తెలంగాణ

telangana

ఆర్సీబీ టైటిల్ ఆశలు గల్లంతు.. గావస్కర్ ఏమన్నాడంటే?

By

Published : Oct 12, 2021, 12:13 PM IST

ఆర్సీబీ కెప్టెన్​గా చివరిసారైనా కప్పు గెలవాలని ఆశించిన విరాట్ ​కోహ్లీకి(Virat Captaincy) నిరాశే ఎదురైంది. దీనిపై స్పందించిన టీమ్​ఇండియా దిగ్గజ బ్యాట్స్​మన్ సునీల్ గావస్కర్(Gavaskar on Kohli).. అన్నీ మనం అనుకున్నట్లే జరగవని వ్యాఖ్యానించాడు.

gavaskar
సునీల్ గావస్కర్

ఆటలో ప్రతి ఒక్కరూ ఘనమైన ముగింపు ఇవ్వాలని అనుకుంటారని.. అయితే అన్నీ మనం అనుకున్నట్లు జరగవని టీమ్ఇండియా దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సునీల్‌ గావస్కర్‌(Sunil Gavaskar Virat Kohli) అన్నాడు. సోమవారం రాత్రి కోల్‌కతాతో తలపడిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో బెంగళూరు(RCB vs KKR 2021) ఓటమిపాలైంది. దీంతో ఆర్సీబీ కెప్టెన్‌గా చివరిసారైనా కప్పు సాధించాలని ఆశించిన విరాట్‌ కోహ్లీకి(Kohli Captaincy) నిరాశే ఎదురైంది. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌లో అతడు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొంటున్న నేపథ్యంలో గావస్కర్‌ స్పందించాడు. ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ తాను కూడా నిరాశకు గురైనట్లు చెప్పాడు.

"ఇది కచ్చితంగా నిరాశ కలిగించేదే. ప్రతి ఒక్కరూ చాలా గొప్పగా ముగింపు ఇవ్వాలని అనుకుంటారు. కోహ్లీ కూడా వ్యక్తిగతంగా అలాగే భావించి ఉంటాడు. కానీ, ఇలాంటి విషయాలు ఎప్పుడూ మనం అనుకున్నట్లు లేదా అభిమానులు ఆశిస్తున్నట్లు జరగవు. బ్రాడ్‌మన్‌లాంటి దిగ్గజాన్ని చూడండి ఏం జరిగిందో. అతడి కెరీర్‌లో 100 సగటు సాధించడానికి చివరి మ్యాచ్‌లో నాలుగు పరుగులే అవసరమయ్యాయి. కానీ, అందులోనే డకౌటయ్యాడు. అలాగే సచిన్‌ను చూడండి. తన 200వ టెస్టులో శతకంతో ముగించాలని అనుకొని ఉంటాడు. కానీ 79 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఎప్పుడూ మనం ఊహించినట్లు రాసిపెట్టి ఉండదు. అందరూ ఘనంగా ముగింపు ఇవ్వాలంటే కుదరదు"

-గావస్కర్‌, మాజీ క్రికెటర్.

అలాగే కోహ్లీ(Kohli Captaincy in IPL) ఆర్సీబీకి ఆయువుపట్టులా మారాడని, ఆ జట్టుకు ఒక ప్రత్యేకత తీసుకొచ్చాడని గావస్కర్‌ ప్రశంసించాడు. ఈ విషయాన్ని ఎవరూ కాదనలేరని.. శక్తివంచన లేకుండా జట్టు కోసం పాటుపడ్డాడని మెచ్చుకున్నాడు. 2016 సీజన్‌లో 973 పరుగులు సాధించాడని, ఇది చాలా అరుదైన విషయమని తెలిపాడు. బెంగళూరుకు ఒక బ్రాండ్‌ తీసుకొచ్చాడని తెలిపాడు. ఇలాంటి గొప్ప ఆటగాడు ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవకపోవడం బాధాకరమన్నాడు. ఇకపై కెప్టెన్‌గా తప్పుకొన్నా ఆటగాడిగా అదే జట్టు తరఫున కొనసాగడం కోహ్లీ అంకితభావానికి నిదర్శనమని మాజీ క్రికెటర్‌ ప్రశంసించాడు.

కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 138/7 స్వల్ప స్కోర్‌ చేసింది. అనంతరం కోల్‌కతా 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో మోర్గాన్‌ టీమ్‌ తర్వాతి మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.

ఇదీ చదవండి:

ముగిసిన కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్.. రికార్డులివే!

ABOUT THE AUTHOR

...view details