తెలంగాణ

telangana

'క్షమించు సింధు'.. బ్యాడ్మింటన్‌ ఆసియా టెక్నికల్‌ కమిటీ లేఖ!

By

Published : Jul 5, 2022, 10:11 PM IST

బ్యాడ్మింటన్‌ ఆసియా టెక్నికల్‌ కమిటీ భారత స్టార్ షట్లర్‌ పీవీ సింధుకు క్షమాపణలు తెలిపింది. ఇటీవల బ్యాడ్మింటన్‌ ఆసియా ఛాంపియన్‌షిప్‌ టోర్నీలో జరిగిన పొరపాటుపై స్పందిస్తూ.. టెక్నికల్‌ కమిటీ ఛైర్మన్‌ చిహ్‌ షెన్‌ చెన్‌.. సింధుకు లేఖ రాశారు.

Badminton Asia Technical Committee apologises to Sindhu for 'human error'
బ్యాడ్మింటన్‌ ఆసియా టెక్నికల్‌ కమిటీ

రిఫరీ పొరబాటు కారణంగా ఇటీవల బ్యాడ్మింటన్‌ ఆసియా ఛాంపియన్‌షిప్‌ టోర్నీలో భారత స్టార్ షట్లర్‌, ఒలింపిక్‌ విజేత పీవీ సింధూ ఓటమిపాలవ్వాల్సి వచ్చింది. ఈ ఘటనపై తాజాగా స్పందించిన బ్యాడ్మింటన్‌ ఆసియా టెక్నికల్‌ కమిటీ ఛైర్మన్‌ చిహ్‌ షెన్‌ చెన్‌.. ఆ 'మానవ తప్పిదానికి' సింధూకు క్షమాపణలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పొరబాట్లు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు సింధూకు కమిటీ ఛైర్మన్‌ లేఖ రాశారు.

''ఆసియా ఛాంపియన్‌షిప్‌లో మీకు కలిగిన అసౌకర్యానికి మేం క్షమాపణలు తెలియజేస్తున్నాం. దురదృష్టవశాత్తూ ఇప్పుడు ఆ పొరబాటును సరిదిద్దే అవకాశం లేదు. అయితే భవిష్యత్తులో ఇలాంటి మానవ తప్పిదాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటాం. ఆటల్లో ఇదంతా ఓ భాగమే అని, దాన్ని మీరు అంగీకరిస్తాని విశ్వసిస్తున్నాం'' అని కమిటీ ఛైర్మన్‌ లేఖలో పేర్కొన్నారు.

ఇదీ వివాదం..

ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్‌ మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్‌లో టాప్‌సీడ్‌ అకానె యమగూచి చేతిలో సింధు ఓటమిపాలై కాంస్య పతకంతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌ మధ్యలో రిఫరీ తీసుకున్న ఓ తప్పుడు నిర్ణయం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. తొలి గేమ్‌ను సొంతం చేసుకున్న సింధు రెండో గేమ్‌లో 14-11తో ఆధిపత్యంలో దూసుకుపోతుండగా.. మ్యాచ్‌ రిఫరీ యమగూచికి ఒక పాయింట్‌ కేటాయించాడు. సింధూ సర్వీస్‌ చేసేటప్పుడు ఎక్కువ సమయం తీసుకుందన్న కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడు. అనంతరం స్కోర్‌ 14-12గా మారడంతో సింధూ రిఫరీతో మాట్లాడింది. యమగూచి సిద్ధంగా లేనందునే తాను సమయం తీసుకున్నానని వివరించే ప్రయత్నం చేసింది. అయినా రిఫరీ వినిపించుకోకుండా యమగూచికి పాయింట్‌ కేటాయించాడు. ఆ పాయింట్‌ తర్వాత యమగూచి మ్యాచ్‌పై పట్టుసాధించి చివరకు 19-21 తేడాతో రెండో గేమ్‌ను సొంతం చేసుకుంది. మూడో గేమ్‌ కూడా 16-21 తేడాతో చేజారడంతో సింధూ ఓటమిపాలైంది.

ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్‌ అనంతరం సింధూ ఈ విషయంపై మాట్లాడుతూ.. '''సర్వీస్‌ చేసేటప్పుడు ఎక్కువ సమయం తీసుకుంటున్నావని రిఫరీ నాతో అన్నాడు. అయితే నేను సర్వీస్‌ చేసే సమయానికి ప్రత్యర్థి సిద్ధంగా లేదు. కానీ, రిఫరీ నా మాటలు పట్టించుకోకుండా యమగూచికి పాయింట్‌ ఇచ్చాడు. ఇది అన్యాయం. సెమీఫైనల్లో ఓటమికి ఇదో కారణం. రెండో గేమ్‌లో 14-11తో ఆధిక్యంలో ఉన్న సమయంలో ఇది జరిగింది. లేదంటే నేను అదే జోరులో 15-11తో విజయానికి చేరువయ్యేదాన్ని. అనవసరంగా ఒక పాయింట్‌ కోల్పోవడంతో స్కోరు 14-12గా మారింది. ఆమెకు రిఫరీ ఇచ్చిన పాయింట్‌ న్యాయమైంది కాదు. ఈ మ్యాచ్‌లో నేను గెలిచి ఫైనల్‌కు వెళ్లాల్సింది. ఈ విషయంపై చీఫ్‌ రిఫరీకి కూడా ఫిర్యాదు చేశా. కానీ, అప్పటికే రిఫరీ పాయింట్‌ ఇచ్చేశాడు కదా అని బదులిచ్చాడు. ఒక చీఫ్‌ రిఫరీగా అతడు కనీసం ఎక్కడ తప్పు జరిగిందో పరిశీలించాల్సింది' అని సింధూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై సింధూ.. ఆసియా బ్మాడ్మింటన్ ఫెడరేషన్‌కు ఫిర్యాదు చేసింది.

ఇదీ చదవండి:PV Sindhu: ఈ రికార్డులు ఒక్క పీవీ సింధుకే సాధ్యం

ABOUT THE AUTHOR

...view details