తెలంగాణ

telangana

అమ్మ భాషలో బీటెక్‌ కోర్సులకు అనుమతి... సంప్రదాయ బ్రాంచ్​లకే.!

By

Published : Mar 11, 2021, 7:10 AM IST

ఇకపై మాతృభాషలోనే సాంకేతిక విద్య నేర్చుకునేందుకు మార్గం సుగమమైంది. భారతీయ భాషల్లో సాంకేతిక విద్య అందించాలన్న నూతన జాతీయ విద్యావిధానం-2020 కేంద్రం రూపొందించింది. అందుకు అనుగుణంగా సంప్రదాయ కోర్సులకే పరిమితం చేస్తూ వచ్చే ఏడాది తరగతులకు అనుమతులివ్వాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిర్ణయించింది.

B Tech courses can learn in your mother tongue from next year onwards all over the country declared by AICTE
అమ్మ భాషలో బీటెక్‌ కోర్సులకు అనుమతి... సంప్రదాయ బ్రాంచ్​లకే.!

భారతీయ భాషల్లో సాంకేతిక విద్యను అందించాలన్న నూతన జాతీయ విద్యా విధానం -2020 లక్ష్యానికి అనుగుణంగా వచ్చే కొత్త విద్యా సంవత్సరం(2021-22) నుంచే ఇంజినీరింగ్‌ కళాశాలలకు అనుమతి ఇవ్వాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) నిర్ణయించింది. అన్ని బ్రాంచీల్లో కాకుండా సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఈసీఈ, సీఎస్‌ఈ తదితర సంప్రదాయ ఇంజినీరింగ్‌ బ్రాంచీల్లో మాత్రమే మాతృ భాషలో బీటెక్‌ను బోధించేందుకు అనుమతులు ఇవ్వనుంది. అదీ కూడా నేషనల్‌ బోర్డు ఆఫ్‌ అక్రిడిటేషన్‌(ఎన్‌బీఏ) గుర్తింపు ఉన్న బ్రాంచీలకు మాత్రం అని నిబంధన విధించింది. ఏ బ్రాంచీకి ఎన్‌బీఏ ఉంటే అందులో ఒక సెక్షన్‌ ఇస్తారు. సాధారణంగా ఒక సెక్షన్‌ అంటే 60 సీట్లు కాగా.. సగం సెక్షన్‌ 30 సీట్లు కూడా ఇస్తారు. కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ, ఈసీఈని కూడా సంప్రదాయ బ్రాంచీగానే పరిగణిస్తారు. వచ్చే విద్యా సంవత్సరం(2021-22) వృత్తి విద్యా కళాశాలలకు అనుమతుల ప్రక్రియకు సంబంధించిన విధి విధానాలపై హ్యాండ్‌బుక్‌ను మంగళవారం విడుదల చేసిన ఏఐసీటీఈ కొత్త నిబంధనలపై అవగాహన పెంచేందుకు బుధవారం దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్‌, ఫార్మసీ, మేనేజ్‌మెంట్‌, పాలిటెక్నిక్‌ కళాశాలల యజమానులు, ఇతర ప్రతినిధులతో వర్చువల్‌ సమావేశం నిర్వహించింది. నిబంధనల్లో మార్పులు, చేర్పులపై అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు.

అనంతరం కళాశాలల ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఏఐసీటీఈ ఛైర్మన్‌ ఆచార్య సహస్రబుద్ధే సమాధానమిచ్చారు. సాధారణంగా ఏప్రిల్‌ 30వ తేదీ నాటికి అనుమతులు ఇవ్వాల్సి ఉన్నా.. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గతేడాది మాదిరిగానే ఈసారి కూడా జూన్‌ 30వ తేదీ నాటికి ఇస్తామని.. అందుకు సుప్రీంకోర్టు అనుమతి తీసుకుంటామన్నారు. పీజీ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌(పీజీడీఎం) కోర్సును అందించే విద్యాసంస్థలకు ఆయా రాష్ట్ర విద్యాశాఖలు, విశ్వవిద్యాలయాలతో సంబంధం లేదని, ఏఐసీటీఈ అనుమతితోనే నడుస్తాయని చెప్పారు. అవి భవిష్యత్తులో మూతపడితే అందులో చదివిన విద్యార్థుల వివరాలు ఉండవని, అందుకే ఈనెలాఖరు నాటికి గత రెండేళ్ల నుంచి వివరాలు తమకు పంపించాలని ఆదేశించారు. లేకుంటే ఈసారి వాటికి అనుమతులు ఇచ్చేది లేదని ఆయన తేల్చిచెప్పారు. గత నాలుగేళ్లుగా చెబుతున్నా వివరాలను పంపడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఇవీ కొత్త నిబంధనలు...

* ఎమర్జింగ్‌ ఏరియాల్లో మైనర్‌/ఆనర్స్‌ డిగ్రీ పేరిట ఇచ్చేందుకు పలు రకాల కోర్సులను ప్రవేశపెడుతున్నారు. దానివల్ల మెకానికల్‌ విద్యార్థి మైనర్‌ సబ్జెక్టుగా కృత్రిమ మేధను చదువుకొని క్రెడిట్లు పొందొచ్చు. అయితే వాటికి ఆయా వర్సిటీల నుంచి ఎన్‌వోసీ అవసరం.

* కళాశాలలో మంజూరు సీట్ల కంటే అధికంగా భవనాలు, ఇతర వసతులు ఉంటే మేనేజ్‌మెంట్‌, ఎంసీఏ, ఆర్కిటెక్చర్‌, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, డిగ్రీ తదితర ఏ కోర్సులనైనా నిర్వహించుకోవచ్చు. ఆయా నియంత్రణ సంస్థల నుంచి అనుమతి పొందటం తప్పనిసరి. ఆ కోర్సులను కొత్తగా ప్రవేశపెట్టేందుకు ఎన్‌బీఏ అవసరం లేదు.

* అధ్యాపకులకు సమస్యలు ఉంటే మొదట వారు పనిచేసే కళాశాల, ఆ తర్వాత విశ్వవిద్యాలయంలో ఫిర్యాదు చేయాలి. పరిష్కారం కాకుంటేనే ఏఐసీటీఈకి ఫిర్యాదు చేయాలి. ఆయా స్థాయిలో గ్రీవెన్స్‌ రెడ్రెసెల్‌ విభాగాలను వారు ఆశ్రయించాలి.

* కొత్తగా ఏర్పాటు చేసే కళాశాలల్లో 300 సీట్లకు మాత్రమే అనుమతి ఇస్తారు. గరిష్ఠంగా ఒక బ్రాంచీలో మూడు సెక్షన్లు...అంటే 180 సీట్లకే అనుమతి ఇస్తారు. ప్రస్తుతం ఉన్న కళాశాలల్లో ఎక్కువగా సీట్లుండీ తనిఖీల్లో సీట్లకు అనుగుణంగా వసతులు లేకుంటే వాటిని తగ్గిస్తారు.

* బీటెక్‌ ప్రథమ సంవత్సరంతోపాటు రెండో సంవత్సరంలో లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాల తర్వాత రెండింటి సగటు తీసుకొని 50 శాతం సీట్లు నిండిన కళాశాలల్లోనే కొత్త కోర్సులకు అనుమతి ఇస్తారు.

ఇదీ చూడండి:వైభవంగా శివరాత్రి.. శైవాలయాల్లో భక్తుల సందడి

ABOUT THE AUTHOR

...view details