తెలంగాణ

telangana

RIMS Super Speciality Hospital: నిధులు, సదుపాయాలు మెండు.. కానీ వైద్య నిపుణులే కరవు.!

By

Published : Oct 13, 2021, 4:58 PM IST

అద్భుతమైన భవన సముదాయం, ఆత్యాధునిక పరికరాలు, ఆహ్లాదాన్ని పంచే పరిసరాలు ఇవన్నీ ఉన్నా... ఆదిలాబాద్‌ రిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ(RIMS Super Speciality Hospital) ఆస్పత్రి ప్రారంభం ఎప్పుడనేది మాత్రం సందిగ్ధంగానే ఉంది. పేదలకు అత్యాధునిక వైద్యసేవలు ఎప్పుడు అందుతాయనేది.. ప్రశ్నార్థకంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో చేపట్టిన ఆదిలాబాద్‌ రిమ్స్‌ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి పనితీరుపై ఈనాడు- ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

RIMS Super Speciality Hospital
సందిగ్ధంలో రిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం

సందిగ్ధంలో రిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం

మారుమూల గ్రామాల్లో ఉన్న పేదల ఆరోగ్యాలకు భరోసా ఇవ్వాలనే లక్ష్యంతో ఆదిలాబాద్‌లోని... రిమ్స్‌ వైద్యకాళాశాలకు అనుబంధంగా కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట సూపర్‌స్పెషాలిటీ(RIMS Super Speciality Hospital) ఆస్పత్రిని మంజూరు చేసింది. ప్రధానమంత్రి స్వస్థ స్వరక్షయోజనలో భాగంగా రూ. 150 కోట్ల నిధులతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో(RIMS Super Speciality Hospital)... కేంద్ర ప్రభుత్వం వాటా రూ. 120 కోట్లయితే... రాష్ట్ర ప్రభుత్వ వాటా 30కోట్లు. ఇందులో రూ. 70 కోట్లతో ఆధునికమైన వైద్య పరికరాలు కొనాల్సి ఉంటే.. మిగిలిన రూ. 80 కోట్లతో భవన సముదాయాన్ని నిర్మించాలనేది నిబంధన. 2016 మేలో టెండర్‌ ప్రక్రియ పూర్తయిన నాటి నుంచి.. 18 నెలల వ్యవధిలో 2018 జనవరిలో పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఇప్పటికి 90 శాతమే పూర్తయింది.

సదుపాయాలివే..

5 అంతస్థుల భవన సముదాయంలో.. న్యూరాలజీ, న్యూరో సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రాలజీ, పిడియాట్రిక్‌ సర్జరీ, కార్డియాలజీ, కార్టియాలజీ వ్యాస్కులర్‌ సర్జరీ విభాగాలతో పనిచేయాల్సి ఉంది. మొత్తం 220 పడకల్లో 42 ఐసీయూ పడకలు, 9 అత్యవసర విభాగాలు, మరో ల్యాబొరేటరీగా ఉంచాలనేది ప్రణాళికలోని అంశాలు. ప్రతి విభాగానికి ఆపరేషన్‌ థియేటర్‌, ఐసీయూ, ప్రత్యేక రక్తనిధి కేంద్రం, అత్యాధునిక వైద్యపరికరాలను అందుబాటులో ఉంచాలనేది... ఈ ప్రాజెక్టు(RIMS Super Speciality Hospital) ప్రధాన లక్ష్యం.

రూ. 150కోట్లతో ఇంత పెద్ద ప్రాజెక్టును చేపట్టారు. అత్యాధునిక హంగులతో ఆస్పత్రి రూపుదిద్దుకుంటోంది. కానీ వైద్యుల నియామకం, ప్రజల ఆరోగ్యం కోసం ఆస్పత్రిని తొందరగా ప్రారంభించాలనే యోచనలో మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేవు. ఫలితంగా రోగులు తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్​, నాగ్​పూర్​ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. మరికొంత మంది అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందకపోవడంతో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. -స్థానికులు, ఆదిలాబాద్​

వైద్య నిపుణుల అనాసక్తి

సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి(RIMS Super Speciality Hospital) అంటే ప్లాస్టిక్‌ సర్జరీ విభాగం ఉండాలని తొలుత అనుకున్నప్పటికీ స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని దాని స్థానంలో పిల్లల విభాగాన్ని చేర్చింది. ఇప్పటికీ వైద్యులు, వైద్యసిబ్బంది నియామక ప్రక్రియ పూర్తికాలేదు. ఒప్పంద ప్రాతిపదికనే భర్తీ చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉండటంతో.. ప్రత్యేక వైద్యనిపుణులు ఆదిలాబాద్‌ రావడానికి ఆసక్తి చూపించడం లేదు. ఫలితంగా ఇక్కడ సరైన వైద్యసౌకర్యాలు ఒనగూరక.. చిన్నచిన్న రోగాలకు హైదరాబాద్‌, మహారాష్ట్రలోని నాగపూర్‌లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందనే స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

దేశ వ్యాప్తంగా వైద్య నిపుణులు తక్కువగా ఉన్నారు. అందువల్లే వారికి రావడానికి కుదరడం లేదు. దూరాభారం ఎక్కువ. ప్రభుత్వం ప్రోత్సాహకాలు, ప్రమోషన్లు లాంటివి వారికి కల్పిస్తే వైద్యులు ఇక్కడికి వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. -కరుణాకర్​, రిమ్స్​ డైరెక్టర్​

నిధులిచ్చారు కానీ..

సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే.... స్థానికులకు ఉచితంగానే హైదరాబాద్‌లోని కార్పొరేట్‌(RIMS Super Speciality Hospital) తరహా వైద్యసేవలు పొందడానికి అవకాశం ఉంది. ప్రత్యేక వైద్యనిపుణులు రావడానికి ఆసక్తి చూపడం లేదనే అభిప్రాయం అధికారుల్లో సైతం వ్యక్తం అవుతోంది. రూ. 150కోట్ల రూపాయల నిధులను కేటాయించడానికి ఆసక్తి చూపిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు... ఆస్పత్రికి ప్రారంభానికి ఎదురవుతున్న అవరోధాలను గుర్తించకపోవడం అనిశ్ఛితికి దారితీస్తోంది.

ఇదీ చదవండి:KTR: తెరాస అధ్యక్షుడి ఎన్నికకు షెడ్యూల్.. కేటీఆర్ ఏమన్నారంటే...

ABOUT THE AUTHOR

...view details