తెలంగాణ

telangana

ఆసియా ఛాలెంజ్​కు భారత్‌ సై.. సింధు, ప్రణయ్​ పైనే ఆశలు

By

Published : Feb 14, 2023, 7:15 AM IST

కరోనా కారణంగా మూడేళ్ల పాటు నిలిచిపోయిన ఆసియా మిక్స్‌డ్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్స్‌ మళ్లీ ప్రారంభం కానుంది. నేడు మొదలు కానున్న ఈ టోర్నీలో సత్తా చాటాలని భారత్ పట్టుదలతో ఉంది. ఈ పోటీల్లో.. గాయం నుంచి పూర్తిగా కోలుకుని ఉత్సాహంతో కనిపిస్తున్న పీవీ సింధు, జోరుమీదున్న హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ భారత్‌కు కీలకం కానున్నారు. మరి ఎలా ఆడతారో చూడాలి.

Asia mixed team championships
ఆసియా సవాలుకు భారత్‌ సై.. సింధు, ప్రణయ్​ పైనే ఆశలు

ఆసియా మిక్స్‌డ్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్స్‌ సవాలుకు భారత్‌ సిద్ధమైంది. టోర్నీ తొలిరోజు మంగళవారం గ్రూప్‌- బి పోరులో కజకిస్థాన్‌తో తలపడుతుంది. గాయం నుంచి పూర్తిగా కోలుకుని ఉత్సాహంతో కనిపిస్తున్న పీవీ సింధు, జోరుమీదున్న హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ భారత్‌కు కీలకం కానున్నారు. నిరుడు కామన్వెల్త్‌ క్రీడల సందర్భంగా గాయపడ్డ సింధు.. ఈ సీజన్‌లో ఆడిన మలేసియా ఓపెన్‌, ఇండియా ఓపెన్‌లో తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌తో ఈ ఛాంపియన్‌షిప్స్‌లో సత్తాచాటాలని ఈ ప్రపంచ ఏడో ర్యాంకర్‌ చూస్తోంది.ఈమెతో పాటు మహిళల సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్‌ కూడా ఉంది.

ఇక పురుషుల సింగిల్స్‌లో జట్టుకు విజయాలు అందించే బాధ్యత ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్‌ ప్రణయ్‌, పదో ర్యాంకర్‌ లక్ష్యసేన్‌పై ఉంది. సాత్విక్‌ సాయిరాజ్‌ తుంటి గాయంతో దూరమవడంతో పురుషుల డబుల్స్‌లో ధ్రువ్‌తో చిరాగ్‌ శెట్టి జతకట్టాడు. కృష్ణప్రసాద్‌- విష్ణువర్ధన్‌ జోడీ కూడా బరిలో ఉంది.

మహిళల డబుల్స్‌లో గాయత్రి- ట్రీసా జంట ఆశలు రేపుతోంది. వీళ్లకు ప్రత్యామ్నాయంగా అశ్విని భట్‌- శిఖా ద్వయం సిద్ధంగా ఉంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ భారాన్ని ఇషాన్‌- తనీష మోయనున్నారు.

గ్రూప్‌- బిలో బలమైన మలేసియా, యూఏఈ కూడా ఉన్నాయి. మొత్తం 17 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్‌- సిలో అయిదు జట్లున్నాయి. గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు క్వార్టర్స్‌ చేరతాయి.

ఇకపోతే టోర్నీ ఆరంభ సీజన్‌ (2017)లో క్వార్టర్స్‌ చేరిన భారత్‌.. 2019లో గ్రూప్‌ దశ దాటలేకపోయింది. కరోనా కారణంగా మూడేళ్ల తర్వాత మళ్లీ టోర్నీ జరుగనుంది.

ఇదీ చూడండి:మహిళల ప్రీమియర్​ లీగ్‌ వేలం.. రేసులో నిలిచిన తెలుగు ప్లేయర్లు వీళ్లే..!

ABOUT THE AUTHOR

...view details