తెలంగాణ

telangana

పతకాల వేటలో సింధు, లక్ష్య.. నేటి నుంచే ఆసియా బ్యాడ్మింటన్‌

By

Published : Apr 26, 2022, 7:00 AM IST

Badminton Asia Championships 2022: నేటి (మంగళవారం) నుంచే ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్​షిప్ 2022 ప్రారంభంకానుంది. జోరుమీదున్న స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్​ పతకాలపై గురిపెట్టారు. సింధు.. మహిళల సింగిల్స్‌ తొలి మ్యాచ్‌లో పాయ్‌ యు పో (చైనీస్‌ తైపీ)తో తలపడనుంది. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో లి షి ఫెంగ్‌ (చైనా)తో పోటీపడనున్నాడు సేన్.

Badminton Asia Championships 2022
PV Sindhu

Badminton Asia Championships 2022: ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌కు వేళైంది.. మంగళవారం ప్రారంభం కానున్న ఈ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్లు పి.వి.సింధు, లక్ష్యసేన్‌ పతకాలపై గురిపెట్టారు. ఫామ్‌లో ఉన్న సింధు.. మహిళల సింగిల్స్‌ తొలి మ్యాచ్‌లో పాయ్‌ యు పో (చైనీస్‌ తైపీ)తో తలపడనుంది. క్వార్టర్‌ఫైనల్లో అయిదో సీడ్‌ బింగ్‌ జియావో (చైనా).. నాలుగో సీడ్‌ సింధుకు ఎదురయ్యే అవకాశం ఉంది.

మరో భారత స్టార్‌ సైనా నెహ్వాల్‌.. తొలి మ్యాచ్‌లో సిమ్‌ యుజిన్‌ (కొరియా)ను ఢీకొంటుంది. గాయాల నుంచి కోలుకున్న సైనా.. ఇటీవల కామన్వెల్త్‌ క్రీడలు, ఆసియా క్రీడలు, ఉబెర్‌ కప్‌ సెలక్షన్‌ ట్రయల్స్‌కు దూరమైంది. ట్రయల్స్‌లో విజేతగా నిలిచి ఈ మూడు మెగా ఈవెంట్లకు అర్హత సాధించిన ఆకర్షి కశ్యప్‌ కూడా ఆసియా బ్యాడ్మింటన్‌లో బరిలో ఉంది. తొలి రౌండ్లో అకానె యమగూచి (జపాన్‌)తో ఆమె పోటీపడనుంది.

ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌ రజత పతక విజేత లక్ష్యసేన్‌.. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో లి షి ఫెంగ్‌ (చైనా)తో తలపడనున్నాడు. 2020 ఆసియా టీమ్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన సేన్‌.. 2016 ఆసియా జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం, 2018 జూనియర్‌ టోర్నీలో పసిడి గెలిచాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచిన కిదాంబి శ్రీకాంత్‌ తొలి రౌండ్లో యంగ్‌ (మలేసియా)తో పోటీపడనుండగా.. జొనాథన్‌ క్రిస్టీతో సాయిప్రణీత్‌ ఢీకొనబోతున్నాడు.

పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌శెట్టిలకు మూడో సీడింగ్‌ లభించింది. తొలి రౌండ్లో సాత్విక్‌ జంట... గెటెర్‌హాంగ్‌-నచానన్‌ (థాయ్‌లాండ్‌)తో భారత జంట ఆడనుంది. ఇటీవల జాతీయ సెలక్షన్స్‌లో అగ్రస్థానంలో నిలిచి ఆసియా క్రీడలు, థామస్‌ కప్‌కు ఎంపికైన అర్జున్‌-ధ్రువ్‌ కపిల తొలి రౌండ్లో ఫాజర్‌-రియాన్‌ (ఇండోనేసియా) జోడీతో ఆడనున్నారు. పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్‌, మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప, గాయత్రి గోపీచంద్‌-త్రిసా జాలీ గాయాల కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్నారు.

ఇదీ చూడండి:భార్య పర్మిషన్​తో మాజీ క్రికెటర్ రెండో పెళ్లి.. 28 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నా...

ABOUT THE AUTHOR

...view details