తెలంగాణ

telangana

ఉమ్మడి ఆదిలాబాద్​లో ఈనెల 19 నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం

By

Published : Oct 16, 2020, 1:51 PM IST

పత్తి ప్రధాన పంటగా సాగయ్యే ఆదిలాబాద్‌ జిల్లాలో కొనుగోళ్లకు ముహుర్తం ఖరారైంది. ఈనెల 19 నుంచి పత్తి కొనుగోళ్లు చేపట్టాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. ఈ నేపథ్యంలో తేమ నమోదుపై రైతుల్లో అప్పుడే ఆందోళన మొదలైంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నిబంధనలు సవరించాలనే డిమాండ్‌ రైతుల నుంచి వినిపిస్తోంది.

cotton-purchases-will-start-from-the-19th-of-this-month-in-the-joint-adilabad-district
ఉమ్మడి ఆదిలాబాద్​లో ఈనెల 19 నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అంటేనే పత్తి పంట సాగుకు పెట్టింది పేరు. ఇక్కడ పండించే పత్తికి మార్కెట్​లో మంచి డిమాండ్​ ఉండటం వల్ల రైతులూ ఇదే పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఈసారి ప్రభుత్వం తాము నిర్దేశించిన పంటలనే సాగు చేయాలని ఆదేశించడం ఇక్కడి రైతులను కొంత ఆందోళనకు గురిచేసినా.. అనుకూలమైన పత్తి పంటనే సాగు చేయాలని జిల్లాకు కేటాయించడం ఆ ఆందోళనను దూరం చేసింది. ప్రభుత్వ సూచనల మేరకు రైతులు పత్తి పంట వైపు మొగ్గు చూపారు. గతంలో పత్తి వేసి ఇతర పంటలు సాగు చేసిన వారు సైతం ఈసారి మళ్లీ పత్తి పంటను వేయడంతో సాగు విస్తీర్ణం 75 వేల ఎకరాలకు పెరిగింది.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఈసారి 11 లక్షల 21 వేల 296 ఎకరాల్లో పత్తి సాగు కాగా.. అందులో ఆదిలాబాద్‌లో 4,27,000 ఎకరాల్లో, మంచిర్యాల జిల్లాలో 1,90,096 ఎకరాల్లో, నిర్మల్‌లో 1,67,200 ఎకరాల్లో, కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 3,37,000 ఎకరాల్లో పత్తి సాగైంది. ప్రస్తుతం పత్తి ఇంటికి చేరుతోంది. ఒక్కో రైతు ఇంట్లో 5-20 క్వింటాళ్ల మేర పత్తి నిల్వలు ఉన్నాయి.

తేమ నిబంధనలు సడలించాలి..

ఈ క్రమంలోనే మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో జరిగిన సమావేశంలో పత్తి కొనుగోళ్లకు ముహుర్తం ఖరారు చేశారు. ఈనెల 19 నుంచి పత్తి కొనుగోళ్లను ప్రారంభించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొనుగోళ్ల సమయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా.. మద్దతు ధరకు కొనుగోలు చేస్తేనే తమకు మేలు జరుగుతుందని రైతులు వేడుకుంటున్నారు. తేమ నిబంధనలు సడలించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపాలని కోరుతున్నారు.

ముందుగానే ఆరబెట్టుకుంటున్నారు..

పత్తి ఇంటికి వచ్చే ప్రస్తుత తరుణంలో ఎడతెరిపి లేని వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరోవైపు గత సంవత్సరం కొనుగోళ్లలో ఎదురైన ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా రైతులు పత్తిని ఆరబెడుతున్నారు. నిబంధనల మేరకు 8-12శాతం లోపు తేమ శాతం నమోదైతేనే పత్తిని సీసీఐ కొనుగోలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే రైతులు ముందుగా జాగ్రత్త పడుతున్నారు. ఇంటికి తెచ్చిన పత్తిని ఎండకు ఆరబెట్టుకుంటున్నారు. అయినప్పటికీ తేమ విషయంలో ఎక్కడ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని ఆవేదన చెందుతున్నారు.

ఇదీ చూడండి.. దుబ్బాక పోరు: భాజపా నేతల తీరుపై మంత్రి హరీశ్​రావు ఫైర్​

ABOUT THE AUTHOR

...view details