తెలంగాణ

telangana

T20 World Cup: భారత్​ X ఇంగ్లాండ్​.. ఫైనల్​ చేరెదెవరో? పాక్​తో ఆడేదెవరో?

By

Published : Nov 9, 2022, 7:08 PM IST

T20 World Cup Ind Vs Eng : టీ20 ప్రపంచకప్‌లో రెండో సెమీఫైనల్ గురువారం జరగనుంది. భారత్‌ జట్టు ఇంగ్లాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. సూపర్‌-12లో..అద్భుత ప్రతిభ కనబర్చిన భారత్‌ జట్టు.. ఫైనల్‌ బెర్తు కోసం బ్రిటీష్‌ జట్టుతో తలపడనుంది. నాకౌట్‌ మ్యాచ్‌ను దృష్టిలో పెట్టుకొని భారత బ్యాటింగ్‌ విభాగంలో కొన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు లీగ్‌ దశలో మెరుగైన ప్రదర్శన కనబర్చడంలో విఫలమైన ఇంగ్లాండ్..సెమీస్‌లో స్థాయికి తగ్గట్టు రాణించాలని భావిస్తోంది.

t20 world cup india vs england semifinal match preview
t20 world cup india vs england semifinal match preview

T20 World Cup Ind Vs Eng :టీ20 ప్రపంచకప్‌ రెండో సెమీఫైనల్‌ భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య అడిలైడ్ వేదికగా జరగనుంది. సూపర్-12లో దక్షిణాఫ్రికా మినహా మిగతా నాలుగు జట్లపై మెరుగైన ఆటతీరు కనబర్చిన రోహిత్ సేన.. నాకౌట్ దశలో ఇంగ్లాండ్ తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఐసీసీ టోర్నీల్లో ఇంగ్లాండ్‌పై ఇప్పటివరకూ మెరుగైన ఆటతీరు కనబర్చడం, భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతోంది.

అయితే 2013 తర్వాత నుంచి ఐసీసీ టోర్నీల్లో లీగ్ దశను సునాయాసంగా అధిగమిస్తున్న భారత్ జట్టు నాకౌట్ దశలో మాత్రం తడబడుతూ వస్తోంది. 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్, 2016లో సెమీఫైనల్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్ లో ఓటమి చవిచూసింది. ఈసారి ఈ సమస్యను ఎలాగైనా అధిగమించాలని రోహిత్ సేన వ్యూహాలు రచిస్తోంది. బ్యాటింగ్ విభాగంలో ఓపెనింగ్ జోడీ.. రోహిత్, కేఎల్​ రాహుల్‌ స్థాయికి తగ్గట్టు రాణించాలని జట్టు భావిస్తోంది. గత రెండు మ్యాచ్‌లలో రాహుల్‌ ఆర్ధశతకాలు చేయడం జట్టుకు ఊరట కలిగిస్తోంది. రోహిత్‌ కూడా తన మునుపటి ఫాం అందుకుంటే భారీ స్కోర్‌ ఖాయమని యోచిస్తోంది.

విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌ అద్భుతంగా రాణిస్తుండగా.. వికెట్ కీపర్లుగా ఉన్న దినేశ్ కార్తీక్, రిషబ్‌ పంత్‌ ఈ టోర్నీలో పెద్దగా రాణించలేదు. వీరిలో ఎవరికి తుది జట్టులో చోటు దక్కుతుందో చూడాల్సి ఉంది. అయితే ఇంగ్లాండ్‌ జట్టును దృష్టిలో పెట్టుకొని వీలైనంత ఎక్కువ మంది బ్యాటర్లు ఉండాలనే అంచనాతో వీరిద్దరినీ తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. లెఫ్ట్ ఆమ్ బ్యాటర్ కు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సారథి రోహిత్ సంకేతాలు ఇచ్చినందున పంత్ కు కూడా అవకాశం ఇస్తారని అర్థమవుతోంది.

పేస్ బౌలింగ్‌ విభాగంలో భువనేశ్వర్‌, అర్షదీప్, మహ్మద్‌ షమీతోపాటు హార్దిక్‌ పాండ్యా స్థాయికి తగ్గట్టు రాణిస్తే ఇంగ్లీష్‌ బ్యాటర్లను కట్టడి చేయవచ్చని భారత జట్టు భావిస్తోంది. స్పిన్​ విభాగంలో అక్షర్‌ పటేల్‌ భారీగా పరుగులు ఇస్తుండగా యజువేంద్ర చాహల్‌ను తీసుకునే ధైర్యం చేయకపోవచ్చని తెలుస్తోంది. ఆల్ రౌండర్ దీపక్ హుడా కూడా.. ప్రాక్టీస్ చేస్తున్నందున అల్ రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో హుడాను తీసుకునే సూచనలు ఉన్నాయి.

మరోవైపు ఇంగ్లాండ్ జట్టు కూడా సెమీస్‌లో భారత్‌పై నెగ్గి టైటిల్‌కు చేరువ కావాలని వ్యూహాలు రచిస్తోంది. జోస్‌ బట్లర్, బెన్ స్టోక్స్, అలెక్స్ హెల్స్, లివింగ్‌స్టోన్స్ వంటి బ్యాటర్లతోపాటు సామ్ కరన్, మొయిన్ అలీ వంటి ఆల్‌ రౌండర్లతో ఇంగ్లాండ్ జట్లు బ్యాటింగ్‌ లైనప్ బలీయంగానే ఉంది. అయితే ఫాస్ట్ బౌలర్ మార్క్‌ వుడ్‌ గాయం కారణంగా దూరం కావడం.. ఇంగ్లాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కీలక బ్యాటర్ డేవిడ్ మలాన్ కూడా గాయపడగా తుది జట్టులో ఆడే అంశంపై సందిగ్ధం నెలకొంది. మార్క్ వుడ్ స్థానంలో జోర్డాన్ లేదా మిల్స్‌ను ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు.. టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌.. భారత్‌, పాకిస్థాన్​ జట్ల మధ్య జరగాలని కోరుకున్నారు. ఇప్పటికే పాకిస్థాన్​ జట్టు ఫైనల్‌ చేరినందున.. భారత్‌ కూడా తుదిపోరుకు చేరాలని ఆకాంక్షిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details