తెలంగాణ

telangana

Virat ODI Captaincy: 'కెప్టెన్సీ నిర్ణయంలో పారదర్శకత లేదు'

By

Published : Dec 11, 2021, 6:00 PM IST

Virat ODI Captaincy: టీమ్​ఇండియా వన్డే జట్టు కెప్టెన్​గా విరాట్​ను తప్పించడంపై కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్​కుమార్ శర్మ స్పందించాడు. బీసీసీఐ నిర్ణయంలో పారదర్శకతలేదని అన్నాడు. మరోవైపు కోహ్లీ కెప్టెన్సీ మార్పుపై సెలెక్షన్‌ కమిటీ తీరును పాకిస్థాన్ మాజీ స్పిన్నర్‌ డానిష్ కనేరియా తప్పుబట్టాడు.

virat kohli
విరాట్ కోహ్లీ

Virat ODI Captaincy: భారత వన్డే జట్టు సారథిగా విరాట్‌ కోహ్లీని తప్పిస్తూ రోహిత్‌ శర్మను నియమించడంపై ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది. సెలెక్షన్‌ కమిటీ మంచి నిర్ణయం తీసుకుందని పలువురు మాజీలు అభిప్రాయపడగా.. మరికొందరు ఇలా చేయడం తప్పని వాదిస్తున్నారు. ఈ క్రమంలో కెప్టెన్సీ మార్పు చేయడానికి గల కారణాన్ని సెలెక్షన్‌ కమిటీ సరిగ్గా చెప్పలేకపోయిందని విరాట్‌ కోహ్లీ చిన్ననాటి కోచ్‌ రాజ్‌కుమార్ శర్మ ఆక్షేపించాడు.

"సారథిగా విరాట్‌ స్థానంలో రోహిత్‌ను నియమించడంపై సెలెక్షన్‌ కమిటీ సరైన కారణం వెల్లడించలేదు. అసలు జట్టు మేనేజ్‌మెంట్ లేదా బీసీసీఐ లేదా సెలెక్టర్లకు ఏమి కావాలో మాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. దానిపై సరైన వివరణ లేదు. పారదర్శకత లోపించింది"

--రాజ్​కుమార్ శర్మ, కోహ్లీ చిన్ననాటి కోచ్.

వన్డే కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ జట్టును విజయవంతంగా నడిపాడని రాజ్‌కుమార్‌ శర్మ గుర్తు చేశాడు. అతడిని తప్పించడం సరైంది కాదన్నాడు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ వివరణ తనను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసిందని పేర్కొన్నాడు.

"టీ20 సారథ్యం నుంచి దిగిపోవద్దని కోహ్లీని బీసీసీఐ కోరినట్లు గంగూలీ వెల్లడించిన విషయాలను ఇటీవలే చదివా. అయితే అలా అడిగినట్లు నాకైతే గుర్తు లేదు. అలాంటి స్టేట్‌మెంట్‌ రావడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో విభిన్న కథనాలు బయటకు వస్తున్నాయి. కెప్టెన్‌ మార్పు జరిగిన తర్వాత నేను కోహ్లీతో మాట్లాడలేదు. కొన్ని కారణాల వల్ల అతడి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసినట్లు ఉన్నాడు. అయితే నా అభిప్రాయం ప్రకారం.. టీ20 కెప్టెన్‌గా తనకుతానే తప్పుకున్నాడు. అయితే ఆ సమయంలోనే వన్డే సారథ్యం నుంచి కూడా తప్పుకోమని సెలెక్టర్లు అడగాల్సింది. లేకపోతే దేని నుంచీ వైదొలగవద్దు అని చెబితే బాగుండేది"

--రాజ్‌కుమార్‌ శర్మ.

సరైన గౌరవం ఇవ్వలేదు..

కోహ్లీ కెప్టెన్సీ మార్పుపై సెలెక్షన్‌ కమిటీ తీరును పాకిస్థాన్ మాజీ స్పిన్నర్‌ డానిష్ కనేరియా తప్పుబట్టాడు. టీమ్‌ఇండియా జట్టును సారథిగా కోహ్లీ నడిపించిన తీరు బాగుందని అభినందించాడు. అయితే కోహ్లీ స్థానంలో రోహిత్‌ను భర్తీ చేసిన విధానంలోనే బీసీసీఐ పొరపాటు పడిందని అభిప్రాయపడ్డాడు. కోహ్లీకి సరైన గౌరవం ఇవ్వకుండా సెలెక్షన్‌ కమిటీ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నాడు.

విరాట్ కోహ్లీ

"విరాట్‌ను మార్చడం బీసీసీఐ చేసిన పని మంచిదా? కాదా? అనే దాని గురించి చెప్పలేను. అయితే అతడికి సరైన గౌరవం ఇవ్వలేదని మాత్రం చెప్పగలను. అత్యధిక విజయాల శాతం కలిగిన సారథులలో కోహ్లీ నాలుగోవాడు. భారత వన్డే కెప్టెన్‌గా ఎక్కువ పరుగులు చేశాడు. ఐసీసీ ట్రోఫీని మాత్రం గెలిపించలేకపోయాడు. అయితే అతడు జట్టును నడిపించిన తీరు మాత్రం అసాధారణం. కోహ్లీ రికార్డుల ఆధారంగానైనా గౌరవానికి అర్హుడు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ టీమ్‌ఇండియా మాజీ సారథి కూడానూ. అతడైనా 'నీ స్థానంలో రోహిత్‌ను వన్డే కెప్టెన్‌గా పెడుతున్నాం' అని కోహ్లీతో వ్యక్తిగతంగా మాట్లాడితే బాగుండేది"

-- డానిష్ కనేరియా, పాక్ మాజీ స్పిన్నర్.

ప్రస్తుతం భారత వన్డే, టీ20 జట్లకు రోహిత్ శర్మ నాయకత్వం వహించనుండగా.. టెస్టు జట్టుకు విరాట్ కోహ్లీ సారథిగా ఉంటాడు.

ఇదీ చదవండి:

'కెప్టెన్సీ రికార్డుని బట్టి ఆటగాడి విలువను చెప్పలేం'

కెప్టెన్​గా కోహ్లీ తొలగింపు.. బీసీసీఐపై అభిమానుల ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details