తెలంగాణ

telangana

T20 World Cup 2021: విరాట్, రోహిత్​.. ఈ రికార్డులు బ్రేక్ చేస్తారా?

By

Published : Oct 18, 2021, 12:09 PM IST

Updated : Oct 18, 2021, 1:53 PM IST

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీ20 ప్రపంచకప్​ ప్రారంభమైపోయింది. పాకిస్థాన్​తో టీమ్​ఇండియా తొలి మ్యాచ్ అక్టోబర్​ 24న​ ఆడనుంది. ఈ సందర్భంగా టీ20 ప్రపంచకప్​లో భారత స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్​ శర్మ బ్రేక్ చేయబోయే రికార్డులపై ఓ లుక్కేయండి.

T20 World Cup 2021
విరాట్​ కోహ్లీ

ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులను ఉర్రుతలూగించే టీ20 ప్రపంచకప్​లో ఆదివారమే క్వాలిఫైయింగ్ మ్యాచ్​లు ప్రారంభమైంది. అక్టోబర్​ 24న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్​తో టీమ్​ఇండియా పోరు కోసం అభిమానులు ఆత్రుతగా వేచిచూస్తున్నారు. ధనాధన్ ఇన్నింగ్స్​లతో కోలాహలంగా సాగే ఈ టోర్నీలో టీమ్​ఇండియా సారథి విరాట్​ కోహ్లీ, వైస్ కెప్టెన్​ రోహిత్​ శర్మ సహా పలువురు క్రీడాకారులు కొన్ని అరుదైన రికార్డులకు చేరువలో ఉన్నారు. అవేంటంటే?

విరాట్ కోహ్లీ

విరాట్

ఈ టీ20 ప్రపంచకప్​.. కెప్టెన్​గా తనకు చివరిదని విరాట్ కోహ్లీ ఇప్పటికే ప్రకటించాడు. అయితే వ్యక్తిగతంగా కోహ్లీ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్​లో అత్యధిక పరుగుల వీరుడిగా (Most T20 World Cup Runs) నిలవడానికి అతడు మరో 240 పరుగులు చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం 16 మ్యాచుల్లో 86.33 సగటుతో 777 పరుగులతో ఉన్నాడు కోహ్లీ.

ఇదివరకు ఈ రికార్డు శ్రీలంక మాజీ సారథి మహేలా జయవర్ధనే (39 సగటుతో 1016 పరుగులు) పేరిట ఉంది. టీ20 ప్రపంచకప్​లో వెయ్యికి పైగా పరుగులు చేసింది అతడొక్కడే.

రోహిత్​ శర్మ

రోహిత్

వైస్ కెప్టెన్ రోహిత్​ శర్మను కూడా మరో ఘనత ఊరిస్తోంది. మరో 10 సిక్సర్లు బాదితే ప్రపంచకప్​లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్​మన్​గా (Most Sixes by Indian Player) నిలుస్తాడు. ఇప్పటికే 28 మ్యాచుల్లో 24 సిక్సులు, 59 ఫోర్లు బాదాడు హిట్​మ్యాన్​. మాజీ ఆల్​రౌండర్​ యువరాజ్​ సింగ్​ భారత తరఫున రోహిత్ కంటే ముందున్నాడు. 2007లో స్టువర్ట్​ బ్రాడ్ బౌలింగ్​లో 6 బంతుల్లో 6 సిక్సర్లతో కలిపి 31 మ్యాచుల్లో 33 సిక్సర్లు బాదాడు యువీ.

రోహిత్​.. అత్యధిక సిక్సులు (Most Sixes in T20 World Cup) బాదిన జాబితాలో ప్రస్తుతం బ్రావోతో కలిసి ఆరో స్థానంలో ఉన్నాడు. ఇంకో 10 సిక్సర్లతో ఏకంగా రెండో స్థానానికి కూడా చేరుకునే అవకాశం ఉంది. క్రిస్ గేల్ (60), యువీ (33), షేన్ వాట్సన్ (31), ఏబీ డివిలియర్స్ (30), జయవర్ధనే (25) అతడి కన్నా ముందున్నారు.

షకీబ్​ అల్ హసన్

షకీబ్ అల్ హసన్

ఐపీఎల్​ 2021లో కేకేఆర్​ తరఫున అద్భుత ప్రదర్శన చేసిన షకీబ్​.. టీ20 ప్రపంచకప్​లో మరో 10 వికెట్లు తీస్తే అత్యధిక వికెట్లు (Most T20 World Cup Wickets) తీసిన ఘనత దక్కుతుంది. అతడు 25 మ్యాచుల్లో 30 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (39 వికెట్లు) అగ్రస్థానంలో ఉన్నాడు.

డ్వేన్ బ్రావో

బ్రావో

మరో 7 మ్యాచులాడితే టీ20 ప్రపంచకప్​లో ఎక్కువ మ్యాచులాడిన (Most Matches in T20 World Cup) ఘనత బ్రావోకు (29 మ్యాచులు) దక్కుతుంది. ప్రస్తుతానికి ఈ రికార్డు శ్రీలంక మాజీ క్రికెటర్ తిలకరత్నే దిల్షాన్ (35 మ్యాచులు) పేరిట ఉంది.

మార్టిన్ గప్తిల్

మార్టిన్ గప్తిల్

మరో 61 పరుగులు చేస్తే.. అంతర్జాతీయ టీ20ల్లో 3000 పరుగుల చేసిన (3000 runs in t20) రెండో క్రికెటర్​గా ఈ న్యూజిలాండ్ బ్యాటర్​ రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం 2939 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో కోహ్లీ (3159) అగ్రస్థానంలో, రోహిత్ (2864) మూడో స్థానంలో ఉన్నారు.

టిమ్​ సౌథీ

కోహ్లీతో సౌథీ

న్యూజిలాండ్ పేసర్​ సౌథీ ఇంకొక్క వికెట్​ తీస్తే అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్లు తీసిన (100 Wickets in T20 International) మూడో బౌలర్​ ఘనత దక్కుతుంది. షకీబ్ (108), మలింగ (107) మాత్రమే అతడి కన్నా ముందున్నారు.

రషీద్​ ఖాన్

రషీద్ ఖాన్

అఫ్గానిస్థాన్ స్పిన్నర్​ రషీద్​ ఖాన్​ కూడా మరో 5 వికెట్లు పడగొడితే అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్లు (100 Wickets in T20 International) సాధించిన ఘనత దక్కుతుంది.

ఇదీ చూడండి:టీ20​ ప్రపంచకప్​ షురూ.. ఇవి తెలుసుకోండి..

Last Updated : Oct 18, 2021, 1:53 PM IST

ABOUT THE AUTHOR

...view details