తెలంగాణ

telangana

పద్ధతి మార్చుకోకుంటే శిక్ష తప్పదు.. భద్రాచలం వైద్యులకు మావోయిస్టుల వార్నింగ్

By

Published : Jan 16, 2023, 2:29 PM IST

Updated : Jan 16, 2023, 5:24 PM IST

Maoist's letter: భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ కార్యదర్శి పేరుతో మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. మెడికల్ మాఫియాగా భద్రాచలం ఆస్పత్రులు మారాయని, రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఆసుపత్రుల్లో వైద్యులు డబ్బులు పోగు చేసుకుంటున్నారని లేఖ లో మావోయిస్టులు పేర్కొన్నారు. పద్ధతి మార్చుకోకపోతే మూల్యం చెల్లించక తప్పదని లేఖలో రాశారు.

Maoist's letter
Maoist's letter

Maoist's letter: భద్రాచలం జిల్లాలో వైద్యులు తమ పద్ధతి మార్చుకోవాలని మావోయిస్టులు హెచ్చరించారు. మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన భద్రాచలం ఇప్పుడు మెడికల్ మాఫియాకు కాసులు కురిపిస్తోందనీ, పూర్తి ఏజెన్సీ ప్రాంతం కావడంతో గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని సంపాదనే ధ్యేయంగా ఆసుపత్రులు పనిచేస్తున్నాయని ఆరోపిస్తూ ఓ లేఖ విడుదల చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని బూచిగా చూపి వారిని భయభ్రాంతులకు గురిచేసి రోగుల రక్తం పిండుకుంటున్నారనీ, ఛత్తీస్​ఘడ్​, ఒడిశా, ఆంధ్ర ప్రాంత గిరిజనులు, గిరిజనేతరులతో పాటు స్థానిక తెలంగాణ ప్రాంత ప్రజలను వైద్యం పేరుతో రోజుల తరబడి ఆసుపత్రుల్లో ఉంచి అవసరం లేకున్నా రకరకాల పరీక్షలు చేస్తూ ల్యాబులు, ఆసుపత్రులు, వైద్యులు.. ప్రజలను డబ్బుల కోసం హింసిస్తున్నారని రాశారు.

CPI Maoist's letter

ప్రజల ప్రాణాలు ఇప్పడు ఆసుపత్రులకు డబ్బులు కురిపించే అవకాశాలుగా మారాయని, ప్రజల నమ్మకానికి తూట్లు పొడుస్తూ కొందరు వైద్యులు రాక్షసుల్లా తయారై.. రోగుల రక్తాన్ని జలగల్లా పీల్చుతున్నారనీ మండిపడ్డారు. ఆరోగ్య సమస్యలను అలుసుగా చేసుకుని.. మనిషిలో రకరకాల పరీక్షల పేర్లతో భయాన్ని సృష్టిస్తూ ఆసుపత్రి గల్లలను కొల్లలుగా నింపుకుంటున్నారనీ, ప్రైవేటు ఆసుపత్రి మొదలుకొని ప్రభుత్వ ఆసుపత్రి వరకు కాసుల కక్కుర్తి మరిగిన వైద్యులు జనాలను పీడించుకుతింటున్నారనీ అన్నారు.

ముఖ్యంగా భద్రాచలం ప్రభుత్వ వైద్యశాలలో పని చేసే వైద్యులు సైతం తమ సొంత క్లీనిక్​లకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తు ప్రభుత్వ సమయానికి రోగికి అందించాల్సిన వైద్యాన్ని నిర్లక్ష్యం చేయడంతో పాటు పనివేళలను విస్మరిస్తున్నారని.. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల్లో లేనిపోని అబద్దపు అపోహలతో భయాన్ని పెంచి తమ సొంత క్లీనిక్స్​కు తరలించుకుంటున్నారని విమర్శించారు. ప్రధానంగా మెడికల్ మాఫియాగా మారిన వైద్య వృత్తి ఫార్మా కంపెనీలతో జతకడుతూ తక్కువ ధరకు అమ్మాల్సిన మందులను బ్రాండుల పేర్లతో ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు వారి సమయాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేటాయించకుండా ఇలానే ప్రవర్తిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనీ, గిరిజన ప్రాంతమైన భద్రాచలం ప్రాంతంలో సంపాదనే ధ్యేయంగా ప్రైవేటు ఆసుపత్రులను ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో నివసించే గిరిజనుల అమాయకత్వాన్ని అసరా చేసుకొని కోట్లకు పడగెత్తిన వైద్యులు, ల్యాబ్, మెడికల్ షాప్​ల యజమానులు తమ పద్ధతి మార్చుకోక పోతే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని అన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 16, 2023, 5:24 PM IST

ABOUT THE AUTHOR

...view details