తెలంగాణ

telangana

AUS VS NZ FINAL: అంచనాల్లేకుండా వచ్చి అద్భుతం చేసిన కివీస్!

By

Published : Nov 14, 2021, 4:27 PM IST

టీ20 ప్రపంచకప్ ఫైనల్​లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి ఆస్ట్రేలియా-న్యూజిలాండ్. ఎంతో ఒత్తిడి తట్టుకుని, ప్రత్యర్థి జట్లపై పైచేయి సాధించి తుదిపోరు వరకూ వచ్చాయి ఈ రెండు జట్లు. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో కివీస్ ప్రయాణం ఎలా సాగిందో గుర్తుచేసుకుందాం.

New Zealand
కివీస్

మైదానంలో ప్రశాంతంగా ఉంటూ ప్రత్యర్థి జట్టుని సరైన సమయంలో దెబ్బకొట్టడంలో న్యూజిలాండ్ దిట్ట. అయితే, 2019 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఆ జట్టు సర్వశక్తులు ఒడ్డినా.. ఛాంపియన్‌గా నిలవలేకపోయింది. ఇంగ్లాండ్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఈ క్రమంలో ఆ జట్టు మరింత రాటుదేలింది. 2021 టెస్టు ఛాంపియన్ షిప్ టైటిల్‌ గెల్చుకుంది. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో ఓటమికి కివీస్‌ ఈ టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో ప్రతీకారం తీర్చుకుంది. సెమీస్‌లో ఇంగ్లీష్ జట్టును ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇదే కసితో ఆడితే ఆస్ట్రేలియాను ఓడించి కప్‌ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఈ పొట్టి ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరడానికి న్యూజిలాండ్‌ జట్టు ప్రయాణం ఎలా సాగిందో ఓ లుక్కేద్దామా?

పాక్‌ చేతిలో ఓటమి..

ఈ టీ20 ప్రపంచకప్‌లో కివీస్‌ తన మొదటి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌.. పాక్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడం వల్ల నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 138 పరుగుల నామమాత్రపు స్కోరు చేసింది. ఈ లక్ష్యాన్ని పాకిస్థాన్‌ 18.4 ఓవర్లలో ఛేదించింది. దీంతో తొలి మ్యాచ్‌లోనే కివీస్‌కు ఎదురుదెబ్బ తగిలింది.

న్యూజిలాండ్

భారత్‌ను దెబ్బకొట్టి..

న్యూజిలాండ్ తన రెండో మ్యాచ్‌లో బలమైన టీమ్ఇండియాను ఢీకొట్టింది. పాకిస్థాన్‌ చేతిలో ఓడిన కసిమీదున్న కివీస్ ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లకు చుక్కలు చూపించింది. ఆ జట్టు బౌలర్ల ధాటికి భారత ఆటగాళ్లలో ఒక్కరూ 30 పరుగుల మార్కును దాటలేకపోయారు. విరాట్‌ సేనను 110 పరుగులకే కట్టడి చేసిన విలియయ్సన్‌ బృందం ఆ స్వల్ప లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి 14.3 ఓవర్లలోనే ఛేదించేసింది.

స్కాట్లాండ్‌ను మట్టికరిపించి..

భారత్‌పై విజయం సాధించిన ఉత్సాహాంతో తన మూడో మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ను కంగు తినిపించింది న్యూజిలాండ్‌. ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్‌ (93; 56 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లు) చెలరేగడం వల్ల తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. తర్వాత స్కాట్లాండ్‌ను 156 పరుగులకే కట్టడి చేసి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.

న్యూజిలాండ్

హ్యాట్రిక్​ గెలుపు..

