తెలంగాణ

telangana

WPL 2023: ఎలిమినేటర్​ మ్యాచ్​లో యూపీపై విజయం.. ఫైనల్​కు ముంబయి

By

Published : Mar 24, 2023, 10:45 PM IST

Updated : Mar 24, 2023, 10:54 PM IST

డబ్ల్యూపీఎల్​ 2023లో భాగంగా జరిగిన ఎలిమినేటర్​ మ్యాచ్​లో యూపీ వారియర్స్​పై ముంబయి ఇండియన్స్​ విజయం సాధించింది. ఫలితంగా ఫైనల్​కు దూసుకెళ్లింది. తుదిపోరులో దిల్లీతో తలపడనుంది.

WPL 2023: ఎలిమినేటర్​ మ్యాచ్​లో యూపీపై విజయం.. ఫైనల్​కు ముంబయి
WPL 2023: ఎలిమినేటర్​ మ్యాచ్​లో యూపీపై విజయం.. ఫైనల్​కు ముంబయి

డబ్ల్యూపీఎల్​ 2023లో భాగంగా నేడు(మార్చి 24) జరిగిన ఎలిమినేటర్​ మ్యాచ్​లో యూపీ వారియర్స్​పై ముంబయి ఇండియన్స్​ గెలుపొందింది. 72 పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్​కు అర్హత సాధించింది. ఇక తుదిపోరులో దిల్లీ క్యాపిటల్స్​తో తలపడనుంది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్స్​.. 17.4ఓవర్లలో ఆలౌట్​ అయి 110 పరుగులకే పరిమితమైంది. కిరన్​ నవ్​గిరే(43) టాప్ స్కోరర్​. గ్రేస్​ హ్యారిస్​(14), దీప్తి శర్మ(16) రన్స్ చేశారు. మిగతా వారు విఫలమయ్యారు. ప్రత్యర్థి బౌలర్లలో ఇస్సీ వాంగ్​ 4 వికెట్లతో ఆకట్టుకోగా.. సైకా ఇషాక్​ రెండు వికెట్లు తీసింది. మిగతా వారు తలో వికెట్ తీశారు.

అంతకుముందు టాస్‌ ఓడి ఫస్ట్​ బ్యాటింగ్​కు దిగిన ముంబయి టీమ్​ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. నాట్‌సీవర్‌ బ్రంట్‌ (72*; 38 బంతుల్లో 9×4, 2×6) హాఫ్​ సెంచరీతో మెరవగా.. ఓపెనర్లు యాస్తికా భాటియా(21), హెయిలీ మ్యాథ్యూస్‌ (26), హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (14), కేర్‌ (29) పరుగులు చేశారు. బ్యాటింగ్‌ చేసిన ముంబయికు.. మొదటి నుంచే ఇన్నింగ్స్‌ నెమ్మదిగా ఆడింది. ఓపెనర్లు భాటియా, మ్యాథ్యూస్‌ జాగ్రత్తగా ఆడుతూ.. ఇన్నింగ్స్‌ నిర్మించే ప్రయత్నం చేశారు. అయితే క్రీజులో కుదురుకుంటున్న ఈ జంటను అంజలి శ్రావణి విడగొట్టింది. ఐదో ఓవర్‌ సెకండ్ బాల్​కు భాటియా.. కిరణ్‌ నవగిరేకి క్యాచ్ ఇచ్చి భాటియా ఔట్ అయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన బ్రంట్‌తో కలిసి మ్యాథ్యూస్‌ ఇన్నింగ్స్‌ దారిలో పెట్టేందుకు ప్రయత్నించింది. కానీ, జట్టు స్కోరు 69 పరుగుల దగ్గర చోప్రా బౌలింగ్‌లో కిరణ్‌ నవగిరే చేతికే చిక్కింది.

కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ కూడా తక్కువ స్కోరుకే ఔట్ అవ్వడంతో జట్టు భారాన్ని బ్రంట్‌ తనపై వేసుకుని ఆడింది. క్రీజులో జాగ్రత్తగా ఆడుతూ.. కుదిరినప్పుడల్లా బౌండరీలు కొడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లింది. థర్డ్‌ డౌన్‌లో వచ్చిన కేర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. అవతలి ఎండ్‌లో వస్తున్న బ్యాటర్లు తక్కువ స్కోరుకే వెనుదిరుగుతున్నా.. బ్రంట్‌ మాత్రం కాన్ఫిడెన్స్​ కోల్పోకుండా ఆడుతూ ముందుకు వెళ్లింది. అలా ముంబయి.. యూపీ ముందు 183 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. యూపీ బౌలర్లలో సోఫీ రెండు వికెట్లు తీయగా.. అంజలి శ్రావణి, పర్షవి చోప్రా చెరో వికెట్‌ దక్కించుకున్నారు. కాగా, ముంబయి-దిల్లీ మధ్య ఫైనల్ మ్యాచ్​ ఆదివారం(మార్చి 26న) బ్రబోర్న్ స్టేడియం వేదికగా జరగనుంది.

ఇదీ చూడండి:వారం రోజుల్లోనే IPL.. ఆటగాళ్లను వేధిస్తున్న గాయాలు.. ఎవరెవరు దూరమయ్యారంటే?

Last Updated : Mar 24, 2023, 10:54 PM IST

ABOUT THE AUTHOR

...view details