తెలంగాణ

telangana

దక్షిణాదిపై ఆప్ దృష్టి.. ఆరోజే తెలంగాణలో కేజ్రీవాల్‌ పాదయాత్ర

By

Published : Mar 18, 2022, 12:29 PM IST

Updated : Mar 18, 2022, 2:22 PM IST

Kejriwal Padayatra in telangana: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ అఖండ విజయ ఉత్సాహంతో... దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ చేయనున్నారు. ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని ఆప్​ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తెలంగాణలో పాదయాత్రను ప్రారంభించనున్నారు.

Kejriwal
ఆరోజు నుంచే తెలంగాణలో కేజ్రీవాల్‌ పాదయాత్ర

Kejriwal Padayatra in telangana: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి మంచి ఉత్సాహంగా ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ.. ఇప్పుడు ఇతర రాష్ట్రాలపై దృష్టిపెట్టింది. ఈ ఏడాది చివర్లో జరిగే గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే సమాయత్తమవుతోంది. ఇదే సమయంలో దక్షిణాదిలోనూ పార్టీని విస్తరించాలని భావిస్తోంది. త్వరలోనే ఆ పార్టీ జాతీయ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలంగాణను వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

వచ్చే నెలలో కేజ్రీవాల్‌ హైదరాబాద్‌కు రానున్నట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని పాదయాత్ర ప్రారంభించనున్నట్లు పేర్కొన్నాయి. ఈ పాదయాత్రను ఆప్​ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించనున్నారు. అంబేడ్కర్, భగత్ సింగ్ స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర కొనసాగనుంది. ఉచిత విద్య, వైద్యం ఇవ్వాలనే డిమాండ్‌తో పాదయాత్రను నిర్వహించనున్నారు. ఈనెల చివరి వారంలో ఈ విషయంపై ఆప్‌ నేతలు భేటీకానున్నారు. పాదయాత్రకు సంబంధించి రూట్‌మ్యాప్‌ ఖరారు చేయనున్నారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆమ్‌ ఆద్మీ పాదయాత్రలు చేపట్టనున్నారు.

తెలంగాణలో వచ్చే ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలతోనే ఆమ్‌ ఆద్మీ పార్టీ దక్షిణాదిలో పాగా వేయాలని ప్రయత్నిస్తోంది. ఆప్‌ తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా సోమనాథ్‌ భారతిని నియమించారు. త్వరలోనే ఆయన రాష్ట్రానికి వచ్చి పాదయాత్ర ఏర్పాట్లు చూడనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

ఇటీవల జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో 92 చోట్ల జయకేతనం ఎగురవేసింది. భగవంత్‌ మాన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

ఇదీ చూడండి: పంజాబ్​లో 'ఆప్' మార్క్.. వారికి భద్రత కట్.. ప్రజాసేవకు వందలాది పోలీసులు!

Last Updated : Mar 18, 2022, 2:22 PM IST

ABOUT THE AUTHOR

...view details