తెలంగాణ

telangana

కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలి : బీజేపీ ఎమ్మెల్యేలు

By ETV Bharat Telangana Team

Published : Dec 22, 2023, 7:12 PM IST

BJP MLAs on Congress Six Guarantees : రాష్ట్ర విద్యుత్‌ సంస్థల అప్పులు, సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం లేఖ రాయాలన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల సంగతేంటని ప్రశ్నించారు.

MLA Payal Shankar Fires on Congress
BJP MLAs on Congress Six Guarantees

BJP MLAs on Congress Six Guarantees : కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం లేఖ రాయాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. విద్యుత్‌ శాఖ ప్రాజెక్టులపై న్యాయ విచారణకు ఆదేశిస్తామని ప్రకటించిన కొద్ది సేపటికే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను చూస్తే జాలేస్తోందని కాంగ్రెస్‌ సభ్యులు అన్నారని ఆదిలాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ అన్నారు. అధికార పార్టీ నేతలకు ప్రారంభంలోనే బీఆర్‌ఎస్‌పై జాలి కలిగితే, ఇక విచారణ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఈ విషయంలో కాంగ్రెస్‌పై తమకు అనుమానంగా ఉందన్నారు.

200 యూనిట్ల ఉచిత కరెంట్‌ ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పండి : పాయల్ శంకర్

MLA Payal Shankar Fires on Congress : నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో పార్టీకి చెందిన నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కంటే ఒక సీటు తక్కువ ఉన్న ఎంఐఎం పార్టీకి శాసనసభలో మాట్లాడేందుకు ఎక్కువ సమయం ఇచ్చారని పాయల్‌ శంకర్ మండిపడ్డారు. ఇదెక్కడి సంప్రదాయమని అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రిని కలిసి అడిగినట్లు చెప్పారు.

200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలి. విద్యుత్‌ సంస్థల అప్పులపై సీబీఐ విచారణ జరిపించాలి. మోటార్లకు మీటర్ల విషయంలో బీఆర్‌ఎస్‌ నేతలు అబద్ధాలు చెప్పారు. మీటర్లు పెట్టడానికి, ఉచిత విద్యుత్‌కు సంబంధం లేదు. మోటార్లకు మీటర్లు పెట్టిన ఏపీలోనూ ఉచిత విద్యుత్‌ పథకం కొనసాగుతోంది. - పాయల్‌ శంకర్‌, ఆదిలాబాద్ ఎమ్మెల్యే

'గెలుపు దగ్గరి దాకా వచ్చి ఓడిపోయాం - అసెంబ్లీ ఎన్నికల్లో నైతిక విజయం మనదే'

మిగిలిన హామీల సంగతేంటి : కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మి పథకంలోని స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని మాత్రమే అమలు చేశారని నిజామాబాద్‌ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్య నారాయణ గుప్తా పేర్కొన్నారు. మిగిలిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే అక్బరుద్దీన్ ఓవైసీ సమయం దొరికినప్పుడల్లా తమ పార్టీపై అక్కసు వెళ్లగక్కుతున్నారని దుయ్యబట్టారు.

కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడం సాధ్యం కాదని తెలిసే, రాష్ట్ర ప్రభుత్వ అప్పులను వివరించి ప్రజలను మానసికంగా సన్నద్ధం చేయడానికే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించారని బీజేపీ ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన ధ్వంసం, విధ్వంసాన్ని ఆపాలని కోరారు. ఆరు గ్యారంటీల్లో మొదటి ప్రాధాన్యత అంశంగా యువత, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మెగా డీఎస్సీతో పాటు 2 లక్షల ఖాళీలు భర్తీ చేయాలన్నారు. నిరుపేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలి : బీజేపీ ఎమ్మెల్యేలు

ఆరు గ్యారంటీలను అమలు చేయకపోతే అసెంబ్లీ వేదికగా పోరాటమే - బీజేపీ ఎమ్మెల్యేల హెచ్చరిక

ABOUT THE AUTHOR

...view details