తెలంగాణ

telangana

Tokyo Paralympics: షూటింగ్​లో భారత్​కు స్వర్ణం, రజతం

By

Published : Sep 4, 2021, 9:16 AM IST

Updated : Sep 4, 2021, 10:23 AM IST

tokyo Paralympics
టోక్యో

09:13 September 04

పారాలింపిక్స్‌లో భారత షూటర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే అవనీ లేఖరా ఒక స్వర్ణం, ఒక కాంస్యం కైవసం చేసుకొంది. తాజాగా మనీశ్‌ నర్వాల్‌ పసిడిని ముద్దాడగా సింఘ్‌రాజ్‌ అదానా రజతం అందుకున్నాడు. ప్రపంచకప్పుల్లో స్వర్ణాలు గెలిచి ఒలింపిక్స్‌లో సాధారణ షూటర్లు చేయలేనిది పారా షూటర్లు చేసి చూపిస్తున్నారు.

పీ1 పురుషుల మిక్స్​డ్ 50 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఎస్‌హెచ్‌1 పోటీల్లో భారత్‌కు రెండు అత్యుత్తమ పతకాలు రావడం ప్రత్యేకం. 19 ఏళ్ల నర్వాల్‌ 218.2 స్కోరుతో పారాలింపిక్స్‌ రికార్డు సృష్టించి స్వర్ణం అందుకున్నాడు. ఇక అదానా 216.7 స్కోరుతో వెండి పతకం మెడలో వేసుకున్నాడు. రష్యా ఒలింపిక్‌ కమిటీ ఆటగాడు సెర్గీ మలెషెవ్‌ 196.8తో కాంస్యం గెలిచాడు. ఈ మెగాటోర్నీలో అదానాకు ఇది రెండో పతకం. ఇప్పటికే అతడు 10మీ ఎయిర్​ పిస్టోల్​లో కాంస్యం దక్కించుకున్నాడు.

అంతకు ముందు జరిగిన అర్హత పోటీల్లో అదానా 536 స్కోరుతో నాలుగో స్థానంలో నిలిచాడు. నర్వాల్‌ 533తో ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌ చేరుకున్నాడు. తుది పోరులో మాత్రం నర్వాల్‌ దుమ్మురేపాడు. మరో ఆటగాడు ఆకాశ్‌ 27వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించలేదు.

ఎస్‌హెచ్‌1 పోటీల్లో ఒక కాలు, ఒక చేతి లేదా రెండు అవయవాల్లో వైకల్యం ఉన్నవారు పోటీపడతారు. అంటే కూర్చొని లేదా నిలబడి ఒకే చేత్తో పిస్టల్‌ పట్టుకొని షూట్‌ చేస్తారు. కాగా పీ4లో పోటీపడ్డవారు మిక్స్‌డ్‌ 50 మీటర్ల ఎయిర్‌పిస్టల్‌ పోటీల్లోనూ తలపడతారు.

ప్రధాని ప్రశంసలు

టోక్యో పారాలింపిక్స్​లో స్వర్ణం, రజతం గెలిచిన మనీష్, సింగ్​రాజ్​లపై ప్రశంసల వర్షం కురిపించారు ప్రధాని మోదీ. వీరిద్దరూ దేశానికి వన్నె తీసుకొచ్చారని కొనియాడారు. భవిష్యత్​లో వీరు మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.

భారీ నజరానా

షూటింగ్​లో పతకాలు గెలిచిన మనీష్, సింఘ్​రాజ్​లపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే నజరానాలు ప్రకటిస్తున్నారు. తాజాగా హరియాణా ప్రభుత్వం వీరిద్దరికీ భారీ నగదు ప్రోత్సాహం ప్రకటించింది. స్వర్ణం గెలిచిన మనీష్​కు రూ.6 కోట్లు, రజతంతో మెరిసిన అదానాకు రూ.4 కోట్లతో పాటు ఇరువురికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ఆ రాష్ట్రం స్పష్టం చేసింది. 

Last Updated : Sep 4, 2021, 10:23 AM IST

ABOUT THE AUTHOR

...view details