిధులు ఇవ్వక దాన్ని పూర్తికాకుండా అడ్డుపడుతున్నది స్వయంగా కేసీఆరేనని దుయ్యబట్టారు.

త్వరలో డిండి పూర్తవుతుందని చెబుతున్న కేసీఆర్... దానికి ఎగువన ఉన్న నక్కలగండి, శివన్నగూడెం ఎప్పుడు పూర్తవుతుందో ముందుచెప్పాలని డిమాండ్‌ చేశారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఈ ఆరేళ్లలో అదనంగా ఒక్క ఎకరానికి నీళ్లివ్వని ఈ సర్కార్... ఉప ఎన్నికలు రాగానే తిమ్మిని బమ్మిని చేసి మాట్లాడితే రైతులు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.

ఓట్ల కోసం ఏమైనా చేస్తారా?

ఇంటింటికి మిషన భగీరథ ద్వారా మంచినీళ్లివ్వకపోతే 2018 ఎన్నికల్లో ఓట్లే అడగనన్న వ్యక్తి... రాష్ట్రంలో సగం గ్రామాలకు కూడా నీళ్లు రాకున్నా... ఏ మొహం పెట్టుకుని ఓట్లడిగారాని బండి సంజయ్ ప్రశ్నించారు. ఎన్నికలు, ఓట్లకోసం కేసీఆర్ ఎన్ని అనైతిక పనులైనా చేస్తారని దుయ్యబట్టారు.

గిరిజనులపై దొంగ ప్రేమ ఒలకబోస్తున్న సీఎం... ముందుగా వాళ్లకు 10 శాతం రిజర్వేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్తవాళ్లకు ఆసరా పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు రావాలంటే ఆ నియోజక వర్గంలో ఉపఎన్నికలు రావాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం మాటలను ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరని దుబ్బాకలో ఇచ్చిన తీర్పునే నాగార్జునసాగర్‌లో కూడా పునరావృతమవుతుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:కృష్ణా-గోదావరి నదులను అనుసంధానిస్తాం: కేసీఆర్​

Last Updated :Feb 10, 2021, 9:34 PM IST

ABOUT THE AUTHOR

...view details