భారత్‌, స్కాట్లాండ్‌లపై విజయం సాధించి జోరుమీదున్న న్యూజిలాండ్‌ తన నాలుగో మ్యాచ్‌లో పసికూన అయిన నమీబియాతో తలపడింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ నాలుగు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. టాప్‌ ఆర్డర్‌ ఆటగాళ్లు తక్కువ స్కోరుకే ఔటైనా మిడిల్‌ ఆర్డర్ బ్యాటర్లు గ్లెన్ ఫిలిప్స్‌ (39), జిమ్మీ నీషమ్‌ (35) రాణించడంతో మంచి స్కోరును సాధించింది. ఛేదనకు దిగిన నమీబియాను 111/7కు కట్టడి చేసిన కివీస్‌.. 52 పరుగుల తేడాతో నెగ్గి హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది.

అఫ్గాన్​తో గట్టిపోటీ..

నమీబియాపై అలవోకగా విజయం సాధించిన కివీస్‌.. అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం చెమటోడ్చి నెగ్గింది. తొలుత అఫ్గాన్‌ని 124 పరుగులకే కట్టడి చేసింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్ ఆరంభం నుంచి నెమ్మదిగా ఆడింది. చివరకు 18.1 ఓవర్లలో ఈ లక్ష్యాన్ని అందుకుని అఫ్గాన్‌పై గెలిచింది. ఒకవేళ అఫ్గానిస్థాన్‌ మరో 30-40 పరుగులు చేసుంటే కివీస్‌కు మ్యాచ్‌ గెలవడం కష్టంగా మారేది.

న్యూజిలాండ్

ఇంగ్లాండ్​పై ప్రతీకారం.. ఫైనల్ ఎంట్రీ

తొలి మ్యాచ్‌లో ఓడినా.. ఆ తర్వాత పుంజుకుని వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో నెగ్గి సెమీస్‌కు దూసుకొచ్చిన న్యూజిలాండ్‌.. బలమైన ఇంగ్లాండ్‌ జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లీష్‌ జట్టు.. నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన విలియమ్సన్‌ సేనకు ఆరంభంలోనే షాక్ తగిలింది. మార్టిన్‌ గప్తిల్, విలియమ్సన్ వికెట్లను మూడు ఓవర్లలోపే కోల్పోయి కష్టాల్లో పడింది. డారిల్‌ మిచెల్ (72), జిమ్మీ నీషమ్‌ (27; 11 బంతుల్లో) సంచలన ఇన్నింగ్స్‌ ఆడటం వల్ల ఒక ఓవర్‌ మిగిలుండగానే విజయాన్ని అందుకుంది. 2016 టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌, 2019 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో పరాజయం పాలైన కివీస్‌.. ఈ విజయంతో ఆ ఓటములకు ప్రతీకారం తీర్చుకుని ఫైనల్లోకి అడుగుపెట్టింది.

కంగారూలను కంగారు పెట్టిస్తుందా?

పాకిస్థాన్‌ను ఓడించి ఫైనల్‌కు చేరిన ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ తలపడనుంది. రెండు జట్ల బలబలాలు, నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఇరు జట్ల ఫలితాలను బట్టి చూస్తే ఆస్ట్రేలియానే ఫేవరేట్‌గా కనిపిస్తోంది. కంగారూలకు ఏ మాత్రం అవకాశం ఇచ్చినా చెలరేగిపోతారు. పాకిస్థాన్‌తో జరిగిన సెమీస్‌లో ఇదే రిపీట్ అయింది. వేడ్ (41) ఇచ్చిన క్యాచ్‌ని హసన్‌ అలీ జారవిడిచాడు. ఆ వెంటనే అతడు మూడు సిక్స్‌లు కొట్టి పాక్‌ ఫైనల్ ఆశలపై నీళ్లు చల్లాడు. ట్రెంట్ బౌల్ట్‌, టిమ్‌ సౌథీ పేస్‌ ద్వయం, స్పిన్నర్లు శాంటర్న్‌, సోధీ చెలరేగితే కంగారులకు తిప్పలు తప్పవు. ఏది ఏమైనా ఇందులో ఏ జట్టు గెలిచినా కొత్త ఛాంపియన్‌గా అవతరిస్తుంది.

ఇవీ చూడండి: AUS vs NZ Final: మ్యాచ్​ను మలుపుతిప్పే సమర్థులు వీరు!

ABOUT THE AUTHOR

...view